షావోమీ కొత్త ఈవీ.. హిస్టరీ క్రియేట్ చేసిందిగా!
షావోమీ సంస్థ తాజాగా వైయూ7 పేరుతో లాంఛ్ చేసిన కారు తొలి గంటలోనే 2.89 లక్షల ఆర్డర్ ను సొంతం చేసుకుంది.;
నిమిషంలో వేలాది ఫోన్లను ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టేసే తీరు గతంలో చూశాం. చైనాకు చెందిన షియోమీ ఫోన్లు భారతదేశంలో ఎంట్రీ ఇచ్చినప్పుడు.. ఆ ఫోన్లను సొంతం చేసుకోవటానికి పడే ఆత్రుత చూశాం. సెల్ ఫోన్ల మాదిరి ఈవీ కార్లను కొనుగోలు చేసేందుకు హడావుడి పడే పరిస్థితి ఇప్పటివరకు చూసింది లేదు. ఆ కొరతను తీర్చేసింది చైనాకు చెందిన షావోమీ కార్ల కంపెనీ. తాజాగా ఈ సంస్థ లాంఛ్ చేసిన ఎలక్ట్రికల్ కారును సొంతం చేసుకోవటానికి.. బుకింగ్స్ స్టార్ట్ చేసిన గంటలోనే 3 లక్షల ఆర్డర్ ను సొంతం చేసుకోవటం ద్వారా.. యావత్ ప్రపంచం చూపు తనవైపు పడేలా చేసుకుంది షావోమీ.
షావోమీ సంస్థ తాజాగా వైయూ7 పేరుతో లాంఛ్ చేసిన కారు తొలి గంటలోనే 2.89 లక్షల ఆర్డర్ ను సొంతం చేసుకుంది. దీంతో.. ఈ సంస్థ షేర్లు ఏకంగా 8 శాతం దూసుకెళ్లాయి. అదే సమయంలో అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లాకు మరో షాక్ ఎదురైనట్లుగా చెప్పాలి. సెల్ ఫోన్లు.. ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను ఉత్పత్తి చేసే షావోమీ.. గత ఏడాది నుంచే ఎలక్ట్రికల్ కార్ల రంగంలోకి ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే.
టెస్లాలోని వై మోడల్ తో పోలిస్తే సావోమీకి చెందిన వైయూ మోడల్ 4 శాతం తక్కువ ధరకే లభించటంతో పాటు.. టెస్లా బ్యాటరీతో 719 కి.మీ. ప్రయాణిస్తే.. షావోమీ ఈవీ ఏకంగా 835కి.మీ. ప్రయాణించే సత్తా దీని సొంతం. సింగిల్ ఛార్జింగ్ తో ఇంత ఎక్కువ దూరం నడిచే కారు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. టెస్లాతో పోలిస్తే ఏకంగా వందకు పైగా కి.మీ. అదనపు సామర్థ్యం ఉండటగం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఇంతకూ ఈ కారు ధర ఎంతంటే.. 35 వేల డాలర్లుగా చెబుతున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే దగ్గర దగ్గర రూ30 లక్షలుగా చెప్పాలి. అమెరికాకు చెందిన టెస్లాకు అతి పెద్ద మార్కెట్ గా చైనా ఉంది.
ఈ సంస్థకు వచ్చే ఆదాయంలో 20 శాతం చైనా నుంచే వస్తోంది. 2020 నాటికి చైనాలో టెస్లా వాటా 15 శాతం ఉంటే.. ఇటీవల కాలంలో పెరిగిన పోటీ కారణంగా 10 శాతానికి పడిపోయింది. స్థానికంగా ఉన్న పోటీని తట్టుకునేందుకు ధరల్ని తగ్గిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా షావోమీ కొత్త కారు పుణ్యమా అని.. మరోసారి టెస్లాకు మరో సవాలు ఎదురైనట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర ఫీచర్లతో పాటు.. మెరుగైన ఫైనాన్స్ ఆప్షన్లు ఇవ్వటం లాంటి చేయకుంటే టెస్లాకు ఇబ్బందికర పరిస్థితి ఖాయమంటున్నారు.