వల్లభనేని వంశీ సైలెంటా..? వైలంటా..? వాట్ నెక్ట్స్!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.;

Update: 2025-07-03 10:30 GMT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ మెయిన్ టార్గెట్ లో ఒకరైన వంశీ బుధవారం బెయిలుపై జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కువ రోజులు జైలులో ఉన్న ఏకైక నాయకుడు వల్లభనేని వంశీ. గత ఫిబ్రవరిలో కిడ్నాప్ కేసులో వంశీని అరెస్టుచేసి ఆ తర్వాత 11 కేసుల్లో ఆయనపై పీటీ వారంట్లు దాఖలు చేశారు. అలా దాదాపు 139 రోజులు వంశీ జైలు జీవితం గడిపారు. ఎట్టకేలకు ఆయన చేసిన న్యాయపోరాటం ఫలించి బుధవారం బెయిలుపై విడుదలయ్యారు.

అయితే జైలు నుంచి విడుదలైన వంశీ సైలెంటుగా ఇంటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయనను కలిసేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు వంశీ నివాసానికి వెళ్లగా వారితో కొద్దిసేపు మాట్లాడి మళ్లీ ఇంటి లోపలకు వెళ్లిపోయారు. నాలుగు నెలలు జైలులో ఉండటం, ఆరోగ్యం క్షీణించడంతో వంశీ బాగా నీరసించిపోయినట్లు కనిపిస్తున్నారు. అయితే ఆయన ఇలా మౌనంగా ఎన్నాళ్లు ఉంటారనే ప్రశ్న తలెత్తుతోంది. ఫైర్ బ్రాండ్ నాయకుడిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వంశీ.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటానని తన సన్నిహిత వర్గాలతో చెప్పినట్లు గతంలో ప్రచారం జరిగింది.

గత ప్రభుత్వంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంపై దారుణ వ్యాఖ్యలతో వంశీ అప్రతిష్ఠ మూటగట్టుకున్నారు. ఆయనను జైలుకు పంపడానికి ప్రధాన కారణం నాటి వ్యాఖ్యలే అయినా, వంశీపై వేర్వేరు కేసులు నమోదు చేశారు. 2023 ఫిబ్రవరిలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి, ఆ తర్వాత ఆ కేసును రాజీ చేసుకునే క్రమంలో ఫిర్యాదుదారు సత్యవర్థన్ ను కిడ్నాప్ చేశారంటూ ప్రభుత్వం అభియోగాలు మోపింది. ఈ కేసులోనే అరెస్టుచేసి ఆ తర్వాత వరుస కేసులతో బెంబేలెత్తించింది. అయితే ఈ పరిణామాలను ముందుగానే ఊహించిన వంశీ గత ఏడాది ఎన్నికలు అయిన అనంతరం రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పేవారని అంటున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితుల నుంచి ఆయన తప్పించుకునే అవకాశం లేకపోవడంతో తప్పనిసరిగా రాజకీయాల్లో కొనసాగాల్సిన పరిస్థితి ఉందంటున్నారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన యథావిధిగా మళ్లీ తన దూకుడును కొనసాగిస్తారా? లేక సైలెంటుగా పావులు కదుపుతూ రాజకీయంగా బలం పెంచుకునేలా ప్రయత్నిస్తారా? అన్నది అందరిలో ఆసక్తి పెంచుతోంది. అరెస్టు తర్వాత వైసీపీ అనుకూల వర్గాల్లో వంశీపై సానుభూతి వ్యక్తమవుతోంది. అయితే ఆయన అరెస్టు, ఆ తర్వాత విడుదలైన సమయంలో ప్రజల నుంచి ఎటువంటి అనుకూల, వ్యతిరేక భావనలు వ్యక్తం కాలేదన్న విషయాన్ని పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. దీంతో సమయం చూసుకుని ఆయన క్షేత్ర స్థాయి రాజకీయాలను మొదలు పెట్టాలని సన్నిహితులు సూచిస్తున్నట్లు సమాచారం.

దాదాపు 15 ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న వంశీకి గన్నవరంలో భారీగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆయన సొంత సామాజికవర్గంలో చాలా మంది అనుకూలంగా వ్యవహరించేవారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో విభేదాల వల్ల వీరిలో చాలా మంది దూరమైనట్లు చెబుతున్నారు. అయితే వంశీ అరెస్టు తర్వాత ఇటువంటి వారు కూడా ఇప్పుడు సానుభూతి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా గన్నవరంలో ఎమ్మెల్యేతో పొసగక గతంలో వంశీతో కలిసి పనిచేసిన వారు కూడా ఇప్పుడు వైఖరి మార్చుకుంటున్నారని అంటున్నారు. అయితే వంశీ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే ఢీకొట్టడంతో ఆయన సామాజికవర్గం బహిరంగంగా మద్దతు ఇస్తుందా? లేదా? అన్న సంశయం కొనసాగుతోందని అంటున్నారు.

ఈ పరిస్థితుల్లో తాను తెరవెనుక ఉండి భార్య పంకజశ్రీని రాజకీయంగా యాక్టివ్ చేయాలని వంశీ ఆలోచిస్తున్నట్లు చెబుతున్నారు. దీనివల్ల తన సామాజికవర్గం కూడా కలిసివచ్చే అవకాశం ఉందని, గతంలో తాను చేసిన వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి కూడా మళ్లుతుందని ఆయన వ్యూహంగా చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో ఓటమి తర్వాత తనను వదిలేస్తే అమెరికా వెళ్లి వ్యాపారం చేసుకొందామని వంశీ భావించారని, ఈ విషయాన్ని అప్పట్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లారని అంటున్నారు. అయితే వంశీని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ప్రభుత్వం నుంచి సంకేతాలు రావడంతో ఆయన అమెరికా వెళ్లేందుకు ఈబీ-5 (EB-5) వీసా పొందాలని భావించిన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అమెరికాలో పెట్టుబడులు పెట్టేవారికి ఈబీ-5 వీసా మంజూరు చేస్తారు. ఈ వీసా వచ్చిన వారు గ్రీన్ కార్డు పొందవచ్చు. దీని కోసం వంశీ సుమారు రూ.20 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ వీసా ప్రక్రియ ఆలస్యం కావడం, వంశీ అరెస్టు కావడం జరిగిపోయింది. ఇప్పుడు ఆయన అమెరికా వెళ్లేందుకు న్యాయపరమైన చిక్కులు ఉండటంతో ఇక్కడ మనుగడ సాగించాలంటే తప్పనిసరిగా రాజకీయాల్లో కొనసాగాల్సిన పరిస్థితి నెలకుందని అంటున్నారు. దీంతో సినీ నటుడు పోసాని మాదిరిగా రాజకీయ అస్త్ర సన్యాసం చేయకుండా, తన భార్య ద్వారా రాజకీయాల్లో పునఃవైభవం సాధించేలా వంశీ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News