తండ్రీ కొడుకులు విదేశాల్లో జల్సా చేస్తున్నారు

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ మీద వైసీపీ ఘాటైన విమర్శ చేసింది.;

Update: 2025-10-24 16:48 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ మీద వైసీపీ ఘాటైన విమర్శ చేసింది. పెట్టుబడుల పేరుతో విదేశాలలో తండ్రీ కొడుకులు జల్సా చేస్తున్నారు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకరు ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ ని చూస్తూంటే మరొకరు దుబాయ్ లో తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. అంతే కాకుండా విశాఖలో గూగుల్ డేటా సెంటర్ తో ఏకంగా 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తూ ఊదరగొడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. డేటా సెంటర్ తో లక్షల ఉద్యోగాలు ఎలా వస్తాయో చెప్పలేకపోతున్నారు అని అన్నారు. అయితే డేటా సెంటర్ ద్వారా క్రియేట్ అయ్యే ఎకో సిస్టం తో ఉద్యోగాలు వస్తాయన్నది కూడా వారు చెప్పలేకపోతున్నారని గుడివాడ అన్నారు.

ఒక్క ప్రాజెక్టు చెప్పండి :

చంద్రబాబు నాలుగు సార్లు సీఎం గా ఉన్నారని తన హయాంలో ఒక ప్రాజెక్ట్ ప్రారంభించి పూర్తి చేసినది ఒక్కటి చెప్పగలరా అని ఆయన నిలదీశారు. వైసీపీ హయాంలోనే డేటా సెంటర్ విశాఖకు వచ్చిందని ఆయన చెప్పారు అదానీ పేరు చెబితే ఎక్కడ జగన్ కి క్రెడిట్ వస్తుందో అని ఆయన పేరు ఎత్తడం లేదని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ పేరుతో చంద్రబాబు లోకేష్ ప్రచారం చేసుకుంటున్నారని అయితే ఈ రకమైన కుట్ర ప్రచారాన్ని వైసీపీ బద్ధలు కొట్టిందని గుడివాడ అన్నారు.

రాయితీల మీదనే :

తాము గూగుల్ డేటా సెంటర్ ని వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారని అయితే ఆ సంస్థకు అంత పెద్ద ఎత్తున ఇస్తున్న రాయితీల మీదనే తాము ప్రశ్నిస్తున్నామని ఆయన అన్నారు అంతే కాదు ఎన్ని ఉద్యోగాలు వస్తాయని తాము అడుగుతూంటే జవాబు చెప్పుకోవడం చేతకాక తమ మీద విమర్శలు చేస్తారా అని మండిపడ్డారు. ప్రజలకు ఈ విషయాలు అన్నీ అర్ధం అయ్యేసరికి కూటమి కేబినెట్ మొత్తం దిగిపోయి ప్రెస్ మీట్లు పెడుతూ వైసీపీ మీద విమర్శలు చేస్తోందని ఆయన అన్నారు.

జగన్ ప్రెస్ మీట్ తో :

మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ప్రెస్ మీట్ తో విశాఖ గూగుల్ సెంటర్ ఎవరి వల్ల వచ్చింది అన్నది ప్రజలకు మొత్తం తెలిసింది అని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం పెద్దలు ఇప్పటికైనా గూగుల్ డేటా సెంటర్ లో అదానీ పేరు చేర్చాలని లేకపోతే ఆయన భాగస్వామ్యం లేదని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మొత్తం పెట్టుబడులు అన్నీ అదానీవే అని ఆయన అన్నారు. జగన్ చెప్పిన దాంట్లో అబద్ధం ఏమి ఉందో చెప్పాలని ఆయన కోరారు. విశాఖ వేదికగా 2023 మే 3న అదానీ డేటా సెంటర్ కి జగన్ శంకుస్థాపన చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు.

ఆ ముగ్గురూ కలిసి :

ఇదిలా ఉంటే విశాఖలో డేటా సెంటర్ ని గూగుల్ అనుబంధ సంస్థ రైడన్, అలాగే అదానీ, ఎయిర్ టెల్ కలసి ఏర్పాటు చేస్తున్నాయని గుడివాడ అన్నారు. ఈ డేటా వల్ల రెండు వందల దాకా మాత్రమే ఉద్యోగాలు వస్తాయని ఆయన అన్నారు. అయితే లక్ష 88 వేల ఉద్యోగాలు ఎక్కడ నుంచి వస్తాయని గుడివాడ ప్రశ్నించారు.

గూగుల్ చెప్పింది ఇదే :

ఇక అదానీ పేరుని గూగుల్ సంస్థ అధికారికంగా నోటిఫై చేసింది అని గుడివాడ గుర్తు చేశారు. ఈ నెల 14న ఒప్పందం జరిగితే సరిగ్గా పది రోజుల తరువాత అదే సంస్థను నోటిఫైడ్ పార్టనర్ గా గూగుల్ సంస్థ ప్రకటించిందని ఆయన చెప్పారు. ఈ మేరకు గూగుల్ సంస్థ నుంచి అలెగ్జాండర్ స్మిత్ అనే ఆయన ఏపీ ప్రభుత్వంలోని ఐటీ సెక్రటరీ కాటమ్నేని భాస్కర్ కి అదానీ తమ పార్టనర్ అని లేఖ రాశారు అని ఆయన చెప్పారు. ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అన్ని కూడా అదానీ సంస్థ ఆధ్వర్యంలోనే తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇవన్నీ అదానీ డేటా సెంటర్ అని స్పష్టం చేస్తున్నా చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తూ అదానీ పేరు ప్రస్తావించడం లేదని గుడివాడ అంటున్నారు.

Tags:    

Similar News