వీరమాచినేని డైట్ తో అనారోగ్యం.. షాకిచ్చిన న్యాయ విద్యార్థి

వీరమాచినేని డైట్, వీఆర్కే డైట్ పేరుతో సోషల్ మీడియాలో సుపరిచితుడైన వీరమాచినేని రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Update: 2026-09-30 09:50 GMT

వీరమాచినేని డైట్, వీఆర్కే డైట్ పేరుతో సోషల్ మీడియాలో సుపరిచితుడైన వీరమాచినేని రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామకృష్ణ, ఆయన అనుచరుడు కోటేశ్వరరావు కలిసి చేసిన వైద్యంతో తాను అనారోగ్యానికి గురైనట్లు తెలంగాణలోని నిర్మల్ జిల్లాకు చెందిన ఓ న్యాయ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు. దీంతో సరైన అర్హతలు లేకుండా వైద్యం చేస్తానని చెప్పడమే కాకుండా, న్యాయవిద్యార్థి అనారోగ్యానికి కారణమయ్యారనే ఆరోపణలతో వీరమాచినేని రామకృష్ణ, ఆయన అనుచరుడు కోటేశ్వరరావుపై పోలీసులకు క్రిమినల్ కేసు నమోదు చేశారని అంటున్నారు.

సోషల్ మీడియాలో విశేష ఆదరణ ఉన్న వీరమాచినేని రామకృష్ణపై హైదరాబాద్ లోని రాయదుర్గం పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారనే సమాచారం తీవ్ర సంచలనం రేపుతోంది. సరైన విద్యార్హతలు లేకుండా అనధికారిక వైద్య సలహాలు ఇవ్వడం, మోసపూరిత ప్రకటనలతో రోగి ప్రాణాలకు ముప్పు కలిగించారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారని అంటున్నారు. బాధితుడు కొన్నేళ్లుగా టైప్ వన్ డయాబెటిస్ తో బాధపడుతున్నారని, సోషల్ మీడియాలో వీరమాచినేని వీడియోలు చూసి, వీఆర్‌కే డైట్‌తో మధుమేహం పూర్తిగా నయమవుతుందని నమ్మి హైదరాబాద్ షేక్‌పేటలోని 'వీఆర్‌కే హెల్త్ కేర్ సెంటర్'ను సంప్రదించినట్లు చెబుతున్నారు.

అక్కడ వీరమాచినేని, అతని సహాయకుడు కోటేశ్వరరావు కలిపి బాధితుడు రోజువారీ ఇన్సులిన్ తీసుకోవడం ఆపేయాలని, తమ డైట్ చిట్కాలు మాత్రమే పాటించాలని సూచించారని అంటున్నారు. ఇందుకోసం సప్లిమెంట్లు, సేవల పేరిట రూ. 26,000 ఫీజుగా వసూలు చేశారని చెబుతున్నారు. వారి సలహా మేరకు ఇన్సులిన్ ఆపేసి డైట్ ఫాలో అయిన కేవలం రెండు రోజుల్లోనే సాయికృష్ణ తీవ్ర డీహైడ్రేషన్, 'డయాబెటిక్ కీటో అసిడోసిస్' బారిన పడి అత్యవసర స్థితిలో ఆసుపత్రి పాలయ్యారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాణాలు కోల్పోయే ప్రమాదం నుండి కోలుకున్నాక, బాధితుడు పోలీసులను ఆశ్రయించినట్లు చెబుతున్నారు. ఇక బాధితుడు ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు బాధితుడు తనకు జరిగిన నష్టం, ఆస్పత్రి ఖర్చులు రూ.58 వేలు ఇవ్వాలని కోరుతూ నాంపల్లి వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. ఇక వీరమాచినేని సలహాలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతూ హెల్త్‌కేర్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సిటీ సివిల్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారని చెబుతున్నారు. వీరమాచినేని సోషల్ మీడియా వేదికగా వైద్య విద్య అభ్యసించిన డాక్టర్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని హెడ్ఆర్డీఏ ప్రతినిధులు ఆరోపించారు. దీంతో ఈ కేసును విచారించిన న్యాయమూర్తి సోషల్ మీడియాలో వైద్యులను కించపరచే వ్యాఖ్యలపై నిషేధం విధించింది, కేసు విచారణను నవంబరు 25కు వాయిదా వేసినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News