కరూర్ సాక్షిగా తమిళ రాజకీయం కీలక మలుపు తీసుకోబోతోందా ?
ఎన్నో ఆశలతో విజయ్ పార్టీని తమిళనాడులో స్థాపించారు. ఆయన పార్టీ పెట్టాక వచ్చిన ఊపే వేరు అన్నట్లుగా ఉంది.;
ఎన్నో ఆశలతో విజయ్ పార్టీని తమిళనాడులో స్థాపించారు. ఆయన పార్టీ పెట్టాక వచ్చిన ఊపే వేరు అన్నట్లుగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా లక్షలలో జనాలు తరలివచ్చారు ఒక దశలో ఒక సభలో అయితే ఏకంగా పది లక్షల మంది దాకా జనాలు వచ్చారని అది జాతీయ స్థాయి రికార్డుగా కూడా క్రియేట్ అయింది. విజయ్ పార్టీకి జనాలు పోటెత్తున్నారు. తమిళనాడులో ఎన్నికలు మరో ఆరేడు నెలలలో ఉంటాయనగా జనాలు వేలం వెర్రిగా విజయ్ పార్టీ వైపు పరుగులు తీయడం చూసిన వారికి ఉమ్మడి ఏపీలో 1982 నాటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఆనాడు ఎన్టీఆర్ టీడీపీ పెట్టి జనంలోకి వెళ్తే ఇదే తీరున జన సంద్రం కనిపించింది.
మార్పు కోసమేనా :
విజయ్ సభలకు వచ్చే జనాలు చూసేందుకే అని చాలా మంది విశ్లేషించారు. సినీ నటులు రాజకీయాల్లకి వచ్చి చేతులు కాల్చుకున్న వారు కూడా కొట్టి పారేస్తున్నారు. జస్ట్ అలా జనాలు వస్తారు కానీ నిజానికి వీరంతా పోలింగ్ బూత్ లకు వెళ్ళరని కూడా హాట్ కామెంట్స్ చేశారు. అయితే వస్తున్న జనాలలో యూత్ ఎక్కువగా ఉంది. అంతే కాదు మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ రెండు సెక్షన్లు కనుక ముందు ఉంటే కనుక కచ్చితంగా ఆ పార్టీకి సక్సెస్ రూట్ కనిపిస్తుందని గత చరిత్ర వెల్లడించింది. పైగా తమిళనాడులో ఉన్న రాజకీయాలు వేరు. అక్కడ రెండు పార్టీల వ్యవస్థ ఉండేది. కానీ అన్నా డీఎంకే బలహీనపడడం అదే సమయంలో అయిదేళ్ళ పాటు అధికారంలో ఉన్న డీఎంకేకి మరో చాన్స్ ఇవ్వాలా వద్దా అని జనాలు ఆశిస్తున్న సమయంలో విజయ్ కొత్త పార్టీతో ముందుకు వచ్చారు.
కరెక్ట్ టైం లో :
ఇక ఒక్కసారి వెనక్కి చూసుకుంటే 2021 ఎన్నికల్లోనే విజయ్ పార్టీ పెట్టి వస్తారు అని అంతా అనుకున్నారు. కానీ విజయ్ తనదైన వ్యూహంతోన ఆనాడు పార్టీ పెట్టలేదు. ఎందుకంటే అప్పటికి రెండు సార్లు అన్నా డీఎంకే అధికారంలో ఉంది. జనాలు మరో బలమైన పార్టీగా డీఎంకే వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఆ సమయంలో పార్టీ పెడితే ఫోకస్ అంతా డీఎంకే పైన ఉన్న వేల ఇబ్బంది అవుతుందని భావించే విజయ్ తన ప్లాన్ ని 2026కి మార్చుకున్నారు. అనుకున్నట్లుగా అన్నీ సెట్ చేసుకుని ఆయన బరిలోకి దిగారు. ఇపుడు డీఎంకే వర్సెస్ విజయ్ టీవీకేగా రాజకీయం మారుతోంది. మరో వైపు చూస్తూ జనాలు మార్పు వైపు మొగ్గు చూపుతున్న నేపధ్యం ఉంది. అన్నీ అనుకూలిస్తే విజయ్ పార్టీ అద్భుతాలు క్రియేట్ చేయగలదు అనుకుంటున్న టైంలో కరూర్ లో ఘోర దుర్ఘటన జరిగింది.
దూకుడుకు బ్రేకేనా :
తమిళనాడు కరూర్ లో జరిగిన ఘోర ఘటనతో విజయ్ టీవీకే పార్టీ పూర్తిగా ఆత్మ రక్షణలో పడింది రాజకీయాలకు కొత్త ఇంకా పార్టీ నిర్మాణం జరగలేదు, ఇంతలో అతి పెద్ద ఎదురు దెబ్బ, ఏకంగా 40 మందికి పైగా అమాయకులు చనిపోవడం అన్నది పార్టీకి ఏ విధంగా చూసినా తీరని నష్టం గానే మారుతోంది. ఇక విజయ్ అరెస్ట్ అంటున్నారు. అలాగే రాబోయే రోజులలో ఆయన సభలు జరగకుండా కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారిగా టీవీకే రాజకీయం తిరగబడినట్లు అయింది. ఏమి జరుగుతోందో కూడా కనీసంగా విజయ్ పార్టీ నేతలకు అర్ధం కాని విషయం. దశాబ్దాల అనుభవం కలిగిన డీఎంకే అలాగే ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్తారో కూడా ఒక పెద్ద చర్చ. దాంతో టీవీకే అయితే ఒంటరిగానే పోరాడాల్సి ఉంటోంది.
బీజేపీ మద్దతు :
ఈ క్రమంలో అనూహ్యంగా బీజేపీ నుంచి టీవీకే కిఅనూహ్యమైన మద్దతు దక్కుతోంది. ఆ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అయితే బహిరంగంగానే విజయ్ కి మద్దతు ఇచ్చారు విజయ్ తప్పు ఇందులో లేదు అన్నారు ఇంతటి ఘోరం జరగడం వెనక కచ్చితంగా ప్రభుత్వం ఉదాశీనత ఉందని అన్నారు. ఒక రాజకీయ పార్టీ సభలకు వచ్చే జనాలను అంచనా వేసుకుని తగిన విధంగా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుందని అన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఒక కొత్త పార్టీకి జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న బలమైన బీజేపీ నుంచి ఇలా మద్దతు దక్కింది. ఈ సమయంలో దీనిని తీసుకోవడం కూడా విజయ్ కి అవసరమే అవుతుంది అని అంటున్నారు. ఒక వేళ ఆయన తీసుకోకపోతే పరిణామాలు కూడా ఏ విధంగా మారుతాయో అన్నది ఉంది. ఏది ఏమైనా తమిళ రాజకీయం కరూర్ సాక్షిగా కీలక మలుపు తీసుకోబోతోందా అన్నదే చర్చగా ఉంది మరి.