విహారం విషాదం.. వెంటాడిన మృత్యువు.. విశాఖ టెక్కీ దుర్మరణం

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ హిల్ స్టేషన్ ముస్సోరీలో విశాఖపట్నానికి చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధా గాయత్రి (27) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Update: 2026-06-17 04:21 GMT

ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ హిల్ స్టేషన్ ముస్సోరీలో విశాఖపట్నానికి చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ రాధా గాయత్రి (27) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భర్తతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన చోటే ఆమె ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గురుగ్రామ్‌లో ఉద్యోగం.. గత ఏడాదే వివాహం

పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంలోని చినముషిడివాడకు చెందిన రాధా గాయత్రి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఆమె గురుగ్రామ్‌లోని ఒక ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఢిల్లీలోని కిడ్వాయి నగర్ ఈస్ట్‌లో నివాసం ఉంటోంది. ఆమెకు గత ఏడాది నవంబర్ 8న శ్రీచరణ్ అనే యువకుడితో వివాహం జరిగింది. శ్రీచరణ్ పుణెలోని ఒక ప్రముఖ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వేర్వేరు నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న ఈ దంపతులు, వీకెండ్ కావడంతో కలిసి సమయం గడిపేందుకు ప్లాన్ చేసుకున్నారు.

హోటల్ గదిలో ఏం జరిగింది?

జూన్ 13న ఈ దంపతులు ఢిల్లీ నుంచి బయలుదేరి మొదట రిషికేష్‌కు చేరుకున్నారు. అక్కడ నుంచి జూన్ 14 అర్ధరాత్రి సమయంలో ముస్సోరీలోని టిప్రిధార్ ప్రాంతంలో ఉన్న 'కియానా హోమ్‌స్టే'కు వచ్చారు. హోటల్ గదిలోకి వెళ్లిన తర్వాత ఇద్దరూ మద్యం సేవించినట్లు సమాచారం. అనంతరం తెల్లవారుజామున సుమారు 3.30 గంటల సమయంలో తామిద్దరం నిద్రపోయామని శ్రీచరణ్ పోలీసులకు తెలిపాడు.

అయితే మరుసటి రోజు ఉదయం ఎంతకీ గాయత్రి లేవకపోవడం, అపస్మారక స్థితిలో పడి ఉండటంతో ఆందోళన చెందిన శ్రీచరణ్ వెంటనే హోటల్ సిబ్బందికి సమాచారం అందించాడు. హోటల్ మేనేజ్‌మెంట్ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వారు ఉన్న గదిలో రెండు ఖాళీ మద్యం సీసాలు, కొన్ని ఆహార పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ముక్కు నుంచి రక్తం.. అనుమానాస్పద మృతిగా కేసు

గాయత్రి మృతదేహాన్ని పరిశీలించిన సమయంలో ఆమె ముక్కు నుంచి రక్తస్రావం జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో ఈ మరణంపై పోలీసులు ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

కూతురు మరణ వార్త తెలుసుకున్న వెంటనే గాయత్రి కుటుంబ సభ్యులు విశాఖపట్నం నుంచి ముస్సోరీకి బయలుదేరారు. కళ్ల ముందే నవ్వుతూ తిరిగిన కూతురు ఇక లేదనే వార్త వారిని తీవ్ర విషాదంలోకి నెట్టింది. అయితే తన కుమార్తె మరణంపై ప్రస్తుతం తమకు ఎలాంటి అనుమానాలు లేవని గాయత్రి తండ్రి మీడియాకు తెలపడం గమనార్హం.

పోస్టుమార్టం నివేదికపైనే ఆధారాలు

అతి తక్కువ కాలంలోనే ముగిసిపోయిన ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని జీవితం వెనుక ఉన్న అసలు కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక వెలువడిన తర్వాతే గాయత్రి మరణానికి గల ఖచ్చితమైన కారణాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన ముస్సోరీతో పాటు విశాఖలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News