జైలులో రక్తపాతం.. ఖైదీల ఘర్షణలో 25 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు

మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గత ఐదేళ్లలో శ్రీలంక జైళ్ల చరిత్రలో నమోదైన అత్యంత ఘోరమైన జైలు ఘర్షణగా ఈ ఘటనను అధికారులు పేర్కొన్నారు.

Update: 2026-07-06 16:35 GMT

శ్రీలంకలోని ప్రముఖ జైలులో ఖైదీల మధ్య చెలరేగిన ఘర్షణ భారీ విషాదానికి దారితీసింది. రెండు డ్రగ్స్ ముఠాలకు చెందిన ఖైదీల మధ్య ప్రారంభమైన వివాదం క్రమంగా తీవ్ర హింసాత్మకంగా మారడంతో నలుగురు జైలు గార్డులతో పాటు మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గత ఐదేళ్లలో శ్రీలంక జైళ్ల చరిత్రలో నమోదైన అత్యంత ఘోరమైన జైలు ఘర్షణగా ఈ ఘటనను అధికారులు పేర్కొన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొలంబోకు ఉత్తరాన ఉన్న నెగొంబో ప్రాంతంలోని ప్రధాన జైలులో ఆదివారం సాయంత్రం రెండు డ్రగ్స్ గ్యాంగ్‌లకు చెందిన ఖైదీల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్ది సేపటికే అది భారీ ఘర్షణగా మారి రాత్రంతా కొనసాగింది. వేలాది మంది ఖైదీలు ఉన్న ఈ జైలులో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పడంతో జైలు ప్రాంగణం రణరంగాన్ని తలపించింది.

ఖైదీల మధ్య జరుగుతున్న హింసను అడ్డుకునేందుకు ప్రయత్నించిన నలుగురు జైలు గార్డులు కూడా దాడిలో మరణించారు. పరిస్థితి మరింత విషమించడంతో సోమవారం ఉదయం అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. గాయపడిన ఖైదీలు, జైలు సిబ్బందిని వెంటనే నెగొంబో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రి డైరెక్టర్ పుష్ప గంలత్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు 25 మృతదేహాలు ఆస్పత్రికి చేరాయని, 100 మందికి పైగా గాయపడిన వారికి అత్యవసర వైద్యం అందిస్తున్నామని తెలిపారు. బాధితుల్లో కొందరికి తుపాకీ గాయాలు ఉండగా, మరికొందరికి పదునైన ఆయుధాలతో దాడి చేయడం వల్ల తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు. జైలు పరిసర ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలు వినిపించాయని స్థానికులు కూడా తెలిపారు.

ఇదిలా ఉండగా జైలులో జరిగిన ఘర్షణ వార్త వ్యాపించడంతో మహిళా ఖైదీల విభాగంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా ఖైదీలు జైలు భవనం పైకప్పుపైకి ఎక్కి నిరసన చేపట్టారు. ఈ సమయంలో పైకప్పులోని ఓ భాగం కూలిపోవడంతో కొందరు మహిళా ఖైదీలు కూడా గాయపడినట్లు సమాచారం.

పరిస్థితిని సమీక్షించేందుకు సోమవారం ఉదయం పోలీసులు ప్రత్యేక కమాండో బలగాలను అక్కడికి తరలించినప్పటికీ, వారిని వెంటనే జైలు లోపలికి పంపలేదు. మరోవైపు ఖైదీల భద్రతపై ఆందోళన చెందిన వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో జైలు బయటకు చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసిన అధికారులు వైమానిక దళం సహాయంతో డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఈ ఘటనపై శ్రీలంక ప్రభుత్వం సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. జైలులో ఇంత పెద్ద ఎత్తున హింస ఎలా చెలరేగింది? భద్రతా వైఫల్యాలు ఏమైనా ఉన్నాయా? డ్రగ్స్ ముఠాల ప్రభావం ఎంత మేరకు ఉందనే అంశాలపై అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నారు.

Tags:    

Similar News