‘ఆంధ్రా అయినా తెలంగాణ అయినా’.. లోకేశ్ కీలక వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల బంధంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తెలంగాణ రాజకీయాలపై ఏపీ నేతల జోక్యంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Update: 2026-07-06 17:30 GMT

తెలుగు రాష్ట్రాల బంధంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తెలంగాణ రాజకీయాలపై ఏపీ నేతల జోక్యంపై వస్తున్న విమర్శల నేపథ్యంలో మంత్రి లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ అక్కడి తెలుగువారితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగు ప్రజల మధ్య సంబంధాలపై లోకేశ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆంధ్రా అయినా తెలంగాణ అయినా తెలుగు వారు ఎక్కడ ఉన్నా కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నట్లు లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రపంచంలో తెలుగు వారు లేని దేశం లేదని అన్నారు.

ఏపీకి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ తెలుగు వారితో మమేకం అయ్యారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లిన మన తెలుగువారు కనిపిస్తుంటారని తన అనుభవాన్ని వెల్లడించారు. ప్రతి ఏడాదిలో ఒకసారి తాను భార్య బ్రాహ్మణితో కలిసి విహారయాత్రకు వెళుతుంటానని, గత డిసెంబరులో ప్రపంచానికి చివరిన ఉన్న నార్వే వెళ్లాలని అనుకున్నామని లోకేశ్ చెప్పారు. అక్కడ నుంచి సుదూర ప్రాంతానికి వెళితే అక్కడి విమానాశ్రయంలో మన తెలుగు వాళ్లు కనిపించారని లోకేశ్ వివరించారు. దీని ద్వారా ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా మన తెలుగు వారు ఉంటారని తనకు అర్థమైందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలోనే తమ ప్రభుత్వ లక్ష్యాన్ని లోకేశ్ వివరించారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్లు కలిసి ఉండాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందని లోకేశ్ చెప్పారు. విదేశాల్లో పర్యటించే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు తెలుగు నేతలను కలవడం సహజమే అయినప్పటికీ ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడిన మాటలే విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం పవన్ పార్టీ ప్రవేశంపై తీవ్ర విమర్శలు ప్రతివిమర్శలు చెలరేగాయి.

జనసేన వర్సెస్ తెలంగాణ నేతల మధ్య జరిగిన వాగ్యుద్ధానికి టీడీపీ దూరం పాటించింది. ఇప్పుడు ఆ వాతావరణం కాస్త చల్లబడినట్లు కనిపిస్తున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ ను వెనకేసుకు వచ్చేలా లోకేశ్ మాట్లాడినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ అయినా, ఆంధ్రా అయినా మనమంతా తెలుగు వారుగా కలిసివుండాలని లోకేశ్ పిలుపునివ్వడం గమనిస్తే తన విదేశీ పర్యటనలో కూడా లోకల్ పాలిటిక్స్ పై పరోక్షంగా స్పందించినట్లే ఉందని అంటున్నారు.

Tags:    

Similar News