పుట్టిన రోజు మరిచావా బాబూ...రాష్ట్రపతి గ్రీటింగ్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956లో ఉమ్మడిగా ఏర్పాటు అయింది. నాటి హైదరాబాద్ స్టేట్ తో కలసి అప్పటి ఆంధ్ర రాష్ట్రాన్ని నాటి దేశ ప్రధాని పండిట్ నెహ్రూ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.;
ఏపీ సీఎం చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ అనుభవంతో చాలా విషయాల్లో దార్శనీకుడిగా ఉంటారు. పాలనలో సంస్కరణలలో ఆయన ఆదర్శంగా కూడా ఉంటారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం ఆయన ఎందుకో ప్రజల సెంటిమెంట్స్ ని పక్కన పెడుతున్నారా అన్న చర్చ రాక మానదు, రాజకీయ తూకంలో సెంటిమెంట్లు ఎపుడూ తేలిపోతాయి. కానీ బాబు ఫక్తు రాజకీయ నేతగానే ఉంటారు. దానికే మొదటి ఓటు వేస్తారు. అందుకే ఆంధ్రుల సెంటిమెంట్ కొన్ని కీలక ఘట్టాలలో ఇబ్బందుల్లో పడుతోంది అన్నది మేధావుల వాదన.
ఏపీ పుట్టిన రోజు ఏదీ :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1956లో ఉమ్మడిగా ఏర్పాటు అయింది. నాటి హైదరాబాద్ స్టేట్ తో కలసి అప్పటి ఆంధ్ర రాష్ట్రాన్ని నాటి దేశ ప్రధాని పండిట్ నెహ్రూ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అలా నవంబర్ 1న ఏపీ ఏర్పాటు అయింది. 2013 దాకా అంతా అలాగే జరుపుకునేవారు. అయితే 2014లో మాత్రం రాష్ట్రం రెండుగా విడిపోయింది. జూన్ 2వ తేదీని అపాయింట్ డే కింద గుర్తిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ప్రతీ ఏటా జూన్ 2 తెలంగాణాకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా మారింది. ఏపీకి మాత్రం ఎటువంటి రోజూ లేకుండా ఆనాటి నుంచే పోయింది.
తొలి సీఎం గా ఉంటూ :
చంద్రబాబు తొలి సీఎం గా ఏపీకి ఉంటూ అయిదేళ్ళు విభజన ఏపీని పాలించినా కూడా ఏపీ ఫార్మేషన్ డేని నిర్వహించలేకపోయారు. దానికి రాజకీయ కారణాలే ఉన్నాయని అంటారు. తెలుగుదేశం తెలంగాణాలో కూడా ఉంది. అది ఎప్పటికైనా అక్కడ రాణించాలన్నది ఆ పార్టీ ఆలోచన. అందుకే ఏపీలో కూడా జూన్ 2 నుంచి 9 వరకూ బాబు అప్పట్లో నవ నిర్మాణ దినోత్సవం అని నిర్వహించేవారు. నిజానికి జూన్ 2 అంటే ఏపీ వరకూ చూస్తే బాధాకరమైన రోజుగా భావిస్తారు. ఉమ్మడి పదమూడు జిల్లాల ప్రజానీకం ఎవరూ విభజన కోరుకోలేదు, కానీ కేంద్రంలోని పార్టీలు ఉమ్మడి ఏపీలో ప్రాంతీయ పార్టీలతో కలసి రాష్ట్రాన్ని విడగొట్టాయి. అలా జూన్ 2న విడదీసిన రోజును ఏపీలో ఎలా నవ నిర్మాణం దినోత్సవాలుగా జరుపుతారు అని ఆనాడు ఏపీలో చర్చ సాగింది. ఏపీకి ఎపుడూ ఒక ఫార్మేషన్ డే ఉండేది. అదే నవంబర్ 1, దానినే కొనసాగించాలని అనెక వినతులు వెళ్ళినా నాటి టీడీపీ ప్రభుత్వం అలా చేయలేదు, పోనీ 1953 అక్టోబర్ 1న ఉమ్మడి మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన డేట్ ని అయినా కన్ ఫర్మ్ చేయమని కోరినా అలాగా చేయలేదు. ఏపీ ఆవిర్భావ దినోత్సవం ఏదీ కాకుండా బాబు అలా వదిలేశారు.
వైసీపీ హయాంలో అలా :
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక నవంబర్ 1వ తేదీని ఆవిర్భావ దినోత్సవంగా ప్రకటించి అయిదేళ్ళూ చేసింది. కానీ 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం గత ఏడాదీ అవతరణ దినోత్సవాలు చేయలేదు, ఈ ఏడాది చేయలేదు, ఒక విధంగా చూస్తే ఏపీకి పుట్టిన రోజు అన్నది లేదు అన్నట్లుగానే అయోమయంలో ఉంచేసింది. దేశంలో అన్ని రాష్ట్రాలు ఆఖరుకు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ఫార్మేషన్ డే చేసుకుంటూంటే ఏపీ మాత్రం ఏ డేటూ లేకుండా ఏపీని అలా ఉంచేయడం పట్ల రాష్ట్రాభిమానులు ఎంతో బాధపడుతున్నారు.
రాష్ట్రపతి గుర్తించారు .
ఇక ఏపీ అవతరణ దినోత్సవం నవంబర్ 1 అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గుర్తించి శనివారం ఎక్స్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలియచేశారు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, పంజాబ్, పుదుచ్చేరి ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం విశేషం. ఈ ప్రాంతాలు దేశ పురోగతికి విశేష కృషి చేశాయని, ఈ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు తమ అభివృద్ధి ప్రయాణంలో కొత్త మైలురాళ్లను సాధించాలని ఆమె సోషల్ మీడియా పోస్ట్ ద్వార ఆకాంక్షించారు. ఈ రాష్ట్రాలు నిరంతర శ్రేయస్సుని ఆమె కోరుకున్నారు.
ఏపీ తప్ప అందరికీ మోడీ :
ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఛత్తీస్‌గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా పోస్ట్‌లలో మోదీ ఆయా రాష్ట్రాల కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రగతికి కొత్త ప్రమాణాలను నెలకొల్పడంలో నిమగ్నమై ఉండాలని కోరారు.
అమిత్ షా ట్వీట్ :
అంతే కాదు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఏపీ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మరి దేశంలో ప్రముఖులు అంతా ఏపీ గురించి చెబుతూంటే ఏపీ పాలకులకు మాత్రం పట్టకపోవడం బాధాకరమని అంటున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ఏపీ అవతరణ దినోత్సవంగా నవంబర్ 1 ని గుర్తించి 2026 నుంచి అయినా ఘనంగా ఉత్సవాలు జరపాలని ఏపీ ప్రతిష్టను కాపాడాలని అంతా కోరుతున్నారు. ఒక వ్యక్తికి పుట్టిన రోజు ముఖ్య్హం, ఒక సంస్థకు వ్యవస్థకు ఆవిర్భావ దినోత్సవం చాలా ముఖ్యం. ఏడాది పాటు జరిగిన అభివృద్ధి ఒకసారి నెమరువేసుకునే ఒక మంచి అవకాశం ఇది. దీనిని గుర్తించాలని అంతా కోరుతున్నారు.