ఔను..! లిక్కర్ స్కాంలో వారిదే కీలకపాత్ర.. విజయసాయిరెడ్డి సంచలనం

కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ కేసులో సీఐడీ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఏపీలో లిక్కర్ స్కాంతోపాటు కాకినాడ సీపోర్టుపై సంచలన ప్రకటన చేశారు.;

Update: 2025-03-12 10:43 GMT
ఔను..! లిక్కర్ స్కాంలో వారిదే కీలకపాత్ర.. విజయసాయిరెడ్డి సంచలనం

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు గతంలో ప్రకటించిన ఆయన ఈ రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. కాకినాడ సీపోర్టు వాటాల అక్రమ బదిలీపై అభియోగాలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డి తాను వైసీపీకి ఎందుకు రాజీనామా చేయాల్సివచ్చిందో చెప్పారు. గతంలో జగన్ అంటే తనకు ఎంతో భక్తి అన్న విజయసాయి ఇప్పుడు ఆ భక్తి దేవుడిపైకి మళ్లిందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఆరోపిస్తున్న లిక్కర్ స్కాంతోపాటు కాకినాడ సీపోర్టు కేసులో అసలు దోషుల పేర్లు కూడా విజయసాయిరెడ్డి ప్రకటించడం సంచలనం రేపుతోంది.

కాకినాడ సీపోర్టు వాటాల బదిలీ కేసులో సీఐడీ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఏపీలో లిక్కర్ స్కాంతోపాటు కాకినాడ సీపోర్టుపై సంచలన ప్రకటన చేశారు. జగన్ ప్రభుత్వంలో వేల కోట్ల మేర లిక్కర్ స్కాం జరిగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి ప్రత్యేక విచారణ జరుపుతోంది. ఈ కేసులో వైసీపీలోని కొందరు ముఖ్య నేతల పాత్ర ఉందని ప్రచారం జరుగుతోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈ స్కాంలో భాగస్వామ్యం ఉందని టీడీపీ ఆరోపిస్తుండగా, ఇప్పుడు విజయసాయిరెడ్డి మరో కీలక వ్యక్తి బయటపెట్టారు.

భయం అనేది తన బ్లడ్ లోనే లేదన్న విజయసాయిరెడ్డి.. లిక్కర్ స్కాంలో పాత్రధారి, సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేనని తేల్చిచెప్పారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసినట్లు చెబుతున్నారు. వైసీపీలోని కీలక నేతగా, పార్టీ పెద్దలకు సన్నిహితుడిగా చెబుతున్న కసిరెడ్డి కనుసన్నల్లోనే లిక్కర్ స్కాం జరిగిందని విజయసాయిరెడ్డి చెప్పడంతో దీని పర్యావసనాలు ఎలా ఉంటాయనేది హీట్ పుట్టిస్తోంది. అంతేకాకుండా లిక్కర్ స్కాంపై మరిన్ని విషయాలు త్వరలో బయటపడతానని కూడా విజయసాయిరెడ్డి ప్రకటించారు.

విజయసాయిరెడ్డి ప్రకటనతో ఏపీలో లిక్కర్ స్కాం జరిగిందని తేటతెల్లమైనట్లైంది. గత ప్రభుత్వంలో విజయసాయిరెడ్డి కీలకంగా పనిచేశారు. ఆయన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం అనుమానిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ చుట్టూ కోటరీ చేరడంతో తన మనసు విరిగిపోయిందని చెబుతున్న విజయసాయిరెడ్డి, గత ప్రభుత్వంలోని గుట్టు విప్పేస్తున్నారని అంటున్నారు. మరోవైపు కాకినాడ సీపోర్టులో వాటాల బదిలీ మొత్తం విక్రాంత్ రెడ్డి కనుసన్నలోనే జరిగిందని చెప్పారు విజయసాయిరెడ్డి. ఈ కేసులో తనకు సంబంధం లేదని, అంతా విక్రాంత్ రెడ్డి మాత్రమే చేశారన్నారు. మొత్తానికి రెండు కీలక విషయాల్లో విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారినట్లు భావించాల్సివస్తోందని అంటున్నారు. దీంతో వైసీపీలో కీలక నేతలకు చిక్కులు తప్పవని అంటున్నారు.


Full View


Tags:    

Similar News