జీవీఎంసీ మేయర్ : కూటమి లో ధీమా పెరిగిందా ?
అంతా కలసి ఐక్యంగా ముందుకు కదులుతున్నాయి. తాజాగా ఒక హొటల్ లో కూటమిలోని పార్టీలు అన్నీ కలసి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.;
విశాఖ మేయర్ సీటు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. పైగా ఈ సీటుని కైవశం చేసుకోవాలని కూటమి పార్టీ నేతలు పట్టుదలగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గతంలో ఒకసారి మాత్రమే మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. 1987లో తొలిసారి విశాఖ మేయర్ పదవిని టీడీపీ చేపట్టింది.
ఆ తర్వాత మళ్ళీ ఆ పదవి అయితే పసుపు పార్టీకి దక్కలేదు. అలాంటి చాన్స్ ఈసారి దక్కబోతోందా అంటే లెక్కలు అన్నీ కరెక్ట్ గానే ఉన్నాయని అంటున్నారు. జీవీఎంసీ మేయర్ గా ఉన్న వైసీపీ మహిళా నాయకురాలు గొలగాని హరి వెంకట కుమారిని మాజీని చేసే విషయంలో కూటమిలోని మూడు పార్టీలు పక్కాగానే ఉన్నాయి.
అంతా కలసి ఐక్యంగా ముందుకు కదులుతున్నాయి. తాజాగా ఒక హొటల్ లో కూటమిలోని పార్టీలు అన్నీ కలసి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. దాంతో ఈ నెల 19న జరిగే అవిశ్వాసం మీద ప్రత్యేక చర్చలో ఎలా గెలవాలన్నది కూడా యాక్షన్ ప్లాన్ ని రెడీ చేశారు అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే వైసీపీ చాలా రోజుల క్రితమే బెంగళూరుకి క్యాంప్ మార్చింది అని అంటున్నారు. అలగే అటు నుంచి విదేశాలకు కూడా ఆ క్యాంప్ ని షిఫ్ట్ చేసింది అని ప్రచారం సాగింది. అయితే వైసీపీలో ఉన్న వారు ఎంత మంది అనేది తెలియడం లేదు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఒక మాజీ ఎమ్మెల్యే వైసీపీలో కీలక నేత రాజకీయ కుటుంబానికి చెందిన నేత కుమారుడే కూటమి వైపు జంప్ చేశారు అంటే వైసీపీ వ్యూహాలు ఎంత పేలవంగా ఉన్నాయో అని అంటున్నారు.
స్పెషల్ క్యాంపులు పెట్టి మరీ తమ మేయర్ పీఠాని కాపాడుకుంటామని మొదట చెప్పిన మాటలు కానీ ఆ విధంగా అమలు చేయాల్సిన వ్యూహాలు కానీ ఆచరణలో కనిపించడం లేదా అన్న సందేహాలు వస్తున్నాయి. అంగ బలం అర్ధంబలంతో పాటు అధికార బలం నిండుగా ఉన్న కూటమి రాజకీయ వ్యూహాలు కూడా భేషూగ్గా ఉన్నాయని అంటున్నారు. ఈ కారణంగానే భారీ మ్యాజిక్ ఫిగర్ ని సైతం కూటమి ఇప్పటికే చేరుకుంది అని ప్రచారం సాగుతోంది. దాంతో ఈ నెల 19న జరిగే అవిశ్వాస తీర్మానం మీద చర్చ లాంచనమే అవుతుందా అన్నది కూడా అంతా అంటున్న మాట.
మొత్తానికి చూస్తే వైసీపీ మేయర్ పదవి విషయంలో అయితే నిలబెట్టుకుంటుందా అన్న చర్చ అయితే వేడిగా సాగుతోంది. మరో వైపు కూటమి విశాఖ వంటి చోట అవిశ్వాసం తీర్మానం ఇచ్చి ఓటమి పాలు అయితే ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆరు నూరు అయినా గెలిచేందుకే చూస్తారు అని అంటున్నారు. ఈ విధంగా ఉన్న రాజకీయ వాతావరణంలో మేయర్ గా ఎవరు ఉంటారు అన్నది మాత్రం ఆసక్తిని పెంచుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.