హైదరాబాద్‌లో డ్ర*గ్స్ పార్టీ.. కాల్పులు.. పాల్గొన్న ఏపీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే.. పోలీసుల పరీక్షలో తేలిందేంటంటే?
పోలీసులు అందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా పైలట్ రోహిత్ రెడ్డి సహా ఐదుగురికి కొకైన్ పాజిటివ్‌గా తేలిందని పోలీసుల నుంచి సమాచారం అందుతోంది.;
హైదరాబాద్ నగర పరిసర ప్రాంతమైన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో గుట్టుగా నిర్వహించిన డ్ర*గ్స్ పార్టీ పెద్ద సంచలనంగా మారింది. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికు చెందిన ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ పార్టీలో రాజకీయ నాయకులు, రియల్టర్లు, వ్యాపారులు పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు చేసిన దాడుల్లో డ్రగ్స్‌తో పాటు ఆయుధం కూడా బయటపడడంతో కేసు మరింత తీవ్రంగా మారింది.
పోలీసుల వివరాల ప్రకారం.. మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో వీకెండ్ పార్టీ పేరుతో డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారం పోలీసుల ఈగల్ టీమ్‌కు అందింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు శనివారం రాత్రి ఫామ్‌హౌస్‌పై దాడి నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు పోలీసులను చూసి భయాందోళనకు గురయ్యారని తెలిసింది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ అనే వ్యక్తి గాల్లోకి కాల్పులు జరపడం కలకలం రేపింది.
పోలీసులు ఫామ్‌హౌస్‌ను పూర్తిగా తనిఖీ చేయగా అక్కడ రెండు గ్రాముల కొకైన్ (వైట్ పౌడర్) స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఖరీదైన మద్యం బాటిళ్లు, హుక్కా సామగ్రి కూడా లభించినట్లు అధికారులు తెలిపారు. కాల్పులకు ఉపయోగించిన గన్ రితీష్ రెడ్డి పేరుతో ఉన్న లైసెన్స్‌డ్ ఆయుధంగా పోలీసులు గుర్తించారు. అనంతరం కాల్పులు జరిపిన నమిత్ శర్మను పోలీసులు అరెస్టు చేసి ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఈ పార్టీలో మొత్తం 11 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, నమిత్ శర్మ, రమేష్, శ్రవణ్ కుమార్, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, షరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, రితీష్ రెడ్డి, ప్రియాంక రెడ్డి ఉన్నట్లు వెల్లడించారు.
పోలీసులు అందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా పైలట్ రోహిత్ రెడ్డి సహా ఐదుగురికి కొకైన్ పాజిటివ్‌గా తేలిందని పోలీసుల నుంచి సమాచారం అందుతోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి.. అయితే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు డ్రగ్స్ టెస్ట్‌లో నెగటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిని మరిన్ని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
దర్యాప్తులో భాగంగా కౌశిక్ రవి సిమ్లా నుంచి డ్రగ్స్ తీసుకువచ్చినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితులపై బీఎన్ఎస్ సెక్షన్ 109తో పాటు ఎన్.డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 22, ఆర్మ్స్ యాక్ట్ .. ఎక్సైజ్ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు.
ఫామ్‌హౌస్‌లలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫామ్‌హౌస్‌లపై కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు కొనసాగిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.