వైసీపీ తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందేనా ?
వైసీపీ అయితే చాలా ఇబ్బందులు పడుతూ లేస్తూ ఎవరికి ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాలో చూసుకుని మరీ స్థానికుడైన మొల్లి అప్పారావుకు అప్పగించింది.;

విశాఖ సిటీలో తూర్పు నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం గా ఉంది. ఇక్కడనే ఆసియాలో అతి పెద్ద కాలనీగా పేరు పొందిన ఎంవీపీ కాలనీ ఉంది. పేదలు పెద్దలు అంతా కలసి ఉండే నియోజకవర్గం. 2009లో విశాఖ రెండు నుంచి వేరుపడిన విశాఖ తూర్పు ఇంకా పెద్ద నియోజకవర్గం గా ఉంది. మొత్తం రెండున్నర లక్షల ఓటర్లు ఇక్కడ ఉన్నారు.
ఇక రాజకీయంగా చూస్తే కనుక ఈ సీటు పుట్టిన దగ్గర నుంచి టీడీపీకి కంచుకోటగా మారిపోయింది. వైసీపీకి ఇది అందని పండుగా మారింది. ఈ సీటు నుంచి వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా గెలుపు పిలుపు వినలేకపోతోంది. ప్రతీ ఎన్నికకూ ఒక అభ్యర్ధిని కొత్తగా తెచ్చి నిలబెట్టడంతో పాటు వర్గ పోరుని సరిదిద్దలేక వైసీపీ భారీ మూల్యం చెల్లించుకుంది. 2024లో అయితే ఇంకా పెద్ద దెబ్బ పడిపోయి పార్టీ ఉనికికే ముప్పు తెచ్చేసింది.
విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణకు తూర్పు సీటు ఇవ్వడంతో అక్కడ స్థానికంగా బలమైన నేతగా ఉంటూ వైసీపీ నిర్మాణం కోసం మొదటి నుంచి ఎంతో కృషి చేసిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ వైసీపీకి గుడ్ బై చెప్పేసి జనసేనలో చేరిపోయారు. ఆయన హ్యాపీగా విశాఖ సౌత్ సీటు తెచ్చుకుని గెలిచారు.
ఇక వైసీపీ నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్న మాజీ మునిసిపల్ చైర్ పర్సన్ అక్రమాని విజయనిర్మల కూడా ఎంవీవీకి టికెట్ ఇవ్వడంతో అలిగి టీడీపీలోకి వెళ్లిపోయారు. ఇలా చాలా మంది నేతలు పార్టీని వీడడంతో 2024లో వార్ వన్ సైడ్ అయింది. అలా నాలుగవ సారి సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు గెలిచారు.
వైసీపీ అయితే చాలా ఇబ్బందులు పడుతూ లేస్తూ ఎవరికి ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాలో చూసుకుని మరీ స్థానికుడైన మొల్లి అప్పారావుకు అప్పగించింది. బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పాటు పక్కా లోకల్ గా ఉన్నారు కాబట్టి ఈసారి బీసీ కార్డుతో వైసీపీ ప్రయోగం చేస్తోంది అని అంటున్నారు. అంతే కాకుండా తూర్పుతో పెద్ద ఎత్తున ఉన్న బీసీ సామాజిక వర్గాలు అయిన పద్మశాలి, తూర్పు కాపు, శెట్టి బలిజ, మత్య్సకార వర్గాలను తిరిగి దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
అయితే తూర్పులో మధ్య తరగతి ఉన్నత వర్గాల ఓటు షేర్ కూడా అధికంగా ఉంది. వీరు మొదటి నుంచి టీడీపీకి అండగా ఉంటూ వస్తున్నారు. వీరంతా ఎపుడూ మొదటే పోలింగ్ బూతులకు వెళ్ళి ఓట్లు వేస్తూ ఉంటారు. వారి మద్దతు వైసీపీకి గడచిన మూడు ఎన్నికల్లోనూ దక్కలేదు, విద్యావంతులు చదువరులు ఉన్న చోట వారిని ఆకట్టుకునే విధంగా వైసీపీ తన విధానాలలో మార్పు తీసుకుని రావాల్సి ఉందని అంటున్నారు లేని పక్షంలో తూర్పు తిరిగి దండం పెట్టాల్సిందే అన్న మాట కూడా ఇక్కడ వినిపిస్తోంది.