చలో సింగపూర్.. వచ్చేనెల నుంచి విమాన సర్వీసులు
ఇక భవిష్యత్తులో విజయవాడ-సింగపూర్ మధ్య కోటి మందికి పైగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.;
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మించడంలో కీలక భాగస్వామిగా ఉన్న సింగపూర్ కు రాష్ట్రం నుంచి నేరుగా విమాన సర్వీసు ప్రారంభం కానుంది. వచ్చేనెల 15న గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్ విమాన సర్వీసు ప్రారంభానికి ఇండిగో సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. రాజధానితోపాటు రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కోసం సింగపూర్ ప్రభుత్వం రూ.45 వేల కోట్లు పెట్టుబడి పెడుతోంది. అయితే ఏపీ నుంచి సింగపూర్ కు విమాన కనెక్టవిటీ లేకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విమానయాన శాఖతో సంప్రదించి కొత్త విమాన సర్వీసు ప్రారంభానికి చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.
నవంబర్ 15 నుంచి గన్నవరం-సింగపూర్ విమాన సర్వీసు అందుబాటులో రానుంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఈ విమానం నడవనుంది. విజయవాడలోని గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్ లోని చాంగీ విమానాశ్రయాల మధ్య ఈ విమాన సర్వీసులు తిరగనున్నాయి. సీఎం చంద్రబాబు జూలై 28న సింగపూర్ లో పర్యటించిన సమయంలోనే ఈ సర్వీసు విషయంపై ప్రస్తావన వచ్చింది. అప్పట్లో ప్రవాసాంధ్రులకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు వంద రోజుల్లోనే విమాన సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ఇక భవిష్యత్తులో విజయవాడ-సింగపూర్ మధ్య కోటి మందికి పైగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ విమాన కనెక్టవిటీతో అమరావతికి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. విశ్వనగరంగా అమరావతిని తీర్చిదిద్దాలంటే ప్రపంచ దేశాలు అన్నింటితో కనెక్టవిటీ మెరుగుపడాలని ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు. ఈ నూతన విమాన సర్వీసు ఏపీని సన్ రైజ్ స్టేటుగా ప్రపంచానికి మరింత చేరువ చేస్తుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు.
రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన తయారీలో సింగపూర్ 2014లోనే ఒప్పందం కుదుర్చుకుంది. సింగపూర్ ప్రభుత్వం, సర్బానా జురాంగ్ వంటి సింగపూర్ అంతర్జాతీయ పట్టణ ప్రణాళిక సంస్థల సహకారంతో రాజధాని నగరం, సీడ్ డెవలప్‌మెంట్ ఏరియా కోసం మూడు మాస్టర్ ప్లాన్‌లను రూపొందించారు. ఈ మాస్టర్ ప్లాన్లలో ఆధునిక, సుస్థిర పట్టణీకరణ సూత్రాలను పొందుపరిచారు. దీనికి సింగపూర్ విజయవంతమైన పట్టణాభివృద్ధి అనుభవం ఆధారంగా చేసుకున్నారు. అయితే 2019లో రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి ప్రాజెక్ట్‌ను పునరుద్ధరించాలని నిర్ణయించారు. సింగపూర్ ప్రభుత్వం అమరావతి అభివృద్ధిలో భాగస్వామిగా ఉండేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కొత్త విమాన సర్వీసు ప్రారంభంతో ఈ పనులు మరింత వేగవంతమయ్యే పరిస్థితి ఉందంటున్నారు.