జగన్ కంటే ముందే విశాఖ రాజధాని అన్న సీఎం ?

ఆ విషయం అలా ఉంచితే విశాఖ రాజధాని అన్నది కేవలం వైసీపీ నాయకులు చేసిన ప్రచారం వల్ల వచ్చిన భావన కాదు. దానికి ఎంతో చరిత్ర ఉంది.

Update: 2026-05-20 17:30 GMT

విశాఖ రాజధాని అన్నది ఇటీవల కాలంలో వచ్చిన నినాదం. వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి జగన్ విశాఖ రాజధానిగా చేస్తామని పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. తాను విశాఖను పరిపాలనా రాజధానిగా చేసుకుని పాలిస్తాను అని కూడా ఆయన చెబుతూ ఉండేవారు. అలా 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ పాలనలో తరచూ ఇదే విషయం ఆ పార్టీ నేతలు మంత్రులు అంతా గట్టిగా చెబుతూ వచ్చారు. అయితే వైసీపీ మూడు రాజధానుల ప్రతిపాదంకు వ్యతిరేకంగా 2024 ఎన్నికల్లో తీర్పు వెలువడింది. అది ఒక రాజకీయ ముచ్చట. ఆ విషయం అలా ఉంచితే విశాఖ రాజధాని అన్నది కేవలం వైసీపీ నాయకులు చేసిన ప్రచారం వల్ల వచ్చిన భావన కాదు. దానికి ఎంతో చరిత్ర ఉంది.

ఆనాడే డిమాండుగా :

విశాఖను రాజధానిగా చేసుకోవాలన్నది ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి అప్పటికి 11 జిల్లాలుగా ఉన్న సీమాంధ్ర విడిపోయింది. అలా కర్నూలు రాజధానిగా ఏర్పాటు అయిన ఏపీ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పనిచేశారు. ఆయన ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి ఎస్ కోట నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి ఈ బాధ్యతలు చేపట్టారు. ఇక ఆనాడు కర్నూల్ అన్నది చాలా చిన్నగా ఉండడం రాజధానికి అవసరమైన సదుపాయాలు లేకపోవడంతో విశాఖ మీద ఆనాటి నాయకులకు మోజు పెరిగింది. అంతే కాదు 1953 అక్టోబర్ 1న ఏపీ రాష్ట్రం ఏర్పాటు అయితే 1954 మే నెలలో మండు టెండలలో నిర్వహించిన బడ్జెట్ సమావేశాలకు వేదిక విశాఖ అయింది. అలా నెల రోజుల పాటు బడ్జెట్ సెషన్ ఏయూలోని టీఎల్ఎన్ అసెంబ్లీ హాలులో నిర్వహించారు. ఆ సమయంలోనే విశాఖ రాజధాని ప్రతిపాదన మరింత గట్టిగా ముందుకు వచ్చింది.

విశాఖ గెలిచింది :

ఇక ఏపీకి రాజధానిగా కర్నూల్ నా లేక విశాఖను చేయాలా అన్న దాని మీద 1955 ఏప్రిల్ నెలలో ఒక ఓటింగ్ అన్నది అప్పటి శాసనసభలో జరిగింది. అంటే ఇప్పటికి 71 ఏళ్ళ క్రితం నాటి ముచ్చట అన్న మాట. అలా ఒక తీర్మానం ప్రవేశపెట్టి చర్చ జరిపి ఓటింగ్ నిర్వహిస్తే విశాఖపట్నానికి అనుకూలంగా 61 మంది ఎమ్మెల్యేలు ఓట్లు వేశారు, వ్యతిరేకంగా 58 మంది ఓట్లు వేశారు. అలా మూడు ఓట్ల మెజారిటీతో విశాఖ రాజధానిగా గెలిచింది. దాంతో 1956 ఏప్రిల్ నుంచే విశాఖపట్నాన్ని ఏపీకి రాజధానిగా చేస్తామని ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం ప్రకటించారు

అనూహ్యంగా విలీనం :

అయితే ఆనాడు కొందరు కాంగ్రెస్ పెద్దలు హైదరాబాద్ స్టేట్ లో ఏపీని విలీనం చేసి విశాలాంధ్రగా చేస్తే హైదరాబాద్ నగరం ఏ ఇబ్బంది లేకుండా రాజధానిగా ఉంటుంది కదా అని ప్రతిపాదించారు. దాంతో ఈ విషయం మీద సీరియస్ గానే చర్చలు జరగడం అవి ఫలవంతం అవడంతో 1956 నవంబర్ 1 నుంచి ఉమ్మడి ఏపీగా రాష్ట్రం ఆవిర్భవించడంతో హైదరాబాద్ రాజధాని అయిపోయింది. అలా తృటిలో విశాఖ రాజధాని అన్నది అమలు కాకుండా ఉండిపోయింది.

పాత తీర్మానం అలాగే :

అయితే విశాఖ రాజధాని అని కర్నూల్ అసెంబ్లీలో పెట్టిన పాత తీర్మానం నెగ్గింది అలాగే ఉండిపోయింది. 2014లో అదే భౌగోళిక స్వరూపంతో ఏపీ తిరిగి విభజనతో వెనక్కి వచ్చేసింది. దాంతో పాత తీర్మానానికి విలువ ఇస్తూ ఏపీకి విశాఖను రాజధానిగా చేయాలని చాలా మంది మేధావులు అప్పట్లో తమ స్వరం వినిపించారు. కానీ ఏపీకి కొత్త రాజధాని నిర్మాణం అని టీడీపీ నిర్ణయం తీసుకుంది. వైసీపీ అయితే విశాఖ రాజధాని అని చెప్పింది కానీ ఆచరణలో ఒక్క అడుగూ ముందుకు వేయలేకపోయింది. ఇవన్నీ ఇపుడు ఎందుకు చర్చ అంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం వర్ధంతి. 1957 మే 20న ఆయన మరణించారు. అందుకే మరోసారి ఏపీ చరిత్రను రాజధానుల గురించి టంగుటూరి వారి నిర్ణయాల గురించి అంతా గుర్తు చేసుకుంటున్నారు.

Tags:    

Similar News