దొంగతనం జరిగిందని షాపింగ్ మాల్ మూసేస్తారా? నిషేధంపై టెలిగ్రామ్ సీఈవో హాట్ కామెంట్స్
కేవలం సీఈఓ మాత్రమే కాకుండా, టెలిగ్రామ్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసించింది.
అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' నిషేధంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే 'నీట్-యుజి 2026' రీ-ఎగ్జామినేషన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ యాప్‌పై కఠిన నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సిఫార్సుల మేరకు, ఐటీ మంత్రిత్వ శాఖ ఐటీ చట్టం సెక్షన్ 69A కింద జూన్ 22 వరకు టెలిగ్రామ్‌ను భారత్‌లో తాత్కాలికంగా నిషేధించింది. అయితే, భారత ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పవెల్ దురోవ్ అత్యంత ఘాటుగా స్పందించారు.
15 కోట్ల మందికి శిక్షా
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర తప్పిదమని సీఈవో పవెల్ దురోవ్ విమర్శించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘భారత ఐటీ మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్‌ను వారం రోజుల పాటు నిషేధించింది. కొందరు వినియోగదారులు లీకైన పరీక్షా పత్రాలను షేర్ చేశారనే నెపంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ, దీనివల్ల పేపర్ లీక్ చేసిన అసలైన సూత్రధారులకు శిక్ష పడదు, భారత్‌లోని 15 కోట్ల సాధారణ టెలిగ్రామ్ వినియోగదారులు ఇబ్బంది పడతారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఈ నిషేధం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని దురోవ్ స్పష్టం చేశారు. టెలిగ్రామ్ బ్యాన్ వల్ల లీకులు ఆగిపోలేదు. టెలిగ్రామ్ ఆపేయగానే ఆ లీకులన్నీ ఇతర యాప్‌లలోకి మారిపోతాయంటూ ఆయన వ్యాఖ్యానించారు.
కేవలం సీఈఓ మాత్రమే కాకుండా, టెలిగ్రామ్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసించింది. కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం చేసిన ఒక పోస్టుకు స్పందిస్తూ.. ‘ఒక షాపింగ్ మాల్‌లో దొంగతనం జరిగే అవకాశం ఉందని మొత్తం షాపింగ్ మాల్స్‌ను మూసేస్తారా? ఎవరో ఒకరు ఓవర్‌స్పీడ్‌గా వెళ్తున్నారని రోడ్లన్నింటినీ బంద్ చేస్తారా?’ అంటూ టెలిగ్రామ్ సంస్థ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తమ ప్లాట్‌ఫారమ్‌ను తప్పుపట్టడం సరికాదనే ఉద్దేశంతో ఈ ఘాటు పోస్టులు పెట్టింది.
మరోవైపు పరీక్షా పత్రాల లీకేజీకి టెలిగ్రామ్ కారణం కాదని, అసలైన మూలాలు ఎక్కడో ఉన్నాయని దురోవ్ స్పష్టం చేశారు. గడిచిన కొన్ని వారాల్లోనే లీకైన పరీక్షా సామాగ్రిని, స్కామ్‌లను ప్రచారం చేస్తున్న వందలాది ఛానెళ్లను మేము భారత్‌లో తొలగించాం. సమస్యను పరిష్కరించడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామని ఆయన వివరించారు. కాగా, గత మే 3న జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ వివాదాల కారణంగా రద్దు చేయగా, జూన్ 21న దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. అయితే టెలిగ్రామ్‌లో కొన్ని ముఠాలు గ్రూపులు క్రియేట్ చేసి.. రాబోయే రీ-ఎగ్జామ్ పేపర్లు తమ వద్ద ఉన్నాయంటూ విద్యార్థుల నుండి లక్షల రూపాయలు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు ఎన్‌టీఏ గుర్తించింది. ముఖ్యంగా టెలిగ్రామ్‌లో ఉండే మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను స్కామర్లు దారుణంగా వాడుకుంటున్నారని నీట్ గుర్తించిందని చెబుతున్నారు. పాత తేదీల్లో ఉన్న మెసేజ్‌లను ఎడిట్ చేసి, అందులో క్వశ్చన్ పేపర్లు పెట్టి.. "చూశారా పరీక్షకు ముందే మాకు పేపర్ వచ్చిందని నమ్మిస్తూ విద్యార్థులను బురిడీ కొట్టిస్తున్నారని అంటున్నారు. దీనిని అరికట్టడానికే జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్‌ను పూర్తిగా బ్లాక్ చేయడమే కాకుండా, మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను జూన్ 30 వరకు నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో యూజర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.