కర్నూలు బస్సు ప్రమాదం.. కొంపముంచిన కొత్త సెల్ ఫోన్లు!

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు.. కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఘోర అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.;

Update: 2025-10-25 04:15 GMT

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు.. కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఢీకొని ఘోర అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 19మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. ద్విచక్రవాహనదారుడు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భంగా ఫొరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా సంచలన విషయాలు వెల్లడించాయి.

అవును... కర్నూలు శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో అగ్నిప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు లగేజీ క్యాబిన్‌ లో తరలిస్తున్న వందల మొబైల్‌ ఫోన్లు పేలడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి, భారీ ప్రాణ నష్టానికి దారితీసిందని ఫోరెన్సిక్‌ బృందాలు ప్రాథమికంగా గుర్తించాయి. ప్రయాణికులను అప్రమత్తం చేయకుండా డ్రైవర్లు చోద్యం చూడటం వల్ల నిండు జీవితాలు నిలువునా బూడిదైపోయాయి.

ఈ సందర్భంగా స్పందించిన ఫోరెన్సిక్ బృందాలు... తొలుత బస్సు, టూవీలర్ ని ఢీకొట్టగానే దాని ఆయిల్‌ ట్యాంక్‌ మూత ఊడిపడి, అందులోని పెట్రోల్‌ కారడం మొదలైందని.. అదే సమయంలో బస్సు కింది భాగంలో టూవీలర్ ఇరుక్కుపోవడంతో, దాన్ని బస్సు కొంత దూరం ఈడ్చుకెళ్లిందని.. ఈ క్రమంలోనే నిప్పురవ్వలు చెలరేగి, దానికి పెట్రోల్‌ తోడవడంతో మంటలు మొదలయ్యాయని తెలిపారు.

ఈ మంటలు తొలుత లగేజీ క్యాబిన్ కు అంటుకున్నాయని.. దీంతో, అందులోని సుమారు 400లకు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్శిల్ ఉండటంతో.. ఈ వేడికి ఆ ఫోన్లలోని బ్యాటరీలన్నీ ఒక్కసారిగా పేలాయని.. ఆ మంటలు లగేజీ క్యాబిన్‌ పై భాగంలోని ప్రయాణికుల కంపార్ట్మెంట్‌ కు వ్యాపించాయని.. దీంతో లగేజీ క్యాబిన్‌ కు సరిగ్గా పైన ఉండే సీట్లలో, బెర్తుల్లో ఉన్న ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

ప్రయాణికుల బస్సులో సరుకు రవాణా..!:

వాస్తవానికి ప్రయాణికుల వాహనాల్లో వారి వ్యక్తిగత లగేజీ తప్ప ఇతర సరకులేవీ రవాణా చేయకూడదు. అయితే... ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల యాజమాన్యాలు మాత్రం ప్రయాణికుల వాహనాలను సరకు రవాణా కోసం వాడేస్తున్నాయి. వాటిని లగేజీ క్యాబిన్‌ లలో పెడుతున్నాయి. ఈ క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే, వాటికి మంటలు అంటుకోవడంవల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోంది. కర్నూలు ఘటనలో కూడా ప్రమాద తీవ్రత పెరగడానికి అదే కారణమైంది.

కిటికీలు పగలగొట్టకుండా చోద్యం..!:

ప్రమాదం సమయంలో తలుపులు మూసుకుపోయినప్పుడు బస్సులోని ప్రయాణికులను రక్షించేందుకు డ్రైవర్లు కిటికీల అద్దాలు బద్దలుకొట్టి ఉంటే అందరూ సురక్షితంగా బయటపడేవారని.. కానీ, వారు అలాంటి ప్రయత్నాలేమీ చేయకుండా చోద్యం చూశారని.. అద్దాలు పగలగొట్టేందుకు చిన్నపాటి సుత్తులు అందుబాటులో లేకపోవడంతో, కొందరు చేతులతోనే అద్దాలను గట్టిగా బాదారని.. ఈ క్రమంలో ప్రమాదం నుంచి బయటపడిన కొందరి చేతులకు గాయాలయ్యాయని చెబుతున్నారు.

Tags:    

Similar News