భూగర్భంలో దాగున్న మృత్యు నగరం!.. శత్రువుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఇరాన్ రహస్య స్థావరాలు!
ఇరాన్ ఈ వీడియోలను ఇప్పుడు విడుదల చేయడం వెనుక పెద్ద రాజకీయ కారణమే ఉంది.;
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ, ఇరాన్ సైన్యం తన ‘మిస్సైల్ సిటీ’కి సంబంధించిన భీకర దృశ్యాలను బయటపెట్టింది. పర్షియన్ గల్ఫ్ తీరం వెంబడి కొండల కింద, భూగర్భంలో కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రహస్య బంకర్లు ఇప్పుడు అమెరికా నౌకాదళానికి పెను సవాలుగా మారాయి. ఇరాన్ ప్రభుత్వ టీవీ విడుదల చేసిన వీడియోలో, పొడవాటి భూగర్భ సొరంగాల్లో వందలాది క్షిపణులు, సూసైడ్ డ్రోన్లు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. శత్రువుల ఉపగ్రహాలకు లేదా గగనతల దాడులకు చిక్కకుండా, భూమికి వందల అడుగుల లోతులో ఈ ఆయుధ సంపత్తిని ఇరాన్ భద్రపరిచింది.
సముద్రంపై పేలే బాంబులు!
ఈ భూగర్భ నగరంలో ఇరాన్ ప్రదర్శించిన అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ‘సూసైడ్ (కామికాజీ) డ్రోన్ బోట్లు’. వీటిని సాంకేతిక భాషలో అన్‌మ్యాన్డ్ సర్ఫేస్ వెహికల్స్ అని పిలుస్తారు. ఇవి చిన్న సైజులో ఉండి, సముద్ర ఉపరితలంపై లేదా నీటి కింద స్వల్ప లోతులో అత్యంత వేగంగా ప్రయాణించగలవు. వీటిలో భారీ స్థాయిలో పేలుడు పదార్థాలను అమర్చుతారు. ఎప్పుడైతే ఇవి శత్రువుల యుద్ధ నౌకను లేదంటే ఆయిల్ ట్యాంకర్‌ను తాకుతాయో, అప్పుడు స్వయంగా పేలిపోయి అవతలి నౌకను జలసమాధి చేస్తాయి. ఇటీవల పర్షియన్ గల్ఫ్‌లో జరిగిన రెండు ఆయిల్ ట్యాంకర్ల దాడుల్లో ఈ డ్రోన్లనే ఇరాన్ వాడినట్లు నిపుణులు ధృవీకరిస్తున్నారు.
హర్మూజ్ దిగ్బంధనానికి పక్కా స్కెచ్!
హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య నౌకలను అడ్డుకోవడానికి ఇరాన్ ఈ భూగర్భ క్షిపణి నగరాలనే ప్రధాన స్థావరాలుగా వాడుకుంటోంది. ఈ బంకర్‌లలో కేవలం డ్రోన్లే కాకుండా, అత్యంత శక్తిమంతమైన యాంటీ-షిప్ మిస్సైళ్లు, సముద్ర మందుపాతరలు కూడా ఉన్నాయి. శత్రు దేశాల యుద్ధ నౌకలు జలసంధిలోకి ప్రవేశించగానే, ఈ భూగర్భ కేంద్రాల నుంచి ఏకకాలంలో వందలాది క్షిపణులను ప్రయోగించే 'స్వామ్ అటాక్' వ్యూహాన్ని ఇరాన్ అమలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల అత్యాధునిక రక్షణ వ్యవస్థలు ఉన్న అమెరికా నౌకలు కూడా ఒకేసారి ఇన్ని దాడులను తట్టుకోవడం కష్టమవుతుంది.
మనోబలంతో సాగుతున్న మైండ్ గేమ్!
ఇరాన్ ఈ వీడియోలను ఇప్పుడు విడుదల చేయడం వెనుక పెద్ద రాజకీయ కారణమే ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడుల తర్వాత కూడా తమ ఆయుధ సంపత్తి ఏమాత్రం చెక్కుచెదరలేదని నిరూపించడానికి ఇరాన్ ప్రయత్నిస్తోంది. అయితే, ఈ వీడియో ఫుటేజీలు యుద్ధం తర్వాత తీసినవా లేదా అంతకు ముందే సిద్ధం చేసినవా అనే దానిపై స్పష్టత లేదు. అయినప్పటికీ, తమ అగ్రనేతలను కోల్పోయినా, తమ భూగర్భ బలాన్ని తాకడం అగ్రరాజ్యానికి సాధ్యం కాదనే సందేశాన్ని ఇరాన్ బలంగా పంపింది. ఇది శత్రువుల మానసిక ధైర్యాన్ని దెబ్బతీసే 'సైకలాజికల్ వార్‌ఫేర్'లో భాగమే.
'ఎపిక్ ఫ్యూరీ'కి సవాలు!
అమెరికా తన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో భాగంగా ఇరాన్ క్షిపణి స్థావరాలను ధ్వంసం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, ఇలాంటి భూగర్భ నగరాలను నాశనం చేయడం సాధ్యం కాదని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అరేబియా సముద్రంలో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలు యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్, యూఎస్‌ఎస్ ట్రిపోలి వంటి వాటికి ఈ సూసైడ్ డ్రోన్లు, భూగర్భ క్షిపణుల నుంచి నిరంతరం ముప్పు పొంచి ఉంది. ఒక చిన్న డ్రోన్ బోటు కూడా కొన్ని వేల కోట్ల విలువైన యుద్ధ నౌకను తీవ్రంగా దెబ్బతీయగల సామర్థ్యం కలిగి ఉండటమే ఇక్కడ ఆందోళన కలిగించే అంశం.
ఇరాన్ బయటపెట్టిన ఈ 'మిస్సైల్ సిటీ' పశ్చిమాసియా యుద్ధం ఎంత భీకరంగా మారబోతుందో సూచిస్తోంది. ఉపరితలంపై బాంబుల వర్షం కురుస్తున్నా, భూగర్భంలో ఇరాన్ తన విధ్వంసక శక్తిని భద్రంగా ఉంచుకుంది. ఈ రహస్య స్థావరాల నుంచి జరిగే దాడులను అడ్డుకోవడం అమెరికా నౌకాదళానికి అగ్నిపరీక్షే. చమురు రవాణాకు ఆయువుపట్టుగా ఉన్న హర్మూజ్ జలసంధిని కాపాడుకోవడానికి ఈ భూగర్భ క్షిపణులనే ఇరాన్ తన చివరి అస్త్రంగా వాడుకోనుంది. ఈ అదృశ్య యుద్ధం చివరకు ఎటు దారితీస్తుందో కానీ, దీనివల్ల ప్రపంచ ఇంధన భద్రత మాత్రం గాలిలో దీపంలా మారింది.