హైదరాబాద్ vs బెంగళూరు: భారత ఐటీ సింహాసనం ఎవరిది?
గత దశాబ్దకాలంలో హైదరాబాద్ సాధించిన వృద్ధి అమోఘం. కేవలం ఐటీ మాత్రమే కాకుండా ఫార్మా లైఫ్ సెన్సెస్ రంగాల్లోనూ నగరం అగ్రగామిగా నిలిచింది.;
భారతదేశం అంటేనే ఇప్పుడు ప్రపంచానికి ఐటీ హబ్. ఒకప్పుడు అమెరికాలోని సిలికాన్ వ్యాలీ వైపు చూసిన ప్రపంచం.. ఇప్పుడు భారత్ లోని బెంగళూరు, హైదరాబాద్ నగరాల వైపుచూస్తోంది. ఈ రెండు నగరాల మధ్య పోటీ కేవలం ఐటీ కంపెనీల కోసమే కాదు.. ‘భారత ఐటీ భవిష్యత్తు ఎవరిది’ అనే స్థాయికి చేరుకుంది.
బెంగళూరు.. ఐటీ సామ్రాజ్యానికి అప్రతిహత మహారాజు
దశాబ్ధాలుగా భారత ఐటీ రంగానికి బెంగళూరు వెన్నెముకగా నిలిచింది. దేశంలోనే అత్యధిక యూనికార్న్ అయిన బిలియన్ డాలర్ల విలువైన స్టార్టప్స్ ఉన్న నగరం ఇది. వెంచర్ క్యాపిటలిస్టులు, ఇన్వెస్టర్లు ఇక్కడే ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నారు. ప్రపంచంలోని అత్యున్నత సాంకేతిక నిపుణులు ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉండే వాతావరణం విదేశీ ప్రతినిధులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. అయితే బెంగలూరుకు ప్లస్ లే కాదు.. మైనస్ లు కూడా ఉన్నాయి. విపరీతమైన ట్రాఫిక్ జామ్ లు, ఆకాశాన్ని తాకుతున్న ఇంటి అద్దెలు, మౌలిక సదుపాయాల పై పెరుగుతున్న ఒత్తిడి బెంగలూరుకు మైనస్ గా మారుతోంది.
హైదరాబాద్.. దూసుకుపోతున్న రేపటి విజేత
గత దశాబ్దకాలంలో హైదరాబాద్ సాధించిన వృద్ధి అమోఘం. కేవలం ఐటీ మాత్రమే కాకుండా ఫార్మా లైఫ్ సెన్సెస్ రంగాల్లోనూ నగరం అగ్రగామిగా నిలిచింది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలు పక్కా ప్లానింగ్ తో అభివృద్ధి చెందాయి. వెడల్పు అయిన రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ కు పెద్ద ప్లస్. బెంగలూరుతో పోలిస్తే ఇక్కడ జీవన వ్యయం తక్కువ. మధ్యతరగతి ఉద్యోగులు సొంత ఇల్లు కొనుక్కోవడానికి హైదరాబాద్ సానుకూలంగా ఉంటుంది. ఐటీ కంపెనీలను ఆకర్షించడంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఆపిల్, గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు తమ అతిపెద్ద క్యాంపస్ లను ఇక్కడ ఏర్పాటు చేసేలా చేశాయి. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య హైదరాబాద్ లో బంజారాహిల్స్ నుంచి గచ్చిబౌలి వరకూ భూమి ధరలు సుమారు 8 శాతం పెరిగాయి. బెంగళూరులో మాత్రం కొన్ని ప్రాంతాల్లో ధరలు చదరపు అడుగుకు 13వేల నుంచి రూ. 15 వేల వరకూ చేరుకోగా.. అవుట్ స్కర్ట్స్ లో రూ.9 వేల నుంచి 10వేల వరకూ ఉన్నాయి. రెంటల్ రిటర్న్స్ పరంగా చూస్తే బెంగళూరులో 3-4 శాతం, హైదరాబాద్ లో 3-3.5 శాతం మధ్యలో ఉన్నాయి.
భవిష్యత్తు ఎటువైపు?
ప్రస్తుతానికి బెంగళూరు నంబర్ 1 స్థానంలో ఉన్నప్పటికీ హైదరాబాద్ దాన్ని గట్టిగా సవాల్ చేస్తోంది. ముఖ్యంగా సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) , డేటా సెంటర్ల ఏర్పాటులో హైదరాబాద్ ముందంజలో ఉంది.
ఒక స్టార్టప్ పెట్టి ప్రపంచస్థాయికి ఎదగాలనుకునే యువతకు బెంగళూరు స్వర్గధామం. కానీ ప్రశాంతమైన జీవనం, మెరుగైన వసతులు , వేగవంతమైన కెరీర్ గ్రోత్ కోరుకునే వారికి హైదరాబాద్ బెస్ట్ ఛాయిస్. భారత ఐటీ భవిష్యత్తు ఈ రెండు నగరాల ఆరోగ్యకరమైన పోటీ మీదే ఆధారపడి ఉంది. ఓవరాల్ గా ఒకటి ఇప్పటి కింగ్ అయితే.. మరొకటి రాబోయే ఫ్యూచర్ హబ్ గా చెప్పొచ్చు.