ఉద్యోగాల పై 'వైబ్ కోడింగ్' ప్రభావం: భవిష్యత్తులో టెక్ రంగం ఎటు పోతుంది?
వైబ్ కోడింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కోడింగ్ పద్ధతి. ఇందులో డెవలపర్లు కోడ్‌ను చేతితో రాయాల్సిన అవసరం చాలా తక్కువ.;
టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు వేగంగా మారుతున్న ట్రెండ్ 'వైబ్ కోడింగ్' . ఈ కొత్త పద్ధతి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌ను సులభతరం చేస్తున్నప్పటికీ, టెక్ రంగంలో వేలాది ఉద్యోగాలపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా, జూనియర్ డెవలపర్లు, టెస్టింగ్ ఇంజినీర్లు, మరియు ఎంట్రీ-లెవెల్ ఉద్యోగులు దీని వల్ల అత్యంత ప్రభావితులవుతున్నారు.
వైబ్ కోడింగ్ అంటే ఏమిటి?
వైబ్ కోడింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కోడింగ్ పద్ధతి. ఇందులో డెవలపర్లు కోడ్‌ను చేతితో రాయాల్సిన అవసరం చాలా తక్కువ. బదులుగా వారు AI టూల్స్‌కు తమ అవసరాన్ని ప్రాంప్ట్ రూపంలో ఇస్తారు. ఆ ప్రాంప్ట్ ఆధారంగా AI స్వయంచాలకంగా కోడ్‌ను సృష్టిస్తుంది. ఆశించిన ఫలితం రాకపోతే, డెవలపర్లు మరిన్ని సూచనలు (ఫీడ్‌బ్యాక్) ఇవ్వడం ద్వారా AI మరింత మెరుగైన కోడ్‌ను అందిస్తుంది.
2025లో ప్రముఖ AI శాస్త్రవేత్త ఆండ్రెజ్ కార్పథీ ఈ పదాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఇది రెండు స్థాయిల్లో పనిచేస్తుంది. లో లెవెల్ వైబ్ కోడింగ్ లో ఇది చిన్న కోడ్ టాస్కుల కోసం ఉపయోగపడుతుంది. హై లెవెల్ వైబ్ కోడింగ్ లో ఇది AI సహాయంతో పూర్తి అప్లికేషన్‌ను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది.
ఉద్యోగాలపై ప్రభావం ఏంటి?
AI , ఆటోమేషన్ రాకతో మానవీయంగా చేయాల్సిన కోడింగ్, టెస్టింగ్ వంటి పనులకు డిమాండ్ తగ్గుతోంది. దీనివల్ల ముఖ్యంగా ఈ ఉద్యోగాలు మొదటగా ప్రభావితం అవుతున్నాయి. జూనియర్ డెవలపర్లు, టెస్టింగ్ ఇంజినీర్లు, మిడ్-లెవెల్ మేనేజర్లు ఉంటారు. ఇటీవల, టీసీఎస్ 12,000 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. అలాగే, స్టార్టప్ కంపెనీలైన గప్‌షప్, వెర్సే ఇన్నోవేషన్, ఓలా ఎలక్ట్రిక్ వంటి సంస్థలు ఇప్పటికే 4,000 మందిని తొలగించాయి. పరిశ్రమ నిపుణుల అంచనాల ప్రకారం, 2025 చివరినాటికి 1 నుండి 3 లక్షల ఉద్యోగాలు పోవచ్చు.
భవిష్యత్తులో పరిణామాలు ఏమిటి?
వైబ్ కోడింగ్ వల్ల ఉద్యోగాలు పోవడం ఒక సమస్య అయితే, భవిష్యత్తులో మరింత తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగుల నైపుణ్యాలు తగ్గిపోతాయి. AIపై ఆధారపడటం వల్ల డెవలపర్లు తమ ప్రాథమిక కోడింగ్ నైపుణ్యాలను కోల్పోవచ్చు. కోడ్ క్వాలిటీ తగ్గడం కూడా కారణం. AI సృష్టించిన కోడ్‌లో లోపాలు ఉండే అవకాశం ఉంది, వాటిని సరిచేయడానికి మానవ నైపుణ్యం లేకపోతే సమస్యలు తలెత్తుతాయి. కోడింగ్‌లో లోతైన అవగాహన లేకుండా కేవలం AIపై ఆధారపడి పనిచేసే "సూడో-డెవలపర్లు" పెరిగిపోతారు. నిపుణులు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. ఒకవేళ AI ఇచ్చిన కోడ్ లోపభూయిష్టంగా ఉంటే, దాన్ని సరిదిద్దే నైపుణ్యం లేకపోతే అది భవిష్యత్తులో పెద్ద సవాళ్లకు దారితీయవచ్చు.
-AI వాడకం అంటేనే మంచి ఫలితాలా?
అప్పుడప్పుడూ కాదు. క్లార్నా అనే ఒక సంస్థ వందల మంది ఉద్యోగులను తొలగించి, AIతో పనులు చేయించింది. కానీ, కోడ్ నాణ్యత, అవుట్‌పుట్‌లో లోపాల కారణంగా చివరికి మళ్లీ ఉద్యోగులను నియమించుకోవాల్సి వచ్చింది.మెటర్ అనే సంస్థ చేసిన ఒక పరిశోధనలో, AI వాడిన డెవలపర్ల ఉత్పాదకత 19% తగ్గినట్లు తేలింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే వారు తమ ఉత్పాదకత పెరిగిందని అనుకున్నారు, కానీ గణాంకాలు దానికి భిన్నంగా ఉన్నాయి.
సుస్థిరమైన భవిష్యత్తు కోసం మార్గాలు
AI పూర్తిగా మనుషుల పనిని భర్తీ చేయగలదనే భ్రమ నుంచి బయటపడాలి. డెవలపర్లలో మూలభూత కోడింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. AIని కేవలం సహాయక టూల్‌గా మాత్రమే ఉపయోగించాలి, దానిపై పూర్తిగా ఆధారపడకూడదు. మానవీయ ఆలోచన, సృజనాత్మకతకు విలువ ఇవ్వాలి.
వైబ్ కోడింగ్ అనేది మారుతున్న సాంకేతిక ప్రపంచానికి ప్రతిబింబం. కానీ, అది మనుషుల పనిని పూర్తిగా భర్తీ చేయగలదనే తత్వం ప్రమాదకరం. టెక్ కంపెనీలు తక్షణ లాభాల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో వారికే భారం కావచ్చు. AIతో పాటు మానవ నైపుణ్యాలు కూడా ఉండాల్సిందే. అప్పుడే అభివృద్ధికి నిజమైన 'వైబ్' వస్తుంది.