వైజాగ్ ఐటీ సంచలనం.. రంగంలోకి పెద్ద కంపెనీలు - వేలల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు!

ఇక యాక్సెంచర్, కేప్ జెమిని, డెలాయిట్ కూడా విశాఖపై ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. యాక్సెంచర్ 12 వేలు, కేప్ జెమిని 15 వేల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందని అంటున్నారు.

Update: 2026-05-20 09:30 GMT

హైదరాబాద్, బెంగళూరు తర్వాత ఐటీ హాట్ స్పాట్ గా విశాఖపట్నం పెద్దపెద్ద కంపెనీలను ఆకర్షిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఐటీ విధానంతో టీసీఎస్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు తమ కంపెనీలు తెరిచేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోగా, యాక్సెంచర్, కేప్ జెమిని, డెలాయిట్ వంటి దిగ్గజ కంపెనీలు విశాఖపై ఫోకస్ చేస్తున్నాయనే తాజా ప్రచారం ఆసక్తి రేపుతోంది. 12 వేల ఉద్యోగాలతో యాక్సెంచర్, 15 వేల ఉద్యోగాలతో కేప్ జెమిని విశాఖలో కార్యాలయాలను తెరిచేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయని ఐటీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ నడుస్తోంది.

దిగ్గజ కంపెనీలు విశాఖలో కొత్త క్యాంపస్ ల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నాయనే సమాచారం నిరుద్యోగ యువతీ, యువకులతోపాటు ఐటీ ప్రొఫెషనల్స్ లోనూ ఆసక్తికర చర్చగా మారింది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో పనిచేస్తున్న వారు కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల వారు విశాఖ తరలి వచ్చేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు. విశాఖ ఐటీ హబ్ తో ‘రివర్స్ మైగ్రేషన్’ త్వరలోనే సాధ్యమవుతుందని, వైజాగ్ వాతావరణం, జీవన ప్రమాణాలకు ఐటీ తోడైతే దేశంలోనే అత్యుత్తమ నగరంగా మారుతుందని పలువురు ఐటీ ప్రొఫెషనల్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 99 పైసలకే కంపెనీలకు స్థలాలు అప్పగిస్తుండటం, మౌలిక వసతుల కల్పన, అనుమతుల జారీ వంటి వాటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడంతో బడా బడా కంపెనీలు విశాఖ వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయని అంటున్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలకు ప్రభుత్వం ఇప్పటికే స్థలాలు కేటాయించడం, ఆయా కార్యాలయాల నిర్మాణ పనులు ప్రారంభమవడం జరిగిందని అంటున్నారు. ఇన్ఫోసిస్ కు 20 ఎకరాలు, టీసీఎస్ కు 21.16 ఎకరాలు, కాగ్నిజెంట్ కు 22 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందని చెబుతున్నారు. ఈ మూడు సంస్థలు కలిపి 27 వేల వరకు కొత్త ఉద్యోగాలకు అవకాశం కల్పిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇక యాక్సెంచర్, కేప్ జెమిని, డెలాయిట్ కూడా విశాఖపై ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. యాక్సెంచర్ 12 వేలు, కేప్ జెమిని 15 వేల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోందని అంటున్నారు. ఇలా రానున్న కొద్ది రోజుల్లో విశాఖకు కొత్తగా లక్ష వరకు ఐటీ ప్రొఫెసనల్స్ తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు కేవలం ఐటీ మాత్రమే కాకుండా, సిఫీ ద్వారా వస్తున్న డేటా సెంటర్లు, బీవీఎం సంస్థ నిర్మించబోయే 'వరల్డ్ ట్రేడ్ సెంటర్' వంటివి విశాఖ ముఖచిత్రాన్ని మార్చనున్నాయని చెబుతున్నారు.

Tags:    

Similar News