'ప్రేమకోసమై..' చిక్కుల్లో పడుతున్న ప్రియులు!
నాలుగు రోజుల కిందట నాసిక్‌లో జరిగిన అతి పెద్ద దొంగతనం వెలుగు చూసింది. ఓ బంగారం దుకాణం లో ఉద్యోగాల కోసం చేరిన ప్రేయసీ ప్రియులు.. అక్కడే చోరీ చేసి.. దొరికి పోయారు.
ప్రేమ కోసమై.. వలలో పడెనే పాపం పసివాడు.. అనే పాట వినని వారు ఉండరు. ఇప్పుడు దేశంలో జరుగు తున్న పరిణామాలను గమనిస్తే.. ప్రేమ కోసం. ప్రియురాళ్ల కోసం.. కొందరు యువకులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దొంగతనాలు.. జైలు దూకి పారిపోవడం.. అధికారులతో వివాదాలు తెచ్చు కోవడం వంటివి ప్యూర్ గా ప్రియురాళ్ల కోసమేనని వారు చెబుతున్నారు. దీంతో ప్రేమ కోసమే వారు చేస్తున్నా.. చట్టాలు మాత్రం ప్రియులను కటకటాల వెనక్కి నెడుతున్నాయి.
నాలుగు రోజుల కిందట నాసిక్‌లో జరిగిన అతి పెద్ద దొంగతనం వెలుగు చూసింది. ఓ బంగారం దుకాణం లో ఉద్యోగాల కోసం చేరిన ప్రేయసీ ప్రియులు.. అక్కడే చోరీ చేసి.. దొరికి పోయారు. అదేమంటే.. తన ప్రియురాలు ముచ్చటపడిందని.. ఒంటి నిండా బంగారంతో మెరిసిపోవాలని భావించిందని.. అందుకే.. తాను విధిలేక దొంగతనం చేశానని ప్రియుడు చెప్పుకొచ్చాడు. బంగారాన్ని రికవరీ చేసినా.. అతనిపై పోలీసులు కానీ.. చట్టం కానీ.. ఎక్కడా జాలి పడలేదు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.
తాజాగా తెలంగాణలోనూ ప్రియురాలి కోసం ఓ ప్రియుడు జైలు గోడలు దాటి పారిపోవడం సంచలనంగా మారింది. మహబూబ్‌నగర్ జిల్లా అమరచింతకు చెందిన కిశోర్ కుమార్.. ఓ యువతిని ప్రేమించాడు. అయితే.. మరోవైపు.. అతనిని ప్రేమించిన మరో అమ్మాయి.. తనను మోసం చేశాడంటూ.. కిశోర్‌పై పోక్సో కేసు పెట్టింది. దీంతో కిశోర్ ను అరెస్టు చేసిన పోలీసులు.. రిమాండ్ నిమిత్తం మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించారు. ఇక్కడే గతవారం నుంచి అతను ఉంటున్నాడు.
అయితే.. తాను ప్రేమించిన ప్రియురాలిని కలుసుకోవాలని అనుకున్న కిశోర్.. సోమవారం తెల్లవారు జామున.. బ్యారక్ నుంచి బాత్రూంకు వెళ్లివస్తానని చెప్పి.. అటు నుంచి నాలుగు తుండుగుడ్డలతో పేనిన తాడును వినియోగించి.. జైలు గోడలు దూకి.. బయటకు వచ్చేశాడు. తోటి ఖైదీలకు.. తాను తన ప్రియురాలిని కలుసుకునేందుకు వెళ్లిపోతున్నానని చెప్పినట్టు పోలీసులకు వారు తెలిపారు. దీంతో పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.
విశాఖలో తాను ప్రేమించిన ప్రియురాలికి పెళ్లి నిశ్చయం అయిందని తెలుసుకున్న ఓ ప్రియుడు నాలుగు రోజుల కిందట ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. ఈ క్రమంలో పోలీసులు.. ఎంట్రీ ఇచ్చి.. అతనిని అరెస్టు చేయగా వారిపై తిరుగుబాటు చేసి.. కానిస్టేబుల్‌ను గాయపరిచిన సంఘటన సంచలనంగా మారింది. ఈ ఘర్షణకు ప్రేమే కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే..ఇప్పుడు అతనిపై రెండు నుంచి నాలుగు కేసులు పెట్టారు. కానిస్టేబుల్ పై చేయి చేసుకున్న నేరం నమోదైంది. ఇలా.. ప్రేమ కోసం ప్రియులు చిక్కుల్లో పడుతుండడం గమనార్హం.