మరీ ఇంత ముదురు కేసేంటి వరలక్ష్మి?
డోన్ సీఐ వరలక్ష్మి తాజాగా సీజ్ చేసిన మద్యాన్ని బెల్ట్ షాపులకు అమ్ముతున్న వైనంలో దొరికిపోయారు.;
కాపాడాల్సిన వారే కాటేయటం చూస్తుంటాం. కంచె చేను మేసిన చందంగా ఒక ఎక్సైజ్ అధికారిణి ఒకరు వ్యవహరించిన వైనం షాకింగ్ గా మారింది. ఎక్సైజ్ అధికారుల దాడుల్లో పట్టుబడిన మద్యాన్ని తప్పుడు దారిలో అమ్మిస్తున్న వైనం ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది. పోలీసులు సైతం నివ్వెరపోయేలా చేసిన ఎక్సైజ్ సీఐ వ్యవహారం చూస్తే.. ఇలాంటి దందాలు కూడా చేయటమా? అన్న విస్మయానికి గురయ్యేలా చేసింది. డోన్ సీఐ వరలక్ష్మి తాజాగా సీజ్ చేసిన మద్యాన్ని బెల్ట్ షాపులకు అమ్ముతున్న వైనంలో దొరికిపోయారు.
తాజాగా చాకిరేవుమిట్ట వద్ద వాహనాల తనిఖీ లో పీఆర్ పల్లికి చెందిన సోమనాథ్ అనే వ్యక్తి కారులో 379 మద్యం సీసాలు దొరికాయి. ఒక వ్యక్తి వద్ద అంత భారీగా మద్యం లభించటంతో.. అంత సరకు ఎక్కడ కొన్నావని ప్రశ్నించగా.. తనకు ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి ఇచ్చినట్లుగా చెప్పటంతో అధికారులు షాక్ తిన్నారు. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకున్న అధికారులు విచారించే క్రమంలో.. ఆ మద్యం బాటిళ్లు మొత్తం ఎక్సైజ్ దాడుల్లో స్వాధీనం చేసుకున్న సరకుగా గుర్తించారు.
విధి నిర్వహణలో భాగంగా సీజ్ చేసిన మద్యం బాటిళ్లను దొంగచాటుగా బెల్టు దుకాణాలకు పంపి.. అమ్మిస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో డోన్ ఎక్సైజ్ సీఐ వరలక్ష్మి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఆ సరకు తాను ఇవ్వలేదని.. స్టేషన్ లో ఎవరైనా ఇచ్చి ఉంటారని ఆమె చెబుతున్నా.. పోలీసులు సేకరించిన ప్రాథమిక ఆధారాలు ఆమె పాత్ర ఉందన్నట్లుగా ఉండటంతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని డోన్ డీఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు. కేసు విచారణ జరుగుతోందని.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అక్రమ అమ్మకాలకు పాల్పడిన వరలక్ష్మిని సరెండర్ చేస్తున్నట్లుగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ వెల్లడించారు. ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.