వందే భారత్ ట్రైన్ లో షాకింగ్ సీన్.. అస్సలు ఊహించలేరు

వారణాసి - ఢిల్లీ మధ్య నడిచే వందే భారత్ ట్రైన్ లో తనకు ఎదురైన తీవ్ర అసౌకర్యంపై ఆవేదన వ్యక్తం చేశాడు ధర్శిల్ మిశ్రా అనే ప్రయాణికుడు.;

Update: 2025-06-25 05:56 GMT

ప్రధాని నరేంద్ర మోడీ కలల పంటగా వందేభారత్ ట్రైన్ ను చెప్పొచ్చు. టికెట్ ధర కాస్త ఎక్కువే అయినా.. సౌకర్యాలు.. సేవలు.. వీటికి మించి వేగం.. గమ్యస్థానాలకు త్వరగా చేరుకునేలా ప్లాన్ చేసిన ఈ రైళ్ల నిర్వహణలో బయటకు వస్తున్న లోపాలు ఇప్పుడు చర్చగా మారుతున్నాయి. తాజాగా ఈ విమర్శలకు బలం చేకూరే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రీమియం ఛార్జీల్ని వసూలు చేసేటప్పుడు.. సేవల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కదా? అంటూ నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సాధారణంగా రైలు ప్రయాణం చేసేటప్పుడు బయట వర్షం పడుతుండగా.. వేగంగా దూసుకెళ్లే రైలు లో నుంచి చూస్తూ ఉంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అందుకు భిన్నంగా పైప్ లైన్ లీకేజీ కారణంగా.. కూర్చున్న సీటు పై నుంచి నీళ్లు వర్షపు ధార మాదిరి పడితే..? ఊహించుకోవటానికి సైతం కష్టంగా ఉండే ఇలాంటి సన్నివేశం తాజాగా వందేభారత్ ట్రైన్ లో చోటు చేసుకుంది.

వారణాసి - ఢిల్లీ మధ్య నడిచే వందే భారత్ ట్రైన్ లో తనకు ఎదురైన తీవ్ర అసౌకర్యంపై ఆవేదన వ్యక్తం చేశాడు ధర్శిల్ మిశ్రా అనే ప్రయాణికుడు. తాను ప్రయాణించిన వందే భారత్ లో ఏసీ పని చేయటం లేదని.. వాటర్ లీకేజీ అవుతుందని పేర్కొన్నారు. ప్రీమియం ఛార్జీలు వసూలు చేస్తున్నప్పటికి అసౌకర్యమైన ప్రయాణం.. పలుమార్లు కంప్లైంట్లు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాదు.. పై కప్పు నుంచి వాటర్ లీకేజీ అవుతూ.. వర్షాన్ని తలపించేలా ఉన్న ఈ సన్నివేశాన్ని వీడియోగా చేసి కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, రైల్వే మంత్రిత్వ శాఖ.. రైల్వే సేవకు ట్యాగ్ చేశాడు. తన ప్రయాణం మొత్తం నిలబడి చేయాల్సి వచ్చిందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన దర్శిల్.. తన నుంచి వసూలు చేసిన టికెట్ డబ్బుల్ని తిరిగి చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.

రైల్వే సేవ సిబ్బంది స్పందించారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ లోని కోచ్ సి-7 (సీటు నంబరు 76) లో రిటర్న్ ఎయిర్ డక్ట్ నుంచి వాటర్ లీకేజీ ఇష్యూను గుర్తించామని.. రూఫ్ మౌంటెడ్ ప్యాకేజ్ యూనిట్ లోని కూలింగ్ కాయిల్ కింద డ్రిప్ ట్రే లోని డ్రైన్ రంధ్రాలు మిక్స్ మీడియా/రిటర్న్ ఎయిర్ ఫిల్టర్ తో అడ్డుపడటంతో నీరు చేరినట్లుగా పేర్కొన్నారు. బ్రేకింగ్ సమయంలో ఈ నీళ్లు రిటర్న్ ఎయిర్ డక్ట్ లోకి చొచ్చుకొని.. ప్రయాణికులు కూర్చునే ప్రాంతంలో లీక్ అయినట్లుా పేర్కొన్నారు.

తిరుగు ప్రయాణానికి ముందు న్యూఢిల్లీ స్టేషన్ లో డిప్ ట్రేను క్లీన్ చేయటంతో పాటు.. ఫిల్టర్.. డిప్ ట్రే మధ్య వాషర్ ను జోడించటం ద్వారా.. డ్రైన్ హోల్ తెరుచుకున్నట్లు చెప్పారు. దీంతో.. సమస్య పరిష్కారమైనట్లుగా పేర్కొన్నారే కానీ.. దీని కారణంగా సమస్యల బారిన పడిన దర్శిల్ మిశ్రా జరిగిన ఇబ్బందిని కూడా ప్రస్తావించి.. అతడు కోరుకున్నట్లుగా టికెట్ డబ్బుల్ని రీఫండ్ చేసి ఉండాల్సిందన్న మాట పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. ప్రీమియం ట్రైన్ గా చెప్పుకునే వందే భారత్ లో ఇలాంటి సీన్లు మాత్రం షాక్ కు గురి చేసేలా ఉన్నాయని చెప్పకతప్పదు.

Tags:    

Similar News