కేంద్రం నిర్ణయంతో విదేశాల్లో ఇండియన్స్‌కి వీసాలు కష్టం..!
సొంత ప్రభుత్వమే పాస్‌పోర్ట్‌ను పౌరసత్వంకు ఆధారం కాదు అని చెబుతున్నప్పుడు మేము ఎలా నమ్ముతామని విదేశీ ఎంబసీలు ప్రశ్నించే అవకాశం ఉంది.
భారత ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన పాస్‌పోర్ట్ విధానం విమర్శలకు తెర తీసింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల భారతీయ పాస్‌పోర్ట్‌ను కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని తేల్చి చెప్పింది. అంటే పాస్‌పోర్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇండియన్స్ అవ్వరు అనేది ఆ ప్రకటన ఉద్దేశం. పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వంకు సంబంధించిన డాక్యుమెంట్ కానేకాదని కేంద్రం చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించే భారతీయులు కేంద్రం చేసిన ప్రకటనతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రముఖులు పలువురు ఈ విషయమై తీవ్రంగా స్పందిస్తున్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని, చేసిన ప్రకటనను తలతిక్క నిర్ణయం అంటూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో దుయ్యబడుతున్నారు. భారతీయుల పాస్‌పోర్ట్ వివాదంపై మాజీ సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ స్పందించారు.
జస్టిస్ మదన్ బి లోకూర్ కామెంట్స్..
ఇటీవల ఒక సందర్భంగా జస్టిస్ మదన్ బి లోకూర్ మాట్లాడుతూ.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల విదేశాల్లో భారతీయులకు వీసాలు నిరాకరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారతీయుల యొక్క గుర్తింపును విదేశీయులు పాస్‌పోర్ట్ ఆధారంగా నిర్ధారించడం జరుగుతుంది. ఇప్పుడు ఆ పాస్ పోర్ట్‌ను స్వయంగా కేంద్ర ప్రభుత్వం కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని, భారత పౌరసత్వంకు సంబంధించినది కాదు అంటూ చెప్పడంతో విదేశాలు ఎలా వీసాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయని ప్రశ్నిస్తున్నారు. భారత పౌరులు అనే నమ్మకం కలిగితేనే వారు తమ దేశంలోకి వచ్చేందుకు వీసాలు ఇస్తారు. అలాంటిది వీరు భారత పౌరులేనా అనే అనుమానం ఉన్నప్పుడు ఎలా తమ దేశానికి మన దేశం నుంచి జనాలను రానిస్తారు అంటూ కొందరు ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు.
భారత పౌరసత్వం పై భిన్నాభిప్రాయాలు...
సొంత ప్రభుత్వమే పాస్‌పోర్ట్‌ను పౌరసత్వంకు ఆధారం కాదు అని చెబుతున్నప్పుడు మేము ఎలా నమ్ముతామని విదేశీ ఎంబసీలు ప్రశ్నించే అవకాశం ఉంది. ట్రావెల్ డాక్యుమెంట్‌గా మాత్రమే భారత పౌరులు పాస్‌పోర్ట్ ను ఉపయోగించాల్సి వస్తే మరి వారు భారత పౌరసత్వంను చూపించేందుకు ఏ డాక్యుమెంట్‌ను వినియోగించాలి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. పాస్‌పోర్ట్ చట్టం 1967 ప్రకారం భారత పౌరులకు మాత్రమే పాస్‌పోర్ట్‌ను ఇస్తారు. పౌరులు కాని వారికి ఇతర ప్రత్యేక సందర్భాల్లో ట్రావెల్ డాక్యుమెంట్స్‌ను ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్ట్‌ను ట్రావెల్ డాక్యుమెంట్ అని చెప్పడంతో గతంలో ఉన్న చట్టం ఏమై పోయినట్లు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. పాస్ పోర్ట్‌ను ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చాలా మంది బస్ టికెట్‌తో పోల్చుతున్నారు. బసు ప్రయాణం చేసేప్పుడు ఎలా టికెట్‌ను వినియోగిస్తారో పాస్ పోర్ట్‌ను విమాన సమయంలో వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది.
ట్రావెల్ డాక్యుమెంట్ కాకుండా..
పాస్ పోర్ట్ స్థాయిని బస్ టికెట్ స్థాయికి తగ్గించారు అంటూ జస్టిస్ మదన్ బి లోకూర్ విమర్శించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్య పౌరులు గందరగోళానికి గురి అవుతున్నారు. తమ పౌరసత్వంను చూపించేందుకు భారత పౌరులు ఏ పత్రం చూపించాలంటూ లోకూర్ ప్రశ్నిస్తున్నారు. పాస్ పోర్ట్ అంటే అన్ని రకాలుగా డాక్యుమెంట్స్‌ను పరిశీలించి, లోతైన ఎంక్వౌరీ చేసిన తర్వాత మాత్రమే పాస్ పోర్ట్‌ను మంజూరు చేయడం జరుగుతుంది. కనుక పాస్ పోర్ట్‌ను ట్రావెల్ డాక్యుమెంట్‌గా మాత్రమే కాకుండా కచ్చితంగా పౌరసత్వంకు సంబంధించిన డాక్యుమెంట్‌గా కూడా పరిగణించాల్సిందే అని లోకూర్ డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున వస్తున్న విమర్శలపై కేంద్ర విదేశాంగ శాఖ ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.