విశాఖ ఎయిర్ పోర్టు....గుండె నిండా భావోద్వేగం !

మరి కొద్ది రోజులలో గట్టిగా చెప్పాలీ అంటే ఇరవై రోజుల వ్యవధిలో విశాఖ ఎయిర్ పోర్టు చరిత్రలోకి వెళ్ళిపోతుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రాకు అతి పెద్ద దిక్కు కాబోతోంది.

Update: 2026-06-17 04:12 GMT

విశాఖ ఎయిర్ పోర్టుతో నగర వాసులకే కాదు ఉత్తరాంధ్ర వాసులకు ఎంతో భావోద్వేగమైన అనుబంధం ఉంది. ప్రపంచాన్ని కనెక్ట్ చేస్తూ గగన విహారం చేయించిన మధుర స్మృతులు ఠక్కున గుర్తుకు వస్తాయి. విశాఖ నుంచి విమానం ఎగురుతూ సాగిపోయే సన్నివేశాలు స్థానికులకు అలవాటే. సముద్ర తీరం నుంచి అలా సాగుతూ పోయే విమానాలను చూస్తూ ఆనందించే అనుభూతులు ఎన్నో ఉన్నాయి. ఇక ఎందరో ప్రముఖులకు విశాఖకు తీసుకుని వచ్చిన ఎయిర్ పోర్టు అది. పండిట్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ నుంచి మహామహులు విశాఖ ఎయిర్ పోర్టు గుండానే ఉత్తరాంధ్రాలో ప్రవేశించి తమ పర్యటనలు జరిపేవారు. అలాంటి ఎయిర్ పోర్టుకు వీడ్కోలు పలికే సమయం అయితే ఆసన్నం అయింది అని చెప్పాలి.

కౌంట్ డౌన్ స్టార్ట్ :

మరి కొద్ది రోజులలో గట్టిగా చెప్పాలీ అంటే ఇరవై రోజుల వ్యవధిలో విశాఖ ఎయిర్ పోర్టు చరిత్రలోకి వెళ్ళిపోతుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్రాకు అతి పెద్ద దిక్కు కాబోతోంది. జూలై 5న పక్కాగా భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం అవుతుంది అని అంటున్నారు. ఒక వేళ ఆ డేట్ కాకపోతే జూలై ఎనిమిదిగా మరో డేట్ ఉంది. ఒక్కసారి కనుక భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం అయితే విశాఖ ఎయిర్ పోర్టు ఆ వెంటనే పౌర విమానయాన సేవలను నిలిపివేస్తుంది. పూర్తిగా తూర్పు నావికాదళం నియంత్రణలోకి వెళ్ళిపోతుంది.

ఎనభయ్యేళ్ళ చరిత్ర :

విశాఖ విమానాశ్రయం ఈనాటి ముచ్చట కాదు, ఎనభయ్యేళ్ళ నాటిది అప్పట్లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఒక చిన్న సైనిక విమాన స్థావరంగా మొదలైంది. అంటే 1942లో అన్న మాట. అలా బ్రిటిష్ పాలకులు తమ అవసరాల కోసం దీనిని ఏర్పాటు చేశారు. ఇక ఈ విమానాశ్రయానికి సంబంధించిన రన్ వే నిర్మాణాన్ని కేవలం 45 రోజులలో పూర్తి చేశారు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక 1954 లో ఇక్కడ పౌర విమాన సేవలు మొదలయ్యాయి. 1981కి వచ్చేసరికి పూర్తిగా వాణిజ్య విమాన సేవలు కూడా నిర్వహించడం స్టార్ట్ అయింది.

నావికా దళం కంట్రోల్ లోనే :

ఇదిలా ఉంటే ఈ విమానాశ్రయం వ్యూహాత్మకమైన భద్రతా కారణాల రిత్యా 1986లో భారత నావికా దళం ఆధీనంలోకి వెళ్ళింది. 1991లో ఐ ఎన్ ఎస్ డేగాగా అని దీనిని పేరు పెట్టారు. అలా పౌర సేవలను అందిస్తూనే నవీ నియంత్రణలో ఉంటోంది. ఇక 2007లో పెద్ద విమానాలు దిగడానికి అతి పెద్ద రన్ వేను ఏకంగా 10 వేలకు పై చిలుకు అడుగుల పొడవుతో నిర్మించారు. అలా రాత్రి వేళలలో కూడా విమాన సేవలను అందుబాటులోకి తెచ్చారు. అలాగే 2012 నుంచి అంతర్జాతీయ విమాన సేవలను కూడా అందిస్తూ వచ్చింది. సింగపూర్ తో పాటు ఇతర దేశాలకు విశాఖ నుంచి విమానాల రాకపోకలు సాగుతూ వచ్చాయి. ఈ విధంగా ప్రపంచ విమానరంగంలో విశాఖ ఒక పేరుని తెచ్చుకుంది. మరి అంతటి గొప్ప విమానాశ్రయం ఇపుడు కనుమరుగు అవుతోంది అన్నది విశాఖవాసుల ఆవేదనగా ఉంది.

కొనసాగించాలని :

ఇక విశాఖ వంటి మహానగరానికి విమానాశ్రయం లేకపోవడం బాధాకరం అని పలువురు అంటున్నారు. డొమెస్టిక్ సర్వీస్ కోసం అయినా కొనసాగించాలని కోరుతున్నారు. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ముందున్నారు. ఆయన ఈ డిమాండ్ గట్టిగానే వినిపిస్తున్నారు. మరి పాలకుల ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు కానీ విశాఖ విమానాశ్రయం అయితే చరిత్ర పుటలలోకి వెళ్ళే రోజు దగ్గరలోనే ఉందని ప్రస్తుతానికి వినిపిస్తున్న మాట. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News