డేటా సెంటర్ల పై తప్పుడు ప్రచారం...క్లారిటీ ఇదే !

విశాఖలో మూడు డేటా సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయి. గూగుల్ డేటా సెంటర్ అతి పెద్దదిగా ఇందులో ఉంది.

Update: 2026-08-15 03:33 GMT

విశాఖలో మూడు డేటా సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయి. గూగుల్ డేటా సెంటర్ అతి పెద్దదిగా ఇందులో ఉంది. అలాగే రాష్ట్రంలో పలు చోట్ల డేటా సెంటర్లు ఏర్పాటు అవుతున్నాయి. అయితే వీటి నీటి వినియోగం మీద రకరకాలైన ప్రచారం అయితే సాగుతోంది. విశాఖలో డేటా సెంటర్లు వద్దు అని మేధావులు ప్రజా సంఘాలు వామపక్ష నేతలు విపక్షాలు దీని మీద పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. డేటా సెంటర్లు నీళ్ళు మొత్తం తాగేస్తాయని ఫలితంగా విశాఖ నగరంలోని వారంతా ఉన్న చోటు వీడి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాల్సి వస్తుందని అంటున్నారు. డేటా సెంటర్లకు పదుల సంఖ్యలో టీఎంసీల నీళ్ళు అవసరం పడతాయని వాదిస్తున్న వారు ఉన్నారు అయితే దీని మీద కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. డేటా సెంటర్లు నీళ్ళు తాగవని వాటికి అంత అవసరం ఉండదని చెబుతోంది.

తప్పుడు ప్రచారం అది :

విశాఖలో డేటా సెంటర్లు అధిక నీరు వినియోగిస్తాయన్నది తప్పుడు ప్రచారంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ వాస్తవాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అపోహలను తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉంటే పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి తరలించి అనకాపల్లికి నీరు అందిస్తామని చెప్పారు. అందులో నుంచి మూడు టీఎంసీల నీరు డేటా సెంటర్లకు ఇస్తామని ఆయన వెల్లడించారు. డేటా సెంటర్లకు ప్రభుత్వం భారీగా నీరు కేటాయిస్తోంది అన్నది విపక్షాలు మరీ ముఖ్యంగా వైసీపీ చేస్తున్న ప్రచారంగా మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.

వద్దంటూ ఉద్యమాలు :

మరో వైపు చూస్తే విశాఖలో డేటా సెంటర్లే వద్దు అంటూ ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. దాని వల్ల నీరు మొత్తం వాటికే పోతుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో నగరంలో తాగు నీటి కష్టాలు ఏర్పడ్డాయని గుర్తు చేస్తున్నారు. అయితే వర్షాభావ పరిస్థితులకు డేటా సెంటర్లలో నీటి వినియోగానికి సంబంధమే లేదని కూటమి నేతలు అంటున్నారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వల్ల అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉందని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల తాగు నీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని కూడ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.

తాగు నీటికే ప్రాధాన్యత :

అంతే కాదు ఎల్ నినో, సూపర్‌ ఎల్‌ నినో నేపథ్యంలో త్రాగునీటికి ప్రథమ ప్రాధాన్యతని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కూడా సూచనలు చేసిందని ఆయన గుర్తు చేశారు. 2027 జూన్ వరకు ఇప్పుడున్న నీటిని భద్రపర్చుకోవాలని కేంద్రం సూచించిందని తెలిపారు. ప్రతి జిల్లాలోనూ నీటిపారుదల, రెవెన్యూ,వ్యవసాయ మూడు శాఖలు సమన్వయంతో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలను రైతులను ఎప్పటికప్పుడు చైతన్యపరచి అందుబాటులో ఉన్న నీటిని తాగునీటికే ఉపయోగించుకోవాలని చెప్పాలన్నారు.తాగునీటి అవసరాలని మించి ఎక్కడైనా నీళ్లు ఉంటే అది ఆరుతడి పంటలకు మాత్రమే ఉపయోగించుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న లోటు వర్షపాతం పరిస్థితుల దృష్ట్యా, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశరు.

Tags:    

Similar News