తమిళ ఓటర్లు ట్రాక్ మార్చలేదు...రెండో చాన్స్ ఇవ్వలేదు !

తమిళనాడులో ఒక సంప్రదాయం ఉంది. ఒకసారి అధికారం ఇచ్చిన పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపించడం అలవాటు.;

Update: 2026-05-04 17:32 GMT

తమిళనాడులో ఒక సంప్రదాయం ఉంది. ఒకసారి అధికారం ఇచ్చిన పార్టీకి వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపించడం అలవాటు. అది 1967లో డీఎంకే తొలిసారి అధికారం చేపట్టినప్పటి నుంచి కొనసాగుతూ వస్తున్న సంప్రదాయం. దానికి బ్రేక్ వేసిన వారు ఇద్దరే ఇద్దరు. వారే ఎంజీఆర్, అలాగే జయలలిత. ఇక తమిళనాడులో కాంగ్రెస్ నెట్టి ద్రవిడ పార్టీలు 1967లో తొలిసారిగా అధికారంలోకి వచ్చాయి. తొలి సీఎం అన్నాదురై రెండేళ్ళు పాలన చేశాక మరణించారు. దాంతో డీఎంకే నుంచి కరుణానిధి 1969లో తొలిసారి సీఎం అయ్యారు. ఇక ఆయన హయాంలో తొలిసారి 1972లో ఎన్నికలకు వెళ్తే జనాలు పట్టం కట్టారు. ఆ సమయంలో ఆయన వెంట తమిళుల సినీ ఆరాధ్య దైవం ఎంజీఆర్ ఉన్నారు. ఆయన కరుణానిధి విజయానికి పూర్తి సాయం చేసి పెట్టారు. ఎందుకంటే అప్పటికి ఎంజీఅర్ కూడా డీఎంకే నాయకుడే మరి. ఆ మీదట అభిప్రాయ భేదాలు రావడంతో ఎంజీఆర్ అన్నాడీఎంకే స్థాపించారు.

వరుసగా విజయం :

ఇక 1977లో తొలిసారిగా అన్నా డీఎంకే ఎంజీఆర్ నాయకత్వంలో తమిళనాడులో గెలిచింది. అయితే 1980లో ఎంజీఆర్ ప్రభుత్వాన్ని నాటి కేంద్ర ప్రభుత్వం కూల్చివేసి రాష్ట్రపతి పాలన పెట్టింది. ఇక ఆ తరువాత 1980లో జరిగిన ఎన్నికల్లో తిరిగి 1984లో జరిగిన ఎన్నికల్లో ఎంజీఆర్ వరసగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తంగా చూస్తే ఎంజీఆర్ మూడు సార్లు ప్రజల నుంచి వరుసగా సక్సెస్ లను అందుకుని ప్రభుత్వాన్ని స్థాపించారు. ఆ తరువాత జయలలిత కూడా 2011, అలాగే 2016లలో వరుసగా రెండు సార్లు గెలిచారు. ఇంతకు మించి తమిళనాట మరే పార్టీ మరే నాయకుడూ వరసగా గెలిచిన సందర్భాలు లేవు.

కరుణానిధి సైతం :

ఇక 1969లో తొలిసారి సీఎం అయి అప్పట్లో ఏడేళ్ళు, ఆ మీదట 1989 నుంచి రెండేళ్ళు, 1996, 2006 లలో మరో పదేళ్ళు కలుపుకుని మొత్తం పద్దెనిమిదేళ్ళ పాటు కరుణానిధి తమిళనాడుని ఏలారు. కానీ ఆయన వరుసగా రెండోసారి గెలిచింది లేదు. ఆ ఫీట్ ని 2011లో సాధించాలనుకున్నారు కానీ కుదరలేదు. ఇక 2021లో తొలిసారి డీఎంకే తరఫున సీఎం అయిన స్టాలిన్ 2026 లో మరోసారి గెలిసి తమ పార్టీ మీద ఉన్న ఆ యాంటీ సెంటిమెంట్ కి బ్రేక్ వేయాలనుకున్నారు. ఈసారి త్రిముఖ పోరు కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత చీలిపోతుంది అని తాను కచ్చితంగా గెలుస్తాను అని ఆయన అనుకున్నారు. కానీ జరిగింది వేరు. మొత్తం మీద ద్వితీయ గండాన్ని స్టాలిన్ గట్టెక్కలేకపోయారు.

రాజకీయ చైతన్యం :

తాము అమితంగా ఆరాధించే నాయకులకు మినహాయింపు తప్ప తమిళనాడు ఓటర్లు మాత్రం ఒకసారి గెలిపిస్తే మరోసారి ఓడిస్తారు. ఇది అక్కడి సంప్రదాయం. దానికి రాజకీయ చైతన్యం అని పేరు పెట్టినా లేక మార్పు కోసం అయిదేళ్ళకు ఒకసారి తీర్పు ఇస్తారని భావించినా కూడా తప్పు లేదు కానీ తమిళనాడు ఓటర్లు మాత్రం ఎవరినీ క్షమించరు. ఈ విషయంలో అధికారం అందుకోబోతున్న విజయ్ టీవీకే పార్టీ కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News