వైసీపీ మాజీ మంత్రిని ఇరిటేట్ చేస్తున్న ట్యాగ్ లైన్ !
తనను గుడ్డు మంత్రి అని టార్గెట్ చేయడం వల్లనే గుడివాడ అసహనంగా ఉన్నారని అంటున్నారు.
యువకుడుగా ఉండగానే ఎమ్మెల్యే అయిపోయారు. మంత్రి పదవి కూడా దక్కింది. ఏకంగా ఆరు శాఖలకు ఆయన మంత్రిగా వ్యవహరించారు. ఐటీ పరిశ్రమల వంటి ముఖ్య శాఖలను విశాఖకు చెందిన వైసీపీ యువ నాయకుడు గుడివాడ అమర్నాథ్ చూశారు. ఆ సమయంలో ఒకసారి పెట్టుబడుల గురించి హైదరాబాద్ లో మీడియా ప్రశ్నించినపుడు గుడివాడ కాస్తా సెటైరికల్ గా కోడి గుడ్డు పొదగగానే పిల్లవుతుందా అని ప్రశ్నించారు. తతంగం చాలా ఉంటుందని ఆయన మీడియా ముందు కాస్తా తనదైన వెటకారం జోడించి మాట్లాడారు. ఏ ముహూర్తాన ఆయన అలా అన్నారో కానీ అది కాస్తా ఆయనకు నిక్ నేం అయి కూర్చుంది. అప్పటి విపక్షం టీడీపీ చాలా నైస్ గా దీనిని అందుకుని గుడ్డు మంత్రి అని గుడివాడకు పేరు పెట్టేసింది. అప్పట్లో విశాఖ పర్యటనకు వచ్చినపుడు నారా లోకేష్ కూడా అలాగే పిలవడంతో అదే స్థిరపడిపోయింది.
పొలిటికల్ టీజింగ్ గానే :
ఇక మాజీ మంత్రి అయినా కూడా గుడివాడకు ఈ పొలిటికల్ టీజింగ్ తప్పడం లేదు. వైసీపీలో ఎంతో మంది మంత్రులుగా చేశారు. కానీ ఎవరికీ లేని ట్యాగ్ లైన్ గుడివాడకే సొంతం చేస్తూ టీడీపీ ఆయన్ని పదే పదే టార్గెట్ చేస్తోంది. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో అయితే గతంలోనూ ప్రస్తుతం కూడా వంగలపూడి అనిత గుడివాడల మధ్యన మాటల యుద్ధం సాగుతూనే ఉంది. ఇద్దరికి ఇద్దరూ మంచి మాటకారులే. ఇలా కౌంటర్లు ఇచ్చుకుంటూ ఆనాడూ వ్యవహరించారు. ఇపుడూ అదే కధ సాగుతోంది. అయితే ఈసారి మంత్రి వంగలపూడి అనిత వైసీపీని విమర్శిస్తూ గుడివాడ మీద చేసిన వ్యాఖ్యలతో ఆయన కూడా కౌంటర్ చేయడంలో కాస్తా బ్యాలెన్స్ తప్పారని అంటున్నారు.
ఆమెకు ట్యాగ్ లైన్ గా :
తనకు గుడ్డు మంత్రి అని ట్యాగ్ లైన్ ఇచ్చిన టీడీపీకి బదులుగా అనితకు ట్యాగ్ లైన్ ఇవ్వాలన్న ఉత్సాహమో లేక సెటైరికల్ గా అనాలన్న తాపత్రయంలో తెలియదు కానీ గుడివాడ అనిత మేకప్పు గురించి చేసిన వ్యాఖ్యలు అయితే మంట పుట్టించాయి. ఆయన హోం మంత్రి మీద చేసిన అనుచితమైన వ్యాఖ్యలతో ఉమ్మడి విశాఖ జిల్లాలో రాజకీయ మంట రాజుకుంది. హోం మంత్రిని అంటారా అని టీడీపీ శ్రేణులు అంతా గుడివాడ మీద విరుచుకుపడడం ప్రతిగా వైసీపీ నుంచి కౌంటర్లు వారి మీద వీరు వీరి మీద వారు కేసులు పెట్టుకోవడంతో వ్యవహారం కాస్తా ముదిరి పాకాన పడింది అని అంటున్నారు.
టార్గెట్ చేస్తున్నారనే :
తనను గుడ్డు మంత్రి అని టార్గెట్ చేయడం వల్లనే గుడివాడ అసహనంగా ఉన్నారని అంటున్నారు. రాజకీయాల్లో చమక్కులు ఒక్కోసారి ఇబ్బందుల పాలు చేస్తాయనడానికి ఇదే ఉదాహరణ అని అంటున్నారు. ఆయన కోడి గుడ్డు అని ఉదహరిస్తే అది కాస్తా గత నాలుగేళ్ళుగా ఆయనకే రివర్స్ అయి పొలిటికల్ ర్యాగింగ్ చేసేలా మారింది అని అంటున్నారు. ఇక వైసీపీ నేతలు అయితే అధికార పార్టీ నేతలు ఏకవచనంతో అసభ్య పదజాలంతో తమను దూషించవచ్చా అని అంటున్నారు. మాజీ మంత్రి గుడివాడ పట్ల కనీస గౌరవం లేకుండా ఏకవచనంతో మాట్లాడినందుకే ఆయన కౌంటర్ ఇవ్వాల్సి వచ్చిందని వారు చెబుతున్నారు. మొత్తానికి అయితే గుడివాడను ఇరిటేట్ చేస్తున్నది ఆ ఒక్క ట్యాగ్ లైన్ అని అందుకే ఆయన ఆగ్రహిస్తున్నారు అని అంటున్నారు. అయితే వీక్ నెస్ కనిపెట్టిన టీడీపీ అసలు ఊరుకుంటుందా అన్నదే అసలైన ప్రశ్న అని కూడా అంటున్నారు.