అమెరికా వీసా 'షాక్': కుదేలవుతున్న విదేశీ విద్యా రుణాల మార్కెట్!
విదేశీ విద్యను అభ్యసించి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల కలలకు అమెరికా వీసా నిబంధనలు సవాలుగా మారుతున్నాయి.;
విదేశీ విద్యను అభ్యసించి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల కలలకు అమెరికా వీసా నిబంధనలు సవాలుగా మారుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం రాబోతుందన్న సంకేతాలు, కఠినతరమవుతున్న వీసా విధానాల వల్ల అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఈ ప్రభావం నేరుగా విదేశీ విద్యా రుణాల మార్కెట్‌పై పడింది. గత ఏడాదితో పోలిస్తే ఈ రంగం 30 నుంచి 50 శాతం వరకు క్షీణతను నమోదు చేస్తోందని గణాంకాలు చెబుతున్నాయి.
అడుగంటిన రుణాల ప్రవాహం
విదేశీ విద్య కోసం రుణాలు ఇచ్చే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్.బీఎఫ్.సీఎస్), ఎడ్యుకేషన్ లోన్ ప్లాట్‌ఫారమ్‌ల వద్ద రుణాల దరఖాస్తులు భారీగా తగ్గాయి. ముఖ్యంగా అమెరికా యూనివర్సిటీలకు వెళ్లే విద్యార్థుల నుంచి వచ్చే లోన్ డిమాండ్ ఏకంగా 60 శాతం వరకు పడిపోయింది. విద్యార్థులు ఇప్పుడు యూకే, ఫ్రాన్స్, జర్మనీ, తూర్పు యూరప్ దేశాల వైపు చూస్తున్నారు. అయితే అమెరికాలోని భారీ ఫీజులతో పోలిస్తే ఈ దేశాల్లో చదువు ఖర్చు తక్కువ కావడంతో రుణాల పరిమాణం కూడా తగ్గిపోయింది.
ఆర్‌బీఐ గణాంకాల్లో స్పష్టమైన తగ్గుదల
భారతీయ విద్యార్థులు విదేశాలకు పంపే నిధుల ప్రవాహం తగ్గిపోయిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డేటా ధ్రువీకరిస్తోంది. ఈ గణాంకాలను బట్టి చూస్తే విదేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యతో పాటు అక్కడ ఖర్చు చేసే సామర్థ్యం కూడా తగ్గుతూ వస్తోందని అర్థమవుతోంది.
వ్యూహాలు మారుస్తున్న ఫైనాన్స్ కంపెనీలు
విదేశీ విద్యా రుణాలపైనే ఎక్కువగా ఆధారపడిన సంస్థలు ఇప్పుడు నష్ట నివారణ చర్యలు చేపడుతున్నాయి. తమ పోర్ట్‌ఫోలియోలో 24 శాతం వాటా ఉన్న విద్యా రుణాలపై ఒత్తిడి పెరుగుతుండటంతో ఈ సంస్థ ప్రాపర్టీ లోన్ల వంటి ఇతర విభాగాల వైపు మళ్లుతోంది. వచ్చే రెండేళ్ల వరకు కొత్త రుణాల మంజూరు బలహీనంగానే ఉంటుందని.. మార్కెట్ స్తబ్దత కొనసాగుతుందని హెచ్చరిస్తున్నాయి.
బ్యాంకులు.. ఎన్‌బీఎఫ్‌సీల పరిస్థితి
ప్రస్తుతం ఎస్.బీఐ , ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి పెద్ద బ్యాంకులతో పాటు, అవాన్స్ , క్రెడిలా వంటి ఎన్‌బీఎఫ్‌సీలు విద్యా రుణాల రంగంలో పోటీ పడుతున్నాయి. అయితే విద్యార్థులు వీసా దొరకదనే భయంతో లోన్ తీసుకోవడానికి వెనుకాడుతున్నారు. అమెరికా ప్రభుత్వం నుంచి వీసా విధానాలపై స్పష్టత వచ్చే వరకు ఇదే అనిశ్చితి కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.