రాజకీయ క్షేత్రంలో విజయ్ సరికొత్త ప్రయోగం!

వెండితెరపై తన నటనతో కోట్లాది మందిని అలరించిన 'స్టార్ హీరో' విజయ్, ఇప్పుడు రాజకీయ యవనికపై అత్యంత సాహసోపేతమైన అడుగు వేశారు.;

Update: 2026-04-01 12:25 GMT

వెండితెరపై తన నటనతో కోట్లాది మందిని అలరించిన 'స్టార్ హీరో' విజయ్, ఇప్పుడు రాజకీయ యవనికపై అత్యంత సాహసోపేతమైన అడుగు వేశారు. తన రాజకీయ అరంగేట్రంలోనే 'డ్యూయల్ రోల్' పోషిస్తూ.. అటు చెన్నైలోని పెరంబూర్, ఇటు ఆధ్యాత్మిక కేంద్రం తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి ఒకేసారి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. సుమారు మూడున్నర దశాబ్దాల తర్వాత తమిళనాడులో ఒక అగ్రనేత రెండు స్థానాల నుంచి బరిలోకి దిగుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 1991లో జయలలిత సృష్టించిన ప్రభంజనాన్ని తలపిస్తూ 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) అధినేతగా విజయ్ చేస్తున్న ఈ ప్రయోగం.. అటు అధికార డీఎంకే, ఇటు ప్రతిపక్ష అన్నా డీఎంకే వర్గాల్లో కొత్త ఆందోళనను, చర్చను రేకెత్తిస్తోంది. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌లో ఈ 'దళపతి' వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందోనని యావత్ భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

స్టార్ హీరో విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఒకేసారి రెండు నియోజకవర్గాలైన పెరంబూర్ , తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 35 ఏళ్ల తర్వాత ఒక ప్రముఖ నేత ఇలా రెండు స్థానాల నుంచి బరిలోకి దిగడం విశేషంగా చర్చనీయాంశమవుతోంది.

ఈ వ్యూహం కొత్తది కాకపోయినా తమిళనాడులో మాత్రం అరుదుగా కనిపించే రాజకీయ ప్రయోగం. 1991లో అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత బర్గూర్, కంగేయం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలిచి తన రాజకీయ ప్రభావాన్ని చాటుకున్నారు. ఆ తర్వాత పెద్ద స్థాయిలో ఇలాంటి సాహసం చేసిన నాయకులు చాలా అరుదు. దేశ రాజకీయాల్లో మాత్రం ఈ ట్రెండ్ చాలా కాలం నుంచే ఉంది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 1957లోనే రెండు లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేశారు. తరువాత సోనియా గాంధీ, నరేంద్ర మోదీ వంటి నేతలు కూడా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయాలు సాధించారు. అయితే 1996లో అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి రెండు స్థానాలకు మించి పోటీ చేయకూడదనే పరిమితి విధించబడింది.

విజయ్ ఎంపిక చేసిన పెరంబూర్ నియోజకవర్గం ప్రస్తుతం రాజకీయంగా అత్యంత కీలకంగా మారింది. ఇక్కడ డీఎంకే అభ్యర్థి ఆర్.డి. శేఖర్‌తో ఆయన నేరుగా పోటీ పడుతున్నారు. ఈ ప్రాంతంలో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి సుమారు 40 వేల మంది సభ్యులు ఉండటం ఆయనకు బలంగా భావిస్తున్నారు. ఒకప్పుడు రిజర్వ్డ్‌గా ఉన్న ఈ నియోజకవర్గం 2008 తర్వాత జనరల్ కేటగిరీగా మారింది. గతంలో డీఎంకే, అన్నా డీఎంకే మధ్యే ప్రధాన పోటీ ఉండేది. అయితే ఇప్పుడు విజయ్ ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

మరోవైపు తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో కూడా పోటీ ఉత్కంఠభరితంగా మారింది. ఇక్కడ డీఎంకే నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే ఇనిగో ఇరుదయ రాజ్ మళ్లీ బరిలో ఉన్నారు. గతంలో ఈ ప్రాంతంలో అన్నా డీఎంకే ఎక్కువసార్లు గెలిచిన చరిత్ర ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఈసారి మొత్తం 234 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమైంది. సెంగోట్టైయన్, ఆధవ్ అర్జున వంటి కీలక నేతలు కూడా బరిలో ఉండటం పార్టీకి బలం చేకూర్చుతోంది. ప్రజల్లో మార్పు కోరిక ఎంతవరకు ఉందన్నదే ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది.

గతంలో జయలలిత 2001లో నాలుగు చోట్ల నామినేషన్లు వేసినా అవి తిరస్కరణకు గురయ్యాయి. అయినప్పటికీ ఆమె తన పార్టీని విజయానికి నడిపించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అదే తరహాలో విజయ్ కూడా తన సినీ ఇమేజ్‌ను రాజకీయ ఓట్లుగా మార్చుకుని అసెంబ్లీలో అడుగుపెడతారా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పనుంది.

Tags:    

Similar News