'సర్..' సగం కన్నా తక్కువే..!
కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియ అత్యంత మందకొడిగా సాగుతోంది.
కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ లో చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ అత్యంత మందకొడిగా సాగుతోంది. మరో వారం రోజుల్లో(జూలై 14) ఈ ప్రక్రియ ముగిసిపోనుంది. కానీ, ఇప్పటి వరకు సగం మందికి తక్కువగానే 2002కు సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘానికి అప్పగించడం గమనార్హం. ఈ ప్రక్రియ ఆధారంగానే కొత్త జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయనుంది.
ప్రస్తుతం రంపచోడవరం, పాడేరు, విశాఖ, విజయవాడ.. ఇలా అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో 36 శాతం మంది మాత్రమే ప్రజలు తమ వివరాలను ఇవ్వగలిగారు. వీటిలో ఎన్ని అమలుకు నోచుకుంటా యన్నది ఎన్నికల సంఘం పరిశీలన తర్వాతే తేలుతుంది. మరీ ముఖ్యంగా టీడీపీ, వైసీపీలకు బలం ఉన్న చోట కూడా.. ఇదే తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని కి కారణం.. 2002నాటి ఓటర్ల జాబితాలో పేర్లు కనిపించకపోవడమే. కానీ, ప్రస్తుతం ఇస్తున్న ఫారాల్లో ఆ వివరాలే నింపాలని ఎన్నిక లసంఘం కోరింది.
ఈ వివరాలు లేని వారు.. ఏం చేయాలన్న దానిపై అవగాహన కల్పించే నాయకులు కానీ, అధికారులు కానీ లేకపోవడంతో ప్రజలు కూడా లైట్ తీసుకుంటున్నారు. ఫలితంగా.. ఈ ప్రక్రియ ప్రారంభమైన 15 రోజుల తర్వాత కూడా.. 40 శాతం లోపు మాత్రమే అధికారులకు వివరాలు చేరాయంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇదే కొనసాగితే.. మరో వారంలో ముగియనున్న ఈ క్రతువులో రాష్ట్రంలోని సగం మందికంటే ఎక్కువగానే ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు.
ఎవరికి నష్టం?
ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియ ఇలానే కొనసాగితే.. అంతిమంగా అది అధికార, ప్రతిపక్ష పార్టీలకే నష్టం చేకూర్చనుందన్న విషయం స్పష్టమవుతోంది. వైసీపీ అధినేత పైకి చెప్పినా.. క్షేత్రస్థాయిలో నాయకులు మాత్రం ఈ కార్యక్రమాన్ని లైట్ తీసుకున్నారు. ఇక, టీడీపీ లో కొంత మెరుగుదల కనిపిస్తోంది. కానీ, ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఎలా చూసుకున్నా.. మరో వారంలోగానే దూకుడు పెంచాలి. లేకపోతే.. 50-60 శాతం ఓట్లు మాత్రమే మిగలనున్నాయన్న విషయం చర్చనీయాంశంగా మారింది.