రూ.35 కోట్లకు సెటిల్ మెంట్? విడాకుల రచ్చకు విజయ్ ఎండ్ కార్డు!
విజయ్ - సంగీత విడాకుల కేసు, చెన్నైలోని ఇంట్లో ఉండేందుకు అనుమతికి సంబంధించిన పిటిషన్లకు సంబంధించిన విచారణ ఈ రోజు చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ముందుకు రానుంది.;
విడాకుల కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తమిళ సినీహీరో.. టీవీకే అధ్యక్షుడు విజయ్ ఒక పరిష్కార మార్గానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకోవాలంటే..కొన్నేళ్లుగా భార్యతో దూరంగా ఉంటున్న విజయ్ కు.. అప్పట్లో ఎలాంటి ఇబ్బందులు రాలేదు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విడాకుల ఇష్యూ పెద్ద తలనొప్పిగా మారటమే కాదు.. పలు విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి. నిజానికి వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకోలేదు కానీ.. విడిగా ఉంటున్నట్లుగా విజయ్ సన్నిహితులు తమ అంతర్గత సంభాషణల్లో చెబుతుంటారు.
నిజానికి రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయినప్పుడే వ్యక్తిగత జీవితానికి ఉన్న ఇష్యూస్ ను క్లోజ్ చేసుకుంటే సమస్యలు ఉండేవి కావు. కానీ.. ఆ విషయంలో విజయ్ అంచనాలు భిన్నంగా ఉండటం.. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు ఆయనపై తీవ్ర ఒత్తిడికి గురి చేసినట్లుగా చెబుతున్నారు. ఇది సరిపోదన్నట్లు ఆయన భార్య సంగీత విజయ్ తో విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయటం తెలిసిందే.
తాజాగా ఈ పిటిషన్ ఈ రోజు(సోమవారం) కోర్టులో విచారణకు రానుంది. దీనికి ముందే.. వీరిద్దరూ కోర్టు వెలుపల ఒక ఒప్పందం చేసుకొని.. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇరు వర్గాల న్యాయవాదులు చర్చలు జరిపినట్లుగా సమాచారం. పరస్పర అంగీకారంతో విడాకులకు సంబంధించి.. భార్య సంగీత నుంచి రూ.250 కోట్ల సెటిల్ మెంట్ అడిగినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన నామినేషన్ లోని వివరాల ఆధారంగా ఈ మొత్తాన్ని అడిగినట్లుగా చెబుతున్నారు.
అయితే.. విజయ్ మాత్రం రూ.35 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. తనకు రూ.250కోట్లు.. పిల్లల సెటిల్ మెంట్ విషయంలో విజయ్ కమిట్ మెంట్ ను ఆయన భార్య సంగీత అడగ్గా.. ఆమెకు రూ.35 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పిన విజయ్.. పిల్లల ఇద్దరి భవిష్యత్తు తన బాధ్యతగా.. వారి బాగోగులు తాను చూసుకుంటానని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. విడాకుల కేసు ముగిసే వరకు చెన్నై నీలాంగరైలో ఉన్న విజయ్ ఇంట్లో ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సంగీత మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.
విజయ్ - సంగీత విడాకుల కేసు, చెన్నైలోని ఇంట్లో ఉండేందుకు అనుమతికి సంబంధించిన పిటిషన్లకు సంబంధించిన విచారణ ఈ రోజు చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ముందుకు రానుంది. ఈ కేసు విచారణకు హాజరు కావాలని విజయ్ కు కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.అయితే.. తనకు ఎన్నికల ప్రచారం ఉందని.. ఈ కారణంగా తనకు ఆన్ లైన్ ద్వారా విచారణకు హాజరు అవుతానని ఈ నెల 17న విజయ్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో.. విజయ్ ఆన్ లైన్ వేదికగా కోర్టు విచారణకు హాజరు కానున్నారు. విడాకులకు సంబంధించి ఒకట్రెండు వాయిదాల్లో పూర్తయ్యే అవకాశం ఉందని న్యాయవాద వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.