భారత ఐటీ రంగానికి చుక్కెదురు: 28 నెలల కనిష్ఠానికి ఉద్యోగ అవకాశాలు.. హెచ్-1బీ టెకీల రాకతో పెరగనున్న పోటీ

భారత ఐటీ రంగం ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన పరిణామాలను ఎదుర్కొంటోంది. దేశీయంగా టెక్ ఉద్యోగ అవకాశాలు గత 28 నెలల్లో ఎన్నడూ లేనంతగా పడిపోవడం పరిశ్రమ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

Update: 2026-07-06 16:37 GMT

భారత ఐటీ రంగం ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన పరిణామాలను ఎదుర్కొంటోంది. దేశీయంగా టెక్ ఉద్యోగ అవకాశాలు గత 28 నెలల్లో ఎన్నడూ లేనంతగా పడిపోవడం పరిశ్రమ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు కొత్త నియామకాలు మందగించడం.. మరోవైపు అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులు స్వదేశానికి క్యూ కట్టడం వంటి అంశాలు భారత ఐటీ మార్కెట్‌పై అదనపు భారాన్ని మోపుతున్నాయి.

ఒక్క నెలలోనే 14% క్షీణత

ప్రముఖ స్టాఫింగ్ సంస్థ ఎక్స్ ఫెనో విడుదల చేసిన "యాక్టివ్ టెక్ జాబ్స్ అవుట్ లెక్ – జూన్ 2026" నివేదిక ప్రకారం.. ప్రస్తుతం భారతదేశంలో యాక్టివ్ టెక్ ఉద్యోగాల సంఖ్య కేవలం 93,000 కు పడిపోయింది. గత మే నెలలో ఈ సంఖ్య 1.08 లక్షలుగా ఉండగా, కేవలం నెల రోజుల వ్యవధిలోనే 14 శాతం తగ్గుదల నమోదైంది. గత ఏడాది కాలంలో నమోదైన అత్యధిక నెలవారీ క్షీణత ఇదే కావడం గమనార్హం.

ఐటీని కుదిపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

ఈ సంక్షోభానికి ప్రధాన కారణం ఏఐ వేగంగా విస్తరించడమేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఏఐ టూల్స్ వాడకం పెరగడంతో కంపెనీలు కొత్త నియామకాలను భారీగా తగ్గించుకున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ సంస్థలు సైతం తమ వ్యాపార నమూనాలను ఏఐకి అనుగుణంగా మార్చుకుంటూ అవసరమైన చోట ఉద్యోగుల కోతకు పాల్పడుతున్నాయి. "సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో ఏై వినియోగం ఇప్పుడు ఒక సాధారణ విషయంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా టెక్ నియామకాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు జరిగే భారతదేశంపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది" అని కేర్‌నెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నీలాభ్ శుక్లా తెలిపారు.

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీలు) మాత్రమే ఆశాకిరణం

ఐటీ సర్వీసులు, టెక్ స్టార్టప్‌లు, ప్రొడక్ట్ కంపెనీలలో ఉద్యోగాలు దారుణంగా తగ్గినప్పటికీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ మాత్రం కొంతవరకు ఊరటనిస్తున్నాయి. జీసీసీలలో ఉద్యోగ అవకాశాలు గత ఏడాదితో పోలిస్తే 31 శాతం పెరిగి 17,000కు చేరాయి. అయితే మునుపటి నెలతో పోలిస్తే ఈ విభాగంలో కూడా 6 శాతం స్వల్ప తగ్గుదల కనిపించడం ఐటీ రంగానికి హెచ్చరిక లాంటిదే.

తోడైన హెచ్-1బీ వీసా కష్టాలు.. స్వదేశానికి టెకీల తిరుగుపయనం

పరిస్థితిని మరింత జటిలం చేస్తూ అమెరికా నుంచి భారతీయ టెకీలు పెద్ద సంఖ్యలో వెనక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ, గ్రీన్ కార్డ్ నిబంధనలను కఠినతరం చేయడం దీనికి ముఖ్య కారణం. హెచ్-1బీ వీసాదారులు ఉద్యోగం కోల్పోతే 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి.. లేదంటే భారత్‌కు తిరిగి రావాల్సి ఉంటుంది.

గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే అమెరికాకు వెళ్లేవారికంటే భారత్‌కు తిరిగి వచ్చే టెకీల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత మూడు సంవత్సరాల గణాంకాలను పరిశీలిస్తే 2023లో అమెరికాకు వెళ్లిన భారతీయ టెకీల సంఖ్య తిరిగి వచ్చిన వారి కంటే 12,300 ఎక్కువగా ఉండగా 2025 నాటికి ఈ తేడా 6,100కు తగ్గింది. ఇదే ధోరణి కొనసాగితే ఈ ఏడాది స్వదేశానికి తిరిగి వచ్చే టెకీల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎక్స్ ఫెనో సహ వ్యవస్థాపకుడు కమల్ కరణ్త్ దీనిపై స్పందిస్తూ "ప్రస్తుత దేశీయ మార్కెట్ పరిస్థితులు అమెరికా నుంచి వచ్చే హెచ్-1బీ ఉద్యోగులకు ఏమాత్రం అనుకూలంగా లేవు. తీవ్రమైన పోటీ ఉన్న ఈ తరుణంలో వారికి ఇక్కడ తక్షణమే ఉద్యోగాలు లభించడం సవాలుతో కూడుకున్నదే" అని అభిప్రాయపడ్డారు.

మొత్తంమీద.. ఏఐ టూల్స్ ఎఫెక్ట్, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, హెచ్-1బీ ఉద్యోగుల తిరుగుపయనం వంటి మూడు ప్రధాన కారణాలు భారత ఐటీ రంగాన్ని ఒక అగ్నిపరీక్షలోకి నెట్టేస్తున్నాయి. రాబోయే రోజుల్లో టెక్ నిపుణులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటేనే ఈ తీవ్రమైన పోటీ మార్కెట్‌లో నిలదొక్కుకోగలరని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News