జూలై 20 - ఆగస్టు 13.. ఈ 19 రోజులు దేశ చరిత్రను మార్చబోతున్నాయా?

అయితే కేంద్రం ఇప్పటికే ఈ దిశగా వేసిన పావులు కదిపిందని తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ)కి చెందిన లోక్ సభ సభ్యుల తిరుగుబాటును ఉదహరిస్తున్నారు.

Update: 2026-07-06 08:30 GMT

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు సమావేశాలను కొనసాగించేందుకు ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు. సుమారు 19 రోజుల పాటు నిర్వహించే వర్షాకాల సమావేశాల్లో అత్యంత కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని చెబుతున్నారు. ఇందులో గత సమావేశాల్లో వీగిపోయిన మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులతోపాటు ఈ సారి అదనంగా జమిలి ఎన్నికలు, 30 రోజులు జైలు శిక్ష అనుభవించిన ప్రధాని, ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రుల తొలగింపు వంటి కీలక రాజ్యాంగ సవరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాలు దేశ చరిత్రను తిరగరాసే అరుదైనవిగా అభివర్ణిస్తున్నారు. ఈ బిల్లులకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభిస్తే, దేశ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయే అవకాశం కనిపిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఎన్డీఏ 4.0 సర్కారు లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రధాని మోదీ దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని భావిస్తున్నారు. దీంతో గత పార్లమెంటు సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ తోపాటు పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీ సీట్లను ఒకేసారి 50 శాతం పెంచాలని నిర్ణయించారు. అయితే అప్పట్లో లోక్ సభలో అధికార పార్టీకి 2/3 వంతు మెజార్టీ లేకపోవడంతో రెండు బిల్లులు వీగిపోయాయి. అయితే ఆ తర్వాత దేశ రాజకీయాల్లో అనూహ్య మార్పులు రావడంతో వర్షాకాల సమావేశాల్లో ఈ బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని చెబుతున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో 2/3 వంతు మెజార్టీకి అధికార కూటమి అత్యంత దగ్గరగా ఉందని అంటున్నారు. లోక్ సభలో సైతం ఈ మెజార్టీ సాధనపై ప్రభుత్వ పెద్దలు ధీమా వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.

అయితే గత సమావేశాల్లో వీగిపోయిన బిల్లులతోపాటు కొత్తగా జమిలి ఎన్నికలతోపాటు రాజకీయాల్లో నైతిక విలువలు పెంచేలా 30 రోజులు జైలులో ఉన్న నేతలు పదవులు ఆటోమెటిక్ గా రద్దయ్యే బిల్లులను ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టాలనే నిర్ణయమే అత్యంత సాహోసోపేతమైన నిర్ణయంగా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సంఖ్యాబలం లేక ఇప్పటికే ఒకసారి వీగిపోయిన బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టి ఆమోదించేలా చేయడమంటే కత్తిమీద సాముగానే అభివర్ణిస్తున్నారు. గతంలో లేని 2/3 వంతు మెజార్టీ కేవలం మూడు నెలల వ్యవధిలో ఎలా సాధించగలరనేదే అంతుచిక్కడం లేదని అంటున్నారు. అయితే కేంద్రం ఇప్పటికే ఈ దిశగా వేసిన పావులు కదిపిందని తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ)కి చెందిన లోక్ సభ సభ్యుల తిరుగుబాటును ఉదహరిస్తున్నారు. ఈ రెండు పార్టీల ద్వారా కేంద్ర ప్రభుత్వం 2/3 వంతు మెజార్టీకి అవసరమైన 60లో 26 మంది మద్దతు కూడగట్టుకుందని చెబుతున్నారు. ఇంకా 34 మంది ఎంపీల మద్దతు కూడగడితే కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లులకు ఆమోదం లభించే అవకాశం ఉందని అంటున్నారు.

స్పీకర్ నిర్ణయమే కీలకం

తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ) ఎంపీల తిరుగుబాటును లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా గుర్తిస్తే కేంద్రం లక్ష్యం నెరవేరినట్లేనని అంటున్నారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభానికి ఇంకా రెండు వారాల సమయం ఉన్నందున ఈ లోగా ఆ రెండు పార్టీలకు చెందిన 26 మంది ఎంపీల తిరుగుబాటుకు స్పీకర్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని అంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనం అవుతున్నట్లు ప్రకటించగా, శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు శివసేన (షిండే)లో విలీనం అవుతున్నట్లు ఇప్పటికే స్పీకర్ కు లేఖ రాశారు. ఈ లేఖలను స్పీకర్ ఆమోదిస్తే మొత్తం 26 మంది ఎంపీలు ఎన్డీఏ కూటమి కిందకు వస్తారని అంటున్నారు. దీంతో స్పీకర్ తీసుకునే నిర్ణయం రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

ప్రతిపక్షాల ‘ఇండీ’ వ్యూహరచన:

మరోవైపు విపక్షంలోని చురుగ్గా ఉంటున్న పార్టీలను ప్రభుత్వం టార్గెట్ చేస్తూ, తిరుగుబాట్లను ప్రోత్సహించడంతో విపక్ష పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. తమ మధ్య ఐక్యతను దెబ్బ తీస్తున్న ప్రభుత్వానికి సభలోనే బుద్ది చెప్పాలనే లక్ష్యంతో విపక్షాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయని అంటున్నారు. తిరుగుబాటు ఎంపీలకు విప్ జారీ చేయడం ద్వారా ప్రభుత్వానికి చెక్ చెప్పాలని భావిస్తున్నాయి. అదే సమయంలో ప్రభుత్వం తెచ్చే బిల్లులను అడ్డుకునే మార్గాలను అన్వేషిస్తున్నాయని అంటున్నారు. అదేసమయంలో ‘నీట్’ పరీక్షా పత్రం లీకేజీ, అయోధ్య రామాలయ విరాళాల్లో అక్రమాలు, ద్రవ్యోల్బణం, పెట్రోల్-డీజిల్ ధరల పెంపు వంటి అంశాలను సభలో ప్రస్తావించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తున్నాయి. మొత్తం మీద, ఈ వర్షాకాల సమావేశాలు దేశ భవిష్యత్తును నిర్ణయించే కీలక నిర్ణయాలకు వేదిక కానున్నాయని అంటున్నారు. ఒకవైపు సంస్కరణల వేగం, మరోవైపు ప్రతిపక్షాల నిరసనల హోరు.. ఈ రెండింటి మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఎలా సాగుతాయో చూడాల్సివుందని అంటున్నారు.

Tags:    

Similar News