పెళ్లి కూతురు డాన్స్‌తో ఆగిపోయిన వివాహం..!
ఈ మధ్య కాలంలో పెళ్లిలు ఎలాంటి కారణాలతో రద్దు అవుతున్నాయో చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలగక మానదు.
ఈ మధ్య కాలంలో పెళ్లిలు ఎలాంటి కారణాలతో రద్దు అవుతున్నాయో చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ చిన్న విషయంతోనూ భార్యాభర్తలు విడిపోతారా అని నోరు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక పెళ్లి తంతు ప్రారంభం అయిన తర్వాత కూడా కొన్ని పెళ్లిలు ఆగి పోవడం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. పెళ్లి ఆపడం మాత్రమే కాకుండా, పెళ్లిని ఆపేందుకు ఏకంగా కాబోయే వరుడిని అమ్మాయి హత్య చేయడం కూడా మనం ఈ మధ్య కాలంలో చూశాం. పెళ్లి అంటేనే యువత భయపడే పరిస్థితి ఏర్పడింది. హిందూ సమాజం పెళ్లిని అత్యంత పవిత్రంగా భావిస్తారు. అలాంటి పెళ్లిని అవహేళన చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. పెళ్లి తర్వాత ప్రియుడితో లేదా ప్రియురాలితో కలిసి కట్టుకున్న వారికి కడతేర్చుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో...
తాజాగా హత్యలు, గొడవలు జరగలేదు. కానీ చిన్న కారణం వల్ల పెళ్లి ఆగి పోవడం చర్చనీయాంశం అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాకు చెందిన అమ్మాయితో అదే జిల్లాకు చెందిన అబ్బాయితో వివాహం ఖరారు అయ్యింది. ఇరువైపుల పెద్దలు అన్ని మాట్లాడుకుని, ఇచ్చి పుచ్చకోవడం జరిపిన తర్వాత పెళ్లి ఏర్పాట్లు జరిగాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఆదివారం తెల్లవారుజామున వివాహం జరగాల్సి ఉంది. కాని శనివారం జరిగిన వ్యవహారం కారణంగా ఆదివారం వివాహం జరగలేదు. శనివారం రాత్రి వధువరులు కళ్యాణ మండపంకు జతగా తరలి వెళ్తున్న సమయంలో డీజే స్టెప్స్‌తో బంధుమిత్రులు హడావిడి చేశారు. ఆ సమయంలోనే వధు వరులతోనూ డాన్స్ చేయించాలని కొందరు భావించారు. అందుకు వరుడు ఒప్పుకోలేదు.
పెళ్లి బరాత్‌లో డాన్స్ చేసేందుకు...
డాన్స్ చేసేందుకు అస్సలు ఒప్పుకోని పెళ్లి కొడుకును వదిలేసి పెళ్లి కూతురుతో డాన్స్ చేయించేందుకు మిత్రులు కొందరు ప్రయత్నించారు. ఆ సమయంలోనే డాన్స్ చేస్తే ఊరుకునేది లేదంటూ గట్టిగా వధువును వరుడు తిట్టాడని స్థానికులు చెబుతున్నారు. దాంతో అతడి ప్రవర్తనకు అంతా విస్తు పోయారని, అమ్మాయి సైతం చిన్నబుచ్చుకుని కంట తడి పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. డాన్స్ వేయాలని ఆశ పడ్డ అమ్మాయిని అతడు అడ్డుకోవడం, అంతే కాకుండా అమ్మాయిని గట్టిగా మందలించడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది. అమ్మాయి తండ్రి మాత్రం అతడి ప్రవర్తనకు ఆగ్రహంతో ఊగి పోయాడు. పెళ్లికి ముందే ఇలా కట్టడి చేస్తే పెళ్లి తర్వాత తన కూతురును ఇంకెంత ఇబ్బందులకు గురి చేస్తాడో కదా అనుకున్నాడేమో, నువ్వు వద్దు, నీతో నా కూతురుకు పెళ్లి వద్దు అనుకుని వధువును తీసుకుని అక్కడ నుంచి వెళ్లి పోయాడట.
పెళ్లి క్యాన్సల్ కావడంతో...
పెళ్లి కోసం వరుడు పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడని, అంతే కాకుండా పెళ్లి కోసం వందలాది మందిని పిలిచాడట. పెట్టిన ఖర్చు ఇతర లెక్కలు అన్నింటిని తేల్చుకుని మొత్తం పెళ్లిని కాన్సల్ చేసుకున్నారట. కట్నాలు, కానుకలు ఇలా అన్నింటిని సైతం లెక్కలు తేల్చుకుని, ఎవరికి వారే అన్నట్లుగా ఎవరి ఇంటికి వారు వెళ్లి పోయారు. పెళ్లి అనే పెద్ద తంతును కేవలం చిన్న కారణం వల్ల ఇలా రద్దు చేసుకోవడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కొందరు మాత్రం అతడిని ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవడం మంచిది అయిందని, పెళ్లి చేసుకుని ఉంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉండేదేమో అంటున్నారు. మరికొందరు మాత్రం ఈ చిన్న విషయానికి పెళ్లి క్యాన్సల్ వరకు తీసుకుని వెళ్లకుండా ఉండాల్సింది. అతడిని తర్వాత తర్వాత మార్చుకునే అవకాశం ఉంటుంది కదా అని కొందరు అంటున్నారు. మరి ఈ పెళ్లి ఆగిపోవడంపై మీ అభిప్రాయం ఏంటి?