రాహుల్ అపరిపక్వ నేత....బీజేపీకే హెల్ప్ !
రాహుల్ గాంధీవి అపరిపక్వ రాజకీయ విధానాలు అని డీఎంకే తన అధికారిక పత్రిక మురసోలిలో తీవ్ర విమర్శలు చేసింది.
రాహుల్ గాంధీని బీజేపీ ఎటూ విమర్శిస్తుంది. అదే సమయంలో ఆయనే తమకు ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటుంది. అక్కడ రాహుల్ ఉంటే ఇక్కడ తాము అప్రతిహత విజయాలను సాధిస్తూనే ఉంటామని కూడా కాషాయదళం ధీమా వ్యక్తం చేస్తుంది. సరే బీజేపీ విమర్శించడం సహజం, సర్వ సాధారణం. కానీ చేయి చేయి కలిపి దశాబ్దాల పాటు మిత్రులుగా మెలిగిన తరువాత ఒక మిత్రుడు నుంచి రాహుల్ కి ఈ తరహా విమర్శలు రావడం అంటే ఆలోచించుకోవాల్సిందే అని అంటున్నారు. ఇంతకీ ఎవరా మిత్రుడు ఏమా కధ అంటే ఆయన తాజా మాజీ మిత్రుడు డీఎంకే ఈ రకంగా వ్యాఖ్యానించారు అన్నది మ్యాటర్.
తీవ్ర విమర్శలతో :
రాహుల్ గాంధీవి అపరిపక్వ రాజకీయ విధానాలు అని డీఎంకే తన అధికారిక పత్రిక మురసోలిలో తీవ్ర విమర్శలు చేసింది. ఆయన వ్యవహార శైలి ఇండియా కూటమికే ఇబ్బందిగా మారిందని కూడా స్పష్టం చేసింది. పైగా రాహుల్ చేస్తున్న చర్యలు పోతున్న పోకడలు తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ కూడా బీజేపీకే లాభించేలా ఉన్నాయని కూడా మురసోలి పత్రిలో పేర్కొంటూ కాంగ్రెస్ అగ్ర నేతను గట్టిగానే టార్గెట్ చేసింది.
పినరయి విజయన్ విషయంలో :
కేరళ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ నాడు సీఎం గా ఉన్న కమ్యూనిస్టు వృద్ధ నేత పినరయి విజయన్ విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏకంగా మోడీకి విజయన్ కి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కూడా ఆరోపించారు. ఇండియా కూటమిలో కమ్యూనిస్టులు మిత్రులు. అలాంటిది పోటీ చేసే చోట విమర్శలు చేయవచ్చు కానీ మరీ ఇంతలా చేయడం పట్ల వామపక్షాలు తీవ్రంగానే మండిపడ్డాయి. అదే విషయాన్ని గుర్తు చేస్తూ మురసోలి పత్రిలో గట్టిగానే విమర్శలు రాహుల్ మీద చేశారు.
అవకాశవాదమే అంటూ :
ఇక తమిళనాడులో తమతో కలసి జట్టు కట్టి ఎన్నికల్లో పోటీ చేసి అయిదు సీట్లు సాధించి మరుక్షణం విజయ్ తో పొత్తు పెట్టుకోవడం పచ్చి అవకాశ వాదమే అని డీఎంకే మండిపడింది. అదే విషయాన్ని మురసోలిలో రాసుకొచ్చారు. సిద్ధాంతాలు మరచి చేసే ఈ రాజకీయ విన్యాసాలు ఎవరికి మేలు చేస్తాయో కూడా రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలని మురసోలి సూచించింది. రాహుల్ గాంధీ డీఎంకేని వెన్నుపోటు పొడిచారు అని కూడా మండిపడింది.
వారంతా అసంతృప్తిగానే :
ఇక యూపీలో పెద్ద పార్టీగా ఉన్న ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా రాహుల్ గాంధీ చర్యల పట్ల నిర్ణయాల పట్ల అసంతృప్తిగా ఉన్నారని కూడా మురసోలి పత్రికలో రాసుకొచ్చారు. అలాగే బీహార్ లో తమ ఓటమికి కాంగ్రెస్ కారణం అని భావిస్తున్న ఆర్జేడీ కూడా రాహుల్ గాంధీ వ్యూహాల మీద మండిపడుతోంది అని మురసోలి స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ తీరు ఈ విధంగా ఉంటే కనుక అది కచ్చితంగా బీజేపీకే మేలు చేకూరుస్తుందని కూడా మురసోలి పత్రిక జోస్యం చెప్పేసింది. మిత్ర పక్షాలతో వ్యవహరించే తీరు సరిగ్గా లేకపోవడం తొందరపాటు నిర్ణయాల మీద రాహుల్ గాధీ చెక్ చేసుకోవాలని సూచించింది. ఇటీవల ఇండియా కూటమి ఢిల్లీలో సమావేశం అయినపుడు డీఎంకే హాజరు కాలేదు. ఆగ్రహంతోనే ఇలా చేసింది. ఇపుడు రాహుల్ గాంధీని తమ అధికార పత్రికలోనే గట్టిగా విమర్శించడంతో కాంగ్రెస్ కి మరింత దూరంగా డీఎంకే జరిగింది అని అంటున్నారు. చూడాలి మరి ఫ్యూచర్ లో ఈ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయో.