పట్టు బిగిస్తున్న తూర్పు కాపులు !

కాపులకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతోందని ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు అన్నారు.

Update: 2026-06-17 03:22 GMT

ఉత్తరాంధ్ర జిల్లాలలో రాజకీయ సామాజిక సమీకరణలను తీవ్రంగా ప్రభావితం చేసే అతి పెద్ద సామాజిక వర్గం తూర్పు కాపులు. ఈ రోజున ఉత్తరాంధ్రాలో ఉన్న మూడు ఉమ్మడి జిల్లాలలో 34 అసెంబ్లీ సీట్లు అయిదు ఎంపీ సీట్ల్లో నూటికి అరవై శాతం సీట్లలో ప్రభావితం చూపించగల సత్తా తూర్పు కాపులకు ఉంది. వారు ఏ పక్షం వహిస్తే వారిదే అధికారం. ఈ విధంగా ప్రతీ ఎన్నికకూ ఒక రాజకీయ పార్టీని గెలిపిస్తూ రావడం తూర్పు కాపుల స్పెషాలిటీ. శ్రీకాకుళం విజయనగరం, అనకాపల్లి జిల్లాలలో తూర్పు కాపులుగా విశాఖ జిల్లాలో ఓసీ కాపులుగా ఉన్నా వీరంతా ఒకే మాట ఒకే రాజకీయ బాటగా ముందుకు సాగుతున్నారు.

సంచలన సమావేశం :

ఇదిలా ఉండగా తాజాగా తూర్పు కాపులు సంచలన సమావేశాన్ని శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ జెండాలు పక్కన పెట్టి మరీ అన్ని జిల్లాల నాయకులు హాజరయ్యారు. టీడీపీ వైసీపీ జనసేన నేతలు అంతా ఒక్కటిగా వేదిక మీద కనిపించడం విశేషం. వారంతా తమది ఒక్కటే నినాదం అని చాటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే ఎన్నికల్లో తూర్పు కాపులు తమ సత్తాను చాటుకోవాలని అంతా స్పష్టం చేశారు.

కాపు సీఎం కోసం :

కాపులకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతోందని ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు అన్నారు. ఉమ్మడి ఏపీలోనే కాపుల నుంచి ముఖ్యమంత్రి కావాల్సిన బొత్స సత్యనారాయణను తొక్కి వేశారు అని కూడా టీడీపీకి చెందిన నాయకుడు రామకృష్ణ చెప్పడం విశేషం. ఇక కాపులలో నిజాయతీ ఉందని అందుకే అమరావతి పోలవరం నిర్మాణం పనులను పర్యవేక్షించే అవకాశం కాపు మంత్రులకే ఇచ్చారు అని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి చెప్పారు. తూర్పు కాపు సామాజిక వర్గంలో పుట్టినందుకే రాజకీయంగా తనకు అవకాశాలు దక్కాయని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. కాపుల నుంచి ముఖ్యమంత్రి కాలేకపోయారన్న ఆవేదన అయితే ఉందని ఈ సమావేశంలో నేతలు చెప్పడం విశేషం.

ఓడించి తీరుతాం :

ఈసారి అసెంబ్లీ సీట్ల పునర్ విభజనలో కాపులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని ఈ సమావేశంలో తీర్మానించారు. అంతే కాకుండా తమకు బలం ఉన్న నియోజకవర్గాలలో వేరే వారికి అవకాశం ఇస్తే అన్ని పార్టీలలో ఉన్న తూర్పు కాపులు అంతా ఒక్కటిగా నిలిచి ఓడిస్తామని కూడా స్పష్టం చేశారు. తూర్పు కాపులకు రాజకీయ ప్రాభవం కావాల్సిందే అని దాని కోసం వచ్చే ఎన్నికల నాటికి మిరంత సంఘటితం కావాలని వారంతా అభిప్రాయపడ్డారు. ఇవన్నీ చూస్తూంటే తూర్పు కాపులు ఈసారి రాజకీయంగా తమ వాటాను తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. మరి అన్ని రాజకీయ పార్టీలలో అధినాయకత్వాలు తూర్పు కాపుల విషయంలో ఏ మాత్రం తేడా చూపించినా దెబ్బ తప్పదని కూడా హెచ్చరిస్తున్నారు. తమ అవసరం ఉందని రాజకీయ పార్టీలు గ్రహించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించడం విశేషం.

Tags:    

Similar News