జనసేనలోకి వంగవీటి కుమార్తె..?! త్వరలో పవన్ తో భేటీ

ఏపీ రాజకీయాల్లో వంగవీటి పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ కుటుంబం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అయితే దివంగత నేత వంగవీటి మోహనరంగా తర్వాత ఆ కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారు.

Update: 2026-07-06 16:36 GMT

ఏపీ రాజకీయాల్లో వంగవీటి పేరుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ కుటుంబం రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలని అభిమానులు కోరుకుంటారు. అయితే దివంగత నేత వంగవీటి మోహనరంగా తర్వాత ఆ కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయారు. వంగవీటి భార్య రత్నకుమారి ఒకసారి, ఆయన కుమారుడు రాధాకృష్ణ మరోసారి ఎమ్మెల్యేలుగా గెలిచినా, రాజకీయంగా పట్టుసాధించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం నుంచి వంగవీటి కుమార్తె ఆశాకిరణ్ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం హీట్ పుట్టిస్తోంది. అంతేకాకుండా ఆమె త్వరలో ఒక ప్రధాన పార్టీలో చేరనున్నారని కూడా చెబుతున్నారు. దీంతో వంగవీటి ఆశాకిరణ్ అడుగులు హాట్ టాపిక్ అవుతున్నాయి.

గత కొంతకాలంగా తండ్రి పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న వంగవీటి ఆశాకిరణ్ రాజకీయంగా క్రియాశీలం అవ్వాలని ఆలోచిస్తున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. దాదాపు ఏడాది కాలం నుంచి రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల పేరుతో పర్యటిస్తూ, తన సామాజిక వర్గ నేతలు, వంగవీటి రంగా అభిమానులను కలుస్తూ సంప్రదింపులు జరుపుతున్న ఆశాలత ఇప్పుడు ఒక పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. తన సోదరుడు రాధాకృష్ణ టీడీపీలో ఉండటంతో తాను ఎలాంటి నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుందనే దిశగా ఆమె చర్చలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే రాధా టీడీపీలో కొనసాగుతున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో పదవులు దక్కలేదనే అసంతృప్తితో ఉన్న ఆశాకిరణ్ కూటమిలోని జనసేనలో చేరే విషయమై సుదీర్ఘంగా చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ఆమె త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలవనుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. రాష్ట్రంలో ఒక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టడంతోపాటు కృష్ణా నది ఒడ్డున రంగా ఘాట్ నిర్మించాలని ఆశాకిరణ్ కోరుతున్నారు. ఈ రెండు ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలని త్వరలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలవనున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆశాలత జనసేనలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం ఎక్కువైందని అంటున్నారు. ఇప్పటికే జనసేన పార్టీకి కాపు సామాజికవర్గం ఫాలోయింగు ఎక్కువగా ఉందన్న అంచనాల నేపథ్యంలో అదే సామాజికవర్గానికి చెందిన తనకు ఆ పార్టీ మెరుగైన అవకాశాలు ఉంటాయనే ఆలోచనతోనే ఆశాలత అటువైపు అడుగులు వేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక 2029 ఎన్నికల లోపు డీలిమిటేషన్ ప్రక్రియను పూర్తయ్యే అవకాశాలు, మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానుండటం కూడా ఆశాలత రాజకీయ ప్రవేశానికి ఉత్పేరకంగా పనిచేస్తున్నట్లు భావిస్తున్నారు. నియోజకవర్గాలు పెరిగితే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయని, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పోటీ ఉండదని ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో మహిళా రిజర్వేషన్ వల్ల కూడా తనకు మెరుగైన అవకాశాలు ఉంటాయని ఆమె అంచనా వేస్తున్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News