స్తంభించిన జనజీవనం.. యుద్ధ నీడలో వెనిజులా.. కరెంటు, ఆహారం కోసం హాహాకారాలు

వెనిజుల రాజధాని నగరంలో నివసిస్తున్న భారతీయ పౌరుడు సునీల్ మల్హోత్రా అక్కడి భయానక పరిస్థితులను వివరించారు.;

Update: 2026-01-04 19:11 GMT

వెనిజులాలో ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ముందస్తు హెచ్చరికలు లేకుండా జరిపిన మెరుపు దాడులతో ఆ దేశం అంధకారంలోకి వెళ్లిపోయింది. ఏకంగా వెనిజులా అధ్యక్షుడినే అరెస్ట్ చేసి తీసుకెళ్లడంతో వెనిజులాలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి తలెత్తింది. వైమానిక దాడుల ధాటికి కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసం కావడంతో రాజధాని కారకాస్ సహా దేశవ్యాప్తంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

అంధకారంలో దేశం.. క్యూలైన్లలో ప్రజలు

ఈ దాడుల్లో ప్రధానంగా విద్యుత్ గ్రిడ్‌లు లక్ష్యంగా మారడంతో దేశవ్యాప్తంగా పవర్ కట్ ఏర్పడింది. కరెంటు లేకపోవడంతో సూపర్ మార్కెట్లు, పెద్ద వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. నిత్యావసరాల కోసం ప్రజలు చిన్న చిన్న దుకాణాల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఒక్కో దుకాణం ముందు 500 నుండి 600 మంది వరకు క్యూ కడుతున్నారు. ఫార్మసీల ముందు కూడా పరిస్థితి దయనీయంగా ఉంది. అత్యవసర మందుల కోసం ప్రజలు అల్లాడుతున్నారు.

కారకాస్ నుండి భారతీయుడి ఆవేదన

వెనిజుల రాజధాని నగరంలో నివసిస్తున్న భారతీయ పౌరుడు సునీల్ మల్హోత్రా అక్కడి భయానక పరిస్థితులను వివరించారు. "దాడులు చాలా తీవ్రంగా ఉన్నాయి. కారకాస్ విమానాశ్రయంతో పాటు నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతిపెద్ద వైమానిక స్థావరం ఫోర్ట్‌ట్యూనా మిలిటరీ బేస్‌లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం నగరం మొత్తం నిశ్శబ్దంగా భయం నీడలో ఉంది" అని ఆయన పేర్కొన్నారు.

ఫోన్ ఛార్జింగ్ కోసం కిలోమీటర్ల నడక

ఆధునిక కాలంలో కరెంటు లేకపోతే కనీసం సమాచారం తెలుసుకోవడానికి ఫోన్ కూడా పని చేయని పరిస్థితి. వెనిజులాలో ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది.రోడ్లపై అక్కడక్కడా వెలుగుతున్న వీధి దీపాల వద్ద ప్రజలు గుమిగూడి తమ ఫోన్లను ఛార్జ్ చేసుకుంటున్నారు. సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో తమ వారి క్షేమ సమాచారం తెలుసుకోవడం కూడా కష్టతరంగా మారింది.

రవాణా బంద్.. ఇళ్లకే పరిమితం

బాంబు దాడుల భయంతో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. బస్సులు, రైళ్లు నడవకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎప్పుడు ఎటువైపు నుండి దాడి జరుగుతుందో అన్న భయంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.

భారతీయుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు..

వెనిజులాలో ఉన్న భారతీయుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ వారి భద్రతపై భారత రాయబార కార్యాలయం ప్రత్యేక దృష్టి సారించింది. భారతీయులందరినీ సమన్వయం చేస్తూ ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని రాయబార కార్యాలయం సూచిస్తోంది.

విద్యుత్, ఆహారం, తాగునీరు వంటి కనీస అవసరాలు తీరక వెనిజులా ప్రజలు తీవ్ర మానవీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. యుద్ధ వాతావరణం ఎప్పుడు సద్దుమణుగుతుందో సాధారణ స్థితి ఎప్పుడు వస్తుందో తెలియక ఆ దేశం దిక్కుతోచని స్థితిలో ఉంది.

Tags:    

Similar News