ఎంపీల‌కు చింత‌.. ఏపీలో పొలిటిక‌ల్ ఫీవ‌ర్‌!

ఇప్పుడు తాము ఇంత యాక్టివ్‌గా తిరిగినా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు జ‌రిగితే.. తమ క‌ష్టం వృథా అవు తుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు.

Update: 2026-07-06 11:30 GMT

ఏపీలో పొలిటిక‌ల్ ఫీవ‌ర్ క‌నిపిస్తోంది. వాస్త‌వానికి ఎన్నిక‌ల‌కు మూడు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉన్నా.. ఇప్ప‌టి నుంచే ఎంపీలు త‌మ త‌మ భవిష్య‌త్తుపై బెంగ పెట్టుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. వారిపై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు ఒక వైపు ప్ర‌శ్న‌లుగా మారుతుండ‌గా.. మ‌రోవైపు నియోజ‌క‌వ‌ర్గాల‌ పున‌ర్విభ‌జ‌న అంశంపై ఎంపీలు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ప్ర‌స్తుతం తాము ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు అలానే ఉండే ప‌రిస్థితి లేదు. వ‌చ్చే వ‌ర్షాకాల పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఈ బిల్లును ఆమోదించేందుకు మోడీ స‌ర్కారు రెడీ అయింది.

దీంతో తాము ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల బౌండ‌రీలు మారుతాయ‌ని భావిస్తున్న ఎంపీలు.. నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌రుగుతున్న అభివృద్ధిప‌నుల‌ను కూడా లైట్ తీసుకుంటున్నారు. ఎవ‌రికి వారు... మొక్కుబ‌డిగానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ విష‌యం సీఎం చంద్ర‌బాబు వ‌ర‌కు వెళ్లింది. దీనిపై కుప్పం ప‌ర్య‌ట‌న‌లోనే చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌లు చేశారు. పార్టీ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌క‌పోవ‌డం.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోక‌పోవ‌డంపై ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ప‌రిస్థితులు ఎలా ఉన్నా.. ముందు ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని సూచించారు.

అయితే.. మెజారిటీ ఎంపీల నుంచి స‌రైన స‌మాధానం రాలేద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. విజ‌య‌వాడ స‌హా కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపీల‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లు ఒక‌వైపు చ‌ర్చ‌కు దారితీస్తుండ‌గా.. మ‌రో వైపు.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశంపై నాయ‌కులు బెంగ పెట్టుకున్నార‌ని.. ఇప్పుడు తాము ఇంత యాక్టివ్‌గా తిరిగినా.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పులు జ‌రిగితే.. తమ క‌ష్టం వృథా అవు తుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్నారు. దీంతో నాయ‌కుల‌కు-ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య గ్యాప్ కూడా పెరిగింది.

త‌ర్వాత చూద్దాం..

ఈ వ్య‌వ‌హారంపై సీఎం చంద్ర‌బాబు స్పందిస్తూ.. ముందు ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని ఎంపీల‌కు సూచించారు. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో ఎవ‌రికీ ఎలాంటి న‌ష్టం ఉండ‌ద‌ని చెప్పారు. పార్టీ ప‌రంగా కార్య‌క్ర మాల‌కు హాజ‌రై.. ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచ‌డం ద్వారా.. పార్టీ బ‌లోపేతం అవుతుంద‌ని.. త‌ద్వారా నియోజ కవ‌ర్గాల పెంపు జ‌రిగినా.. నాయ‌కుల‌కు ఇబ్బంది లేకుండా ఉంటుంద‌ని ఆయ‌న దిశానిర్దేశం చేశారు. త్వ‌ర‌లోనే ఎంపీల ప‌నితీరుపై నివేదిక ఇవ్వ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు చెప్పిన‌ట్టు సీనియ‌ర్ నేత‌లు చెబుతున్నార‌.

Tags:    

Similar News