అందుకే 'కొడకల్లారా' అనాల్సి వచ్చింది: పవన్
వైసీపీ నాయకులను ఉద్దేశించి 2022-23 మధ్య తాను చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు.
వైసీపీ నాయకులను ఉద్దేశించి 2022-23 మధ్య తాను చేసిన వ్యాఖ్యలపై ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తం గా పర్యటించిన పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలను ఉద్దేశించి కొడకల్లారా అని వ్యాఖ్యానించినట్టుగా వైసీపీ నాయకులు, మాజీ మంత్రులు ఇటీవల చెబుతున్నారు. వీటికి సంబంధించిన వీడియోలను కూడా వారు సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనికి తోడు.. `నాడు మీరు చేస్తే తప్పులేదా? మీ నోటికి హద్దులేదా?'' అంటూ అంబటి రాంబాబు వంటి వారు ప్రశ్నిస్తున్నారు.
ఇక, సోషల్ మీడియాలో కూడా గతంలో పవన్ చేసిన అనేక వ్యాఖ్యలతోపాటు.. ఆయన చేసిన ప్రకటనల తాలూకు వీడియోలు కూడా జోరుగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కల్యాణ్ ఈ వ్యవహారంపై స్పందించారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పలువురు జనసేన నాయకులతో ఆయన మాట్లాడుతూ. ఈ విషయాన్ని ప్రస్తావించారు. ''అప్పట్లో నేను ఒకే ఒక్కసారి కొడకల్లారా అన్నాను. దానికి వాళ్లు ఇప్పుడు చాలా బాధపడిపోతున్నారు. అలా అనడానికి కూడా కారణం ఉంది. 18 మందిని అరెస్టు చేసి స్టేషన్‌లో పెట్టి హింసిస్తే.. బాధపెడితే ఇంకేమంటాం. సమయం.. సందర్భం అలా ఉంది కాబట్టే నేను అలా వ్యాఖ్యానించాను'' అని చెప్పారు.
అంతే కాదు.. ఆ సమయంలో కూడా.. నవ్వుతూ.. హ్యాపీగా మాట్లాడాలా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. పదుల సంఖ్యలో కార్యకర్తలను అరెస్టు చేయడం.. కేసుల్లో ఇరికించడం .. వారిని హింసించడం వంటివి ఎవరికైనా బాధ కలిగిస్తుందని తెలిపారు. అప్పట్లో తాను అన్న మాటల్లో తప్పులేదని వ్యాఖ్యానించారు. ఇది లావుంటే.. రెండు రోజుల కిందట పవన్ కల్యాణ్ సోషల్ మీడియా నూతన చట్టం గురించి.. దానిలోని విధివిధానాల గురించి వివరించారు. సామాజిక మాధ్యమం వేదిక గా.. భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డు పెట్టుకుని నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదని, కఠినంగా శిక్షిస్తామని ఆయన చెప్పారు.
ఈ క్రమంలో నే నాయకులపై బూతులు మాట్లాడడం.. కుటుంబాలకు చెందిన మహిళలను రోడ్డుకు లాగడం వంటివాటిని అస్సలు ఉపేక్షించేది లేదని కూడా పవన్ చెప్పారు. అనంతరం.. వైసీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా సైతం గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండడం గమనార్హం. ఈక్రమంలోనే పవన్ కల్యాణ్ ఈవివరణ ఇవ్వడం గమనార్హం.