ఒక శతాబ్ద కాలం పాటు అట్లాంటిక్ చీకటి కోణాల్లో దాగి ఉన్న ఈ రహస్యం ఎట్టకేలకు వెలుగులోకి..
మొదటి ప్రపంచ యుద్ధ చరిత్రలో ఒక విషాదకర అధ్యాయం.. సుమారు 107 ఏళ్ల నిరీక్షణ తర్వాత ముగిసింది.;
మొదటి ప్రపంచ యుద్ధ చరిత్రలో ఒక విషాదకర అధ్యాయం.. సుమారు 107 ఏళ్ల నిరీక్షణ తర్వాత ముగిసింది. అట్లాంటిక్ మహాసముద్రపు అగాధాల్లో దశాబ్దాలుగా మరుగున పడిపోయిన అమెరికా కోస్ట్‌గార్డ్ నౌక తాంపా శిథిలాలను పరిశోధకులు ఎట్టకేలకు కనుగొన్నారు. బ్రిటన్‌లోని కార్న్‌వాల్ తీరానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో దాదాపు 300 అడుగుల లోతులో ఈ నౌక అవశేషాలు లభ్యమయ్యాయి. బ్రిటీష్ డైవింగ్ బృందం 'గ్యాస్‌పెరడోస్' చేపట్టిన ఈ సాహసోపేతమైన అన్వేషణ, సముద్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
యుద్ధ రంగంలో 'తాంపా' ప్రస్థానం
1914లో ప్రారంభమైన మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న తరుణంలో అమెరికా కోస్ట్‌గార్డ్‌కు చెందిన 'తాంపా' నౌక అత్యంత కీలకమైన బాధ్యతలను నిర్వర్తించేది. ముఖ్యంగా మిత్రదేశాల సరుకు రవాణా నౌకలకు రక్షణ కల్పించడంలో ఇది ముందుండేది. 1918 సెప్టెంబర్ 17న తన చివరి ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ నౌక శత్రువుల కళ్లుగప్పి కాన్వాయ్‌ను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే పనిలో నిమగ్నమై ఉంది.
ఆ రాత్రి అసలేం జరిగింది?
సెప్టెంబర్ 26, 1918.. తాంపా నౌక ప్రయాణం విషాదాంతానికి చేరువైన రోజు. నౌకలోని బాయిలర్లను మండించడానికి అవసరమైన బొగ్గు నిల్వలు తగ్గిపోతున్నట్లు కెప్టెన్ గుర్తించారు. ఇంధనం నింపుకోవడానికి వేల్స్‌లోని ఒక పోర్టుకు వెళ్లాలని భావించి కాన్వాయ్ నుంచి విడిపోయి ఒంటరిగా వేగంగా ప్రయాణించడం మొదలుపెట్టింది.
దురదృష్టవశాత్తు అదే సమయంలో జర్మనీకి చెందిన భయంకరమైన జలాంతర్గామి యూబీ-41 తాంపాను లక్ష్యంగా చేసుకుంది. రాత్రి 8:15 గంటల సమయంలో జర్మన్ సబ్ మెరైన్ ప్రయోగించిన ఒకే ఒక్క టార్పెడో తాంపా నౌకను నేరుగా తాకింది. ఆ తాకిడికి నౌకలోని బొగ్గు ధూళి (Coal Dust) ఒక్కసారిగా పేలిపోవడంతో నౌక అగ్నిగోళంలా మారి నిమిషాల వ్యవధిలోనే సముద్రగర్భంలోకి జారిపోయింది. ఈ ప్రమాదంలో నౌకలో ఉన్న 131 మంది 111 మంది కోస్ట్‌గార్డ్ సిబ్బంది, నలుగురు నేవీ సిబ్బంది, మిగిలిన వారు బ్రిటీష్ అధికారులు జలసమాధి అయ్యారు.
శతాబ్ద కాలపు అన్వేషణ.. గ్యాస్‌పెరడోస్ విజయం
యుద్ధం ముగిసిన తర్వాత కూడా తాంపా ఎక్కడ మునిగిపోయిందో ఖచ్చితమైన వివరాలు దొరకలేదు. దశాబ్దాలుగా అనేక బృందాలు గాలించినా ఫలితం లేకపోయింది. అయితే గ్యాస్‌పెరడోస్ డైవింగ్ టీమ్ అధినేత స్టీవ్ మోరిటైమర్ నేతృత్వంలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి చేపట్టిన అన్వేషణ ఎట్టకేలకు ఫలించింది. బ్రిటన్ కార్న్‌వాల్ తీరానికి 80 కి.మీ దూరంలో సముద్ర మట్టానికి 300 అడుగుల దిగువన నౌక శిథిలాలు ఇసుకలో కూరుకుపోయి ఉన్నప్పటికీ అవి తాంపా నౌకవేనని నిర్ధారించే ఆధారాలు లభించాయి.
చారిత్రక ప్రాధాన్యత
అమెరికా నౌకాదళ చరిత్రలో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన అతిపెద్ద నష్టంగా ఈ ఘటనను పరిగణిస్తారు. ఈ నౌక ఆనవాళ్లు దొరకడం కేవలం ఒక పురావస్తు విజయం మాత్రమే కాదు, ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు ఒక భావోద్వేగపూరితమైన విషయం. "తాంపా ఆనవాళ్లు దొరకడం ద్వారా 107 ఏళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయిన 131 మంది వీరులకు సరైన నివాళులు అర్పించే అవకాశం కలిగింది. ఇది సముద్ర గర్భంలో దాగి ఉన్న ఒక వీరగాథకు సజీవ సాక్ష్యం," అని స్టీవ్ మోరిటైమర్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.
తాంపా శిథిలాల వెలికితీత లేదా తదుపరి పరిశోధనల ద్వారా అప్పటి పేలుడు తీవ్రత, నౌక మునిగిపోయిన తీరుపై మరిన్ని వైజ్ఞానిక ఆధారాలు లభించే అవకాశముంది. అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని 'వార్ గ్రేవ్' గా ప్రకటించే యోచనలో ఉన్నాయి. ఏది ఏమైనా ఒక శతాబ్ద కాలం పాటు అట్లాంటిక్ చీకటి కోణాల్లో దాగి ఉన్న ఈ రహస్యం ఎట్టకేలకు వెలుగులోకి రావడం విశేషం.