వాల్ మార్ట్.. అమెజాన్ మాత్రమేనా.. భారతీయులు చేయలేరా?

భారత్ మీద ఆగ్రహం కక్కుతూ.. తన మాట వినని మోడీ సర్కారును దారిలోకి తెచ్చుకునేందుకు సుంకాల షాక్ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు.;

Update: 2025-08-09 03:58 GMT

సుంకాల పంచాయితీ గురించి ఇస్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ మీద ఆగ్రహం కక్కుతూ.. తన మాట వినని మోడీ సర్కారును దారిలోకి తెచ్చుకునేందుకు సుంకాల షాక్ విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. తన మాదిరే మోడీ సైతం మొండి ఘటమన్న విషయం ట్రంప్ కు తెలుసు. అయినప్పటికీ .. అగ్రరాజ్య అధినేతకు సహజసిద్దంగా ఉండే బలుపుతో భారత్ ను తన దారికి తెచ్చుకోవాలని.. తాను చెప్పినట్లుగా వినేలా చేసుకోవటం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

ట్రంప్ విధించిన 50 శాతం సుంకాలతో వ్యాపారవర్గాలు ఆగమాగం అవుతున్నాయి. అదే సమయంలో అమెరికాకు చెందిన దిగ్గజ వ్యాపార సంస్థలైన అమెజాన్.. వాల్ మార్ట్ లు అలెర్టు అయ్యాయి. భారత్ నుంచి దిగుమతి చేసుకునే స్టాక్ ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా మీడియా కథనాలు వస్తున్నాయి. తమ నుంచి మళ్లీ కమ్యూనికేషన్ వచ్చే వరకు దుస్తులు.. ఫ్యాషన్ ఉత్పత్తుల ఎగుమతుల్ని నిలిపివేయాలని కోరినట్లు చెబుతున్నారు.

తమ ఎగుమతిదారులకు సందేశాలు పంపిన సంస్థల్లో వాల్ మార్ట్.. అమెజాన్.. టార్గెన్.. గ్యాప్ సంస్థలు తాము కొనుగోలు చేస్తే వ్యాపారులకు ప్రత్యేక మెసేజ్ లు పంపాయి. తదుపరి ఆర్డర్ విషయంలో తాము మళ్లీ కమ్యునికేట్ చేస్తామని.. అప్పటివరకు ఆర్డర్లు పంపొద్దని సమాచారాన్ని అందించాయి. సంకాల పెంపుతో పడే అదనపు భారాన్ని కొనుగోలుదారులు సిద్ధంగా లేరని.. ఆ ఖర్చును ఎగుమతిదారులే భరించాలన్న విషయాన్ని సంస్థలు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. ఎగుమతిదారులు తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు.

ఇలాంటి వేళ.. ట్రంప్ మాష్టారికి బుద్ధి వచ్చేలా చేసే ఆయుధం భారతీయుల చేతుల్లోనే ఉంది. ఇప్పుడున్న ప్రపంచంలో వ్యాపారమే ప్రభుత్వాల్ని.. దేశాల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ విషయం అగ్రరాజ్యం మనకు అర్థమయ్యేలా చేస్తోంది. మనం కూడా వారికి ఆ విషయాన్ని మనదైన పద్దతిలో అర్థమయ్యేలా చేస్తే సరిపోతుంది. బ్యాడ్ లక్ ఏమంటే.. ఈ తరహా అంశాల్లో భారతీయులు పలువురు పెద్దగా పట్టించుకోకపోవటంతో అగ్రరాజ్యం ఆటలు సాగుతున్నాయి.

అమెరికా ఉత్పత్తులు.. అమెరికా దేశానికి చెందిన కంపెనీల సేవల్ని భారతీయులు ఎవరికి వారుగా బహిష్కరిస్తే సరి. అమెరికా సంస్థకు చెందిన కంపెనీల ఉత్పత్తుల కొనుగోలు మీద విముఖతను ప్రదర్శించటంతో పాటు.. వారికి ఆ విషయాన్ని స్పష్టం చేయటం ద్వారా ఆయా సంస్థలకు భారతీయుల ఎఫెక్టు ఎంత ఉంటుందన్న విషయాన్ని అర్థమయ్యేలా చేయాలి. భారతదేశం లాంటి మార్కెట్ లో తమ ఉత్పత్తుల అమ్మకాల మీద ప్రభావం పడితే.. ఆయా సంస్థలు అస్సలు తట్టుకోలేవు అదే జరిగితే.. ట్రంప్ సర్కారు మీద ఒత్తిడి పెరుగుతుంది. భారత్ విషయంలో ట్రంప్ తీరులో మార్పుకు ఇదో అవకాశంగా చెప్పాలి. అయితే.. ఇక్కడ ఉన్న కీలక అంశం.. భారతీయులంతా కలిసికట్టుగా చేస్తే తప్పించి.. అగ్రరాజ్యాన్ని కట్టడి చేయటం కష్టం.

Tags:    

Similar News