వయసు 70.. వైబ్ 25.. మల్లన్నా.. నువ్వు మామూలోడివి కాదే!
సాధారణంగా 70 ఏళ్ల వయసు వచ్చిందంటే.. "మోకాళ్ల నొప్పులు ఉన్నాయి బాబోయ్" అని మందుల షీట్ల వైపు చూస్తారు. కానీ మల్లన్న రూటే వేరు.;
తెలంగాణ రాజకీయాల్లో 'తగ్గేదేలే' అన్నట్టుగా సాగే నాయకులెవరు అంటే చిన్న పిల్లోడైనా టక్కున చెప్పే పేరు.. మల్లారెడ్డి. రాజకీయ సభల్లో మైక్ పట్టుకుంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం ఒక ఎత్తు అయితే.. తనదైన బాడీ లాంగ్వేజ్‌తో సోషల్ మీడియాలో 'మీమ్ గాడ్'గా మారడం మరో ఎత్తు. తాజాగా ఆయన తన 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వేసిన 'మాస్ స్టెప్పులు' ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
పాలమ్మిన.. పూలమ్మిన.. ఇప్పుడు డాన్సు కూడా చేసిన!
సాధారణంగా 70 ఏళ్ల వయసు వచ్చిందంటే.. "మోకాళ్ల నొప్పులు ఉన్నాయి బాబోయ్" అని మందుల షీట్ల వైపు చూస్తారు. కానీ మల్లన్న రూటే వేరు. "నేను మామూలోడ్ని కాదు.. చాలా కష్టపడ్డ.. కష్టపడి డాన్స్ నేర్చుకున్న!" అన్న రేంజ్‌లో షేర్వానీ వేసుకుని.. కళ్ళకు గాగుల్స్ పెట్టి స్టేజ్ మీదకు వస్తే.. అక్కడ ఉన్న కుర్రాళ్లకు గుండెలు పగిలిపోయాయి. ఆయన డాన్స్ చూస్తుంటే "పాలమ్మిన.. పూలమ్మిన.. సక్సెస్ అయిన.. ఇప్పుడు స్టేజ్ మీద స్టెప్పులేసిన!" అనే డైలాగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినబడుతున్నట్టుగా ఉంది. ఆ హుక్ స్టెప్పులు చూస్తుంటే స్టార్ హీరోలు కూడా ఒకసారి తమ కొరియోగ్రఫీని చెక్ చేసుకోవాల్సిందే.
జిమ్ బాబులకు జిత్తులమారి సవాల్
ఈ వీడియో వైరల్ అవ్వగానే సోషల్ మీడియాలో నెటిజన్లు రచ్చ మొదలుపెట్టారు. "మేము 25 ఏళ్లకే మెట్లు ఎక్కితే ఆయాస పడుతున్నాం.. మల్లన్న ఏమో 70 ఏళ్ల వయసులో గాలిలో తేలుతున్నాడు. బహుశా మల్లారెడ్డి యూనివర్సిటీలో 'ఎనర్జీ మేనేజ్మెంట్' అనే ప్రత్యేక కోర్సు ఏమైనా ఉందా?" అంటూ కామెంట్ చేస్తున్నారు. "రాజకీయాల్లో సీటు దక్కకపోయినా పర్లేదు కానీ, స్టేజ్ మీద ఈ సీటు (స్టెప్పు) మాత్రం మల్లన్నదే!" అంటూ ఇంకొందరు కొనియాడుతున్నారు.
డైలాగ్ ఏదైనా డ్రెస్ ఏదైనా మల్లారెడ్డి మార్కు పడాల్సిందే. ఆ మధ్య "మల్లారెడ్డికి కోపం వచ్చింది.. తోలు తీస్తా!" అని వార్నింగ్ ఇచ్చిన నోటితోనే ఇప్పుడు "హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ" అంటూ చిందులు వేయడం ఆయనకే సాధ్యం.
యూనివర్సిటీలు పెట్టడమే కాదు.. యూత్ ఐకాన్ కూడా!
రాజకీయాల్లో గెలుపోటములు సహజం కానీ.. వినోదాన్ని పంచడంలో మల్లన్న ఎప్పుడూ ఓడిపోరు. ఆయన విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులు కూడా "మా చైర్మన్ గారు మా కంటే స్పీడ్‌గా ఉన్నారు" అని మురిసిపోతున్నారు. 70 ఏళ్ల వయసులో కూడా ఆ మెడలో గులాబీ కండువా ఊగుతుంటే రాజకీయ వేదికల కంటే సినిమా ఆడియో లాంచ్ లే ఆయనకు కరెక్ట్ ఏమో అనిపిస్తుంది.
రాజకీయ నాయకులు అంటే సీరియస్‌గా మొహం పెట్టి, ఫైళ్లు పట్టుకుని ఉండాలి అనే రూల్‌ను మల్లారెడ్డి ఎప్పుడో బ్రేక్ చేసేశారు. "లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి.. కష్టపడాలి.. వీలైతే నాలుగు స్టెప్పులు వేయాలి" అనే సరికొత్త ఫిలాసఫీని ఆయన సమాజానికి చాటిచెప్పారు. మొత్తానికి మల్లన్న వైరల్ డాన్స్ చూశాక నెటిజన్లు ఏకాభిప్రాయానికి వచ్చారు: "మాస్ అంటే హీరో కాదు.. మల్లన్నే!"