రూ.25 లక్షల పరిహారం.. ఇంట్లో ఒకరికి ఉద్యోగం.. స్టీల్ ప్లాంట్ బాధితులకు నష్టపరిహారం
సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకోగా, మంగళవారం ఉదయం యువనేత లోకేశ్, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ విశాఖ చేరుకుని బాధితులను ఓదార్చారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రులను పరామర్శించేందుకు డిప్యూటీ సీఎం మంగళవారం పర్యటించారు. ప్రమాదస్థలిని పరిశీలించి చలించిపోయారు. ప్రమాదంపై విచారణకు ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగి మొత్తం 8 మంది మరణించిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకోగా, మంగళవారం ఉదయం యువనేత లోకేశ్, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ విశాఖ చేరుకుని బాధితులను ఓదార్చారు.
బాధితులకు నష్టపరిహారంతోపాటు ఆస్పత్రిలో చికిత్సకు అయ్యే ఖర్చును మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ఉపముఖ్యమంత్రి పవన్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాల భవిష్యత్తుకు పూర్తి భద్రత కల్పించే క్రమంలో కూటమి ప్రభుత్వం మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాలకు పదవీ విరమణ ప్రయోజనాల కింద రూ. 1.72 కోట్ల భారీ మొత్తాన్ని, కాంట్రాక్టు కార్మికుల కుటుంబాలకు రూ. 45.75 లక్షల ఆర్థిక సాయాన్ని అందేలా నిబంధనలను ఖరారు చేసిందని చెప్పారు. వీటితో పాటు, ప్లాంట్ రెగ్యులర్ ఉద్యోగుల పిల్లలతో సమానంగా, మృతుల పిల్లల చదువులు కూడా ఎక్కడా ఆగిపోకుండా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి ముందుకు నడిపిస్తుందని స్పష్టం చేశారు.
ఈ ఘోర ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు బొకారో స్టీల్ ప్లాంట్ నుండి ఒక ఉన్నత స్థాయి 'త్రీ మ్యాన్ కమిటీ'ని రంగంలోకి దించుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నుండి పూర్తి స్థాయి సహకారం అందిస్తామని, యాజమాన్య లోపాలను తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా, స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలు, సాంకేతిక ఇబ్బందులపై చర్చించేందుకు త్వరలోనే అన్ని కార్మిక సంఘాలతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
విశాఖకు తరలివచ్చిన నేతలు
ప్రమాదంతో విశాఖపట్నంలో నేతల తాకిడి ఎక్కువైంది. విషయం తెలిసిన వెంటనే కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి సోమవారం రాత్రికే విశాఖ చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. అదేవిధంగా విజయనగరం పర్యటనలో ఉన్న హోంమంత్రి అనిత కూడా హుటాహుటిన విశాఖ వచ్చి బాధితులను ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇక మంత్రులు లోకేశ్, మనోహర్ కూడా విశాఖ చేరుకుని బాధితులను పరామర్శించారు. బుధవారం ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటించే అవకాశం ఉందని అంటున్నారు.