కట్ మనీ క్యాష్‌బ్యాక్.. ప్రజల భయంతో డబ్బులు వెనక్కి ఇస్తున్న టీఎంసీ నేతలు
ఒకప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నిర్మొహమాటంగా "కట్" వేసిన నాయకులు ఇప్పుడు అదే డబ్బును ప్రజల కాళ్లపై పడి మరీ తిరిగి ఇచ్చేస్తున్నారు.
రాజకీయాల్లో ‘క్యాష్‌బ్యాక్’ ఆఫర్లు ఉంటాయని ఎప్పుడైనా విన్నారా? షాపింగ్ మాల్స్‌లోనో, ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్‌లోనో స్క్రాచ్ కార్డ్ గెలిస్తే వచ్చే క్యాష్‌బ్యాక్ గురించి మనకు తెలుసు. కానీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్తగా "కట్ మనీ రీఫండ్ స్కీమ్" నడుస్తోంది. అయితే ఇది ప్రభుత్వ పథకం కాదు... ప్రజాగ్రహం అనే 'సర్వర్ డౌన్' కాకముందే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలు ప్రాణరక్షణ కోసం ప్రవేశపెట్టిన అత్యవసర హోమ్ సర్వీస్!
ఒకప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నిర్మొహమాటంగా "కట్" వేసిన నాయకులు ఇప్పుడు అదే డబ్బును ప్రజల కాళ్లపై పడి మరీ తిరిగి ఇచ్చేస్తున్నారు. బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం ఈ 'రిటర్న్ గిఫ్ట్' కార్యక్రమం ఒక రేంజ్‌లో వైరల్ అవుతోంది.
'ముందు మా వాటా' నుండి 'అన్నా క్షమించు' దాకా!
కథలోకి వెళ్తే... కూచ్ బెహర్ జిల్లాలో మొదలైన ఈ కామెడీ ఎపిసోడ్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఇళ్ళు, పెన్షన్లు, ఇతర ప్రభుత్వ సాయం లబ్ధిదారుల ఖాతాల్లో పడాలంటే, స్థానిక నేతలకు "కట్ మనీ" ఇచ్చుకోవాల్సిందే అనే రూల్ ఉండేది. ఒక్కో కుటుంబం నుంచి దాదాపు రూ.15 వేల నుండి రూ.20 వేల వరకు అధికార పార్టీ నేతలు గుంజేవారనే ఆరోపణలు ఉన్నాయి.
అప్పట్లో "ముందు మా కమిషన్ మా చేతిలో పెట్టు... ఆ తర్వాతే నీకు పథకం పైసలు వస్తాయి" అని కాలరు ఎగరేసిన నేతలు... ఇప్పుడు సీన్ రివర్స్ అవ్వడంతో... "అన్నా... ఇది నీ డబ్బే, అప్పట్లో పొరపాటు జరిగింది. దయచేసి తీసుకో" అంటూ నకిలీ వినయంతో ఇళ్లకు వస్తున్నారు. రాజకీయాల్లో పశ్చాత్తాపం కంటే, ఓటమి భయమే మనుషులను ఎంతగా మారుస్తుందో చెప్పడానికి ఈ దృశ్యాలే నిదర్శనం.
అవినీతికి ‘సేవా రుసుము’... తిరుగుబాటుకు ‘క్షమాపణ కానుక’!
ఇందులో అసలు సిసలైన వ్యంగ్యం ఏమిటంటే... అధికారంలో ఉన్నప్పుడు చట్టం, న్యాయం, ప్రజాస్వామ్యం అన్నీ తమ జేబులోనే ఉన్నాయని ఫీలైన నాయకులకు ఎన్నికల దెబ్బతో ఒక్కసారిగా "నైతిక విలువలు" "గాంధీ సూక్తులు" గుర్తుకొచ్చాయి. ఇంతకాలం ప్రజల రక్తాన్ని పిండి వసూలు చేసిన సొమ్మును "సేవా రుసుము" అని సమర్థించుకున్న వారు.. ఇప్పుడు అదే డబ్బును "క్షమాపణ కానుక"గా వాపస్ ఇస్తున్నారు. దీనిపై బెంగాల్ జనాలు ఇప్పుడు కొత్త నానుడి కూడా సృష్టించారు.. "ఎన్నికలు వస్తే ఓటు వేయండి... ఎన్నికలు పోతే కట్ మనీ తెచ్చుకోండి!" అంటూ సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
దేశ రాజకీయాలకొక ‘హెచ్చరిక’
బెంగాల్‌లో జరుగుతున్న ఈ వింత పరిణామం ఒక్క టీఎంసీకే కాదు, దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకూ ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు మౌనంగా భరిస్తున్నంత కాలమే నేతల దౌర్జన్యాలు, అవినీతి సామ్రాజ్యాలు సాగుతాయి. కానీ ఒక్కసారి జనం తిరగబడి లెక్కలు అడగడం మొదలుపెడితే... కోట్ల రూపాయల అవినీతి సొమ్మును కూడా ఇలా ఇంటింటికీ తిరిగి హోమ్ డెలివరీ చేయక తప్పదు.
అంతిమంగా చెప్పాలంటే... బెంగాల్‌లో ప్రస్తుతం నడుస్తున్నది ఎలాంటి నైతిక పశ్చాత్తాప యాత్ర కాదు. ఇది కేవలం ప్రజల కోపం అనే సునామీ నుంచి తమ ప్రాణాలను, మిగిలిన పరువును కాపాడుకోవడానికి నేతలు ఆడుతున్న "పొలిటికల్ క్యాష్‌బ్యాక్ క్యాంపెయిన్" మాత్రమే! కస్టమర్ ప్రజలు ఈసారి గట్టిగా రివ్యూ ఇచ్చేసరికి, కంపెనీ నేతలు దిగొచ్చి రీఫండ్ ఇస్తోందన్నమాట!