ఇంకొద్దిరోజులు యుద్ధం జరిగితే.. పాకిస్తాన్ అడుక్కోవడం ఖాయం
పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం పాకిస్థాన్‌కు శాపంగా మారింది.;
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను వణికిస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటడంతో దేశాన్ని గట్టెక్కించేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటోంది.
జీతాల్లో 5% నుంచి 30% వరకు కోత
ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది జీతాల్లో 5 శాతం నుండి 30 శాతం వరకు కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లు సమాచారం. ఇది కేవలం విభాగానికే పరిమితం కాకుండా వివిధ బోర్డులు.. కార్పొరేషన్లపై కూడా ప్రభావం చూపనుంది.
ముంచెత్తుతున్న ముడి చమురు ధరలు
పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం పాకిస్థాన్‌కు శాపంగా మారింది. దీనివల్ల ఇంధన ధరల పెరుగుదలతో పాకిస్తాన్ లో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. ఇంధన ధరల వల్ల సరుకు రవాణా భారమై, నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం, తాజా పరిణామాలతో ప్రజల జీవన ప్రమాణాలను మరింత దెబ్బతీస్తోంది.
ఆర్థిక నిపుణుల విశ్లేషణ
పాకిస్థాన్ గత కొంతకాలంగా విదేశీ మారక నిల్వలు తగ్గిపోవడం, అప్పుల భారం పెరగడం వంటి సమస్యలతో సతమతమవుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుండి రుణాలు పొందేందుకు కఠినమైన షరతులను అమలు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడిని తగ్గించడానికి ఉద్యోగుల జీతాల్లో కోత విధించడం తప్పనిసరి పరిస్థితిగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉద్యోగ సంఘాల ఆగ్రహం
ప్రభుత్వ నిర్ణయంపై పాక్ ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు ధరల పెరుగుదలతో బతకడమే కష్టంగా ఉన్న తరుణంలో చేతికి వచ్చే జీతంలో కోత విధించడం తమను మరింత కష్టాల్లోకి నెట్టడమేనని వారు వాపోతున్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే పునఃపరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు.
మొత్తానికి పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పాకిస్థాన్‌ను ఊబిలోకి నెట్టేస్తోంది. యుద్ధం ఇంకొన్ని రోజులు సాగితే పాకిస్తాన్ దివాళా తీయడం గ్యారెంటీ.. అడుక్కుతినే పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఈ ఆర్థిక గండం నుండి గట్టెక్కేందుకు ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలు ఆ దేశ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.