బీసీ వర్సెస్ బీసీ... టీడీపీ వైసీపీల మధ్య కొత్త పోరు!
విశాఖ మేయర్ గా నాలుగేళ్ళ పాటు వైసీపీకి చెందిన మహిళా నాయకురాలు హరి వెంకట కుమారి వ్యవహరించారు.;
విశాఖ మేయర్ గా నాలుగేళ్ళ పాటు వైసీపీకి చెందిన మహిళా నాయకురాలు హరి వెంకట కుమారి వ్యవహరించారు. ఆమె పూర్వాశ్రమంలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. విద్యాధికురాలు. ఆమె బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో పాటు బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు. తాము విశాఖ నగరంలో అత్యధిక జనాభా ఉన్న యాదవులకు అధికార పదవులు ఇచ్చి న్యాయం చేశామని వైసీపీ చెబుతోంది.
యాదవులు సిటీలో అత్యధికంగా ఉన్నారని వారిని కాదని ఇపుడు తమ పార్టీ మేయర్ ని అకారణంగా అన్యాయంగా టీడీపీ కూటమి దించేసింది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇది యాదవ సామాజిక వర్గం మనోభావాలను దెబ్బ తీయడమే అని విమర్శిస్తున్నారు.
యాదవులకే మళ్ళీ మేయర్ పీఠం ఇవ్వగలరా అని వైసీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. టీడీపీ కూటమి తరఫున గవర సామాజిక వర్గానికి చెందిన పీలా శ్రీనివాసరావు పేరుని మేయర్ పదవికి ఖరారు చేశారు. దాంతో యాదవ సామాజిక వర్గానికి డిప్యూటీ మేయర్ గా చాన్స్ ఇస్తామని అంటున్నారు.
అయితే అలా కాదు యాదవ మహిళను తీసేశారు కాబట్టి అదే సామాజిక వర్గానికే మేయర్ ఇవ్వాలని వైసీపీ నేతలు అంటున్నారు. విశాఖలో యాదవ సామాజిక వర్గం అధికంగా ఉంది. దాంతో ఆ వర్గం నేతలు కూడా మేయర్ సీటుని తమకే ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో రాజకీయంగా టీడీపీని ఇరకాటంలో పెట్టేందుకు వైసీపీ ఈ రకమైన వ్యూహాన్ని రచిస్తోంది అని అంటున్నారు.
అయితే విశాఖ సిటీలో యాదవుల తరువాత గవరలు కూడా అత్యధిక సంఖ్యలో ఉన్నారు. జీవీఎంసీ ఏర్పాటు అయ్యాక యాదవులకు ఇద్దరికి మేయర్ చాన్స్ వచ్చింది. కానీ గవరలకు రాలేదు. దాంతో ఆ లోటుని భర్తీ చేస్తున్నామని కూటమి నేతలు అంటున్నారు. పైగా 2021 ఎన్నికల ముందు భీమిలి అనకాపల్లి సహా మున్సిపాలిటీలు జీవీఎంసీలో కలిపేసి 98 వార్డులుగా చేశారు. అలా చూసుకుంటే గవరల బలం కూడా అధికంగా పెరిగింది అని గుర్తు చేస్తున్నారు.
అనకాపల్లి, విశాఖ పశ్చిమం, గాజువాక, పెందుర్తిలలో గవరలు అధికంగా ఉన్నారని చెబుతున్నారు. అయినా యాదవులకు టీడీపీ అన్యాయం చేయలేదని ఏకంగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవే వారికి ఇచ్చిందని అంటున్నారు. అయితే విశాఖలో పాలనకు కీలకం అయిన జీవీఎంసీకి మేయర్ గా తమ సామాజిక వర్గం వారు ఉంటే మేలు అన్నది యాదవుల మాటగా ఉంది.
ఈ నేపధ్యంలో బీసీ వర్సెస్ బీసీగా కొత్త రాజకీయ సామాజిక వ్యూహానికి వైసీపీ తెర తీస్తోంది. అయితే టీడీపీ కూడా ధీటుగానే వ్యవహరిస్తోంది. బీసీలకు న్యాయం చేస్తోంది తామే అని ఆ పార్టీ అంటోంది. సామాజిక న్యాయం అంటే మాకే పేటెంట్ హక్కులు ఉన్నాయని చెబుతోంది. మొత్తం మీద చూసుకుంటే జీవీఎంసీకి కాబోయే కొత్త మేయర్ విషయంలో సామాజిక కోణంలో రచ్చ సాగుతోంది.
ఇక వచ్చే ఏడాది ఎటూ జీవీఎంసీకి ఎన్నికలు ఉంటాయి కాబట్టి అపుడు గెలిచేందుకు ఇప్పటి నుంచే కీలక సామాజిక వర్గాలను దువ్వుతున్నారా అన్నది కూడా చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే గవరలకు మేయర్ పదవి రాక రాక వస్తూంటే వైసీపీ ఈ విధంగా కొత్త డిమాండ్లు చేయడం పట్ల ఆ సామాజిక వర్గం అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.
వైసీపీ అయిదేళ్ళ పాలనలో గవరలకు మంత్రి పదవి ఇవ్వలేదని వారంతా వన్ సైడెడ్ గా 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి వైపు జరిగారు. ఇపుడు వైసీపీ టీడీపీని టార్గెట్ చేసే క్రమంలో మరో బలమైన సామాజిక వర్గం మద్దతుని పూర్తిగా పోగొట్టుకునే చర్యలకు దిగుతుందా అన్నది కూడా ప్రశ్నిస్తున్నారు.
సామాజిక సమీకరణలు అన్నవి సున్నితమైన అంశాలు వాటి విషయంలో రచ్చ చేయడం వల్ల రాజకీయంగా లాభం కంటే నష్టమే ఎక్కువ అన్నది విశ్లేషణగా ఉంది. కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. అపుడు వైసీపీ తన సామాజిక లెక్కలు ఏమిటో జనం ముందు చెప్పుకోవాలని ప్రత్యర్ధులు అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ ఈ కుల బాణం ద్వారా టీడీపీ మీద ఒత్తిడి పెంచినా రెండిందాల చెడిపోవడమే తప్ప దక్కేది పెద్దగా ఉండదని అంటున్న వారూ ఉన్నారు.