బెజవాడ లో 'కాల్‌మనీ'.. మాజీ ఎంపీ ఫైట్!
ఏపీలో మరోసారి కాల్ మనీ వ్యవహారం రచ్చకు దారి తీసింది. చంద్రబాబు హయాంలో 2017-19 మధ్య ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే.
ఏపీ లో మరో సారి కాల్ మనీ వ్యవహారం రచ్చకు దారి తీసింది. చంద్రబాబు హయాంలో 2017-19 మధ్య ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో ప్రభుత్వాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు కూడా చోటు చేసుకున్నాయి. దీం తో విచారణకు ఆదేశించారు. కానీ, ఆ తర్వాత.. ఈ కేసు ఎటు పోయిందో అంతు చిక్కలేదు.
ఇక, ఇప్పుడు విజయవాడ మాజీ ఎంపీ, టీడీపీ మాజీ నేత కేశినేని శ్రీనివాస్... ఉరఫ్ నానీ.. కాల్‌మనీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు కు సుదీర్ఘ లేఖ రాశారు. దీని వెనుక ప్రస్తుత ఎంపీ, తన సోదరుడు చిన్ని ఉన్నారని.. విజయవాడ సహా పార్లమెంటు పరిధిలోని పలు ప్రాంతాల్లో కాల్‌మనీ వ్యవహారం జోరుగా సాగుతోందని.. వేలకు వేల రూపాయల వడ్డీలు వసూలు చేస్తున్నారని.. దీంతో బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటామని చెబుతున్నారని ఆయన తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారంలో ఎంపీ కేశినేని శివనాథ్ అనుచరుడు కిశోర్ సహా.. మరి కొందరు ఉన్నారని మాజీ ఎంపీ నాని ఆరోపించారు. దీనికి సంబంధించిన వివరాలను కూడా ఆయన సీఎం కు రాసిన లేఖలో వివరించారు. ఈ సందర్భంగా గతంలో ఏం జరిగిందో కూడా ఆయన వివరించారు. ప్రజలను పీడిస్తున్న కాల్ మనీకి వ్యతిరేకంగా గతంలో చట్టం తీసుకువచ్చారని.. ఇప్పుడు అది ఏమైపోయిందని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని చూస్తూ ఉంటే.. ప్రజలు తిరబడడం ఖాయమని ఆయన తెలిపారు.
కాల్‌మనీ వ్యవహారంలో పోలీసులు కూడా అతిగా ప్రవర్తిస్తున్నారని నానీ ఆరోపించారు. కిశోర్‌కు పోలీసులు సహకరిస్తున్నారని, ఎంపీ ఆదేశాలతో వారు కాల్‌మనీ తీసుకున్న వారి ఇళ్లలో అర్ధరాత్రి పూట సోదాలు చేస్తున్నారని, బాధితులను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఒకటి రెండు చోట్ల ఇళ్లలోని వస్తువులను కూడా తీసుకువెళ్లారని.. పోలీసు ఉన్న తాధికారులు ఈ విషయంలో చోద్యం చూస్తున్నారని.. తక్షణమే దీనిపై జోక్యం చేసుకోవాలని మాజీ ఎంపీ నాని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేయడం గమనార్హం.